- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కులం, డబ్బు, తాయిలాలే ప్రచారాస్త్రాలు!
యుద్ధం పేదల కోసం కాదు.. పెత్తందార్ల కోసం పెత్తనం కోసం. స్వాతంత్య్ర దినోత్సవం రోజైనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొన్నైనా నిజాలు చెబుతారేమోనని ప్రజలు ఎదురుచూశారు. పేదలపై పెత్తనం చేయాలనే భావజాలం రూపుమాపుతానని, పేదలు గెలిచే వరకు యుద్ధం కొనసాగుతుందని ఆయన సెలవిచ్చారు. సామాజిక న్యాయం అంటే నినాదం కాదని, అమలుచేసే విధానం అని ముఖ్యమంత్రి చెప్పడం కొంత ఎబ్బెట్టుగా ఉంది. ఫ్యూడల్ ప్రభువుల వారసుడైన జగన్ రెడ్డి ఇలాంటి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. దేశంలో పెత్తందారులకు ప్రతిరూపం అయిన జగన్ రెడ్డి పేదలు గెలిచే వరకు యుద్ధం చేస్తానంటూ సంఘసంస్కర్తలా మాట్లాడుతున్నారు. బూర్జువా భావజాల లక్షణాలను పుణికిపుచ్చుకున్న ముఖ్యమంత్రి నోటి నుంచి ఇలాంటి మాటలు వినడం వింతగా ఉంది. ప్రతి సభలో కూడా దుష్టచతుష్టయం అంటూ ప్రతిపక్ష నేతలపైన, పత్రికాధిపతులపైన పదేపదే తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాలను కులాలతో ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. దేశంలో కుల మహమ్మారి శతాబ్దాలుగా సాగించిన మానవ హననం గురించి విన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, తిరుగుబాటును గమనించి వారి సానుభూతి పొందేందుకు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు.
ప్రజలను మూడు విభాగాలుగా విభజించి..
మంత్రి మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60శాతం పదవులు ఇచ్చామని తనని తాను కీర్తించుకున్నారు. గతంలో అసలు సామాజిక న్యాయం లేనట్లు, తాను మాత్రమే సామాజిక న్యాయానికి ప్రతిరూపం అని జబ్బలు చరుచుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో పెత్తందారి పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికం రాజ్యమేలుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారే ప్రభుత్వంలో పెత్తనం చెలాయిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల విధులు, బాధ్యతలను స్వేచ్ఛగా నిర్వహించుకునే అవకాశం లేకుండా వారిని బానిసలుగా, భజంత్రీలుగా మార్చారు. కేబినెట్‌తో సంబంధం లేకుండా తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, నడిపించడం పెత్తందారీ వ్యవస్థలో భాగం కాదా?
అసలు మీ కన్నా పెత్తందారులు ఎవరున్నారు? సాక్షి ఆఫీసులో పెద్ద గుమస్తాగా పని చేసిన సజ్జల సకల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పాలనకు సమాధి కట్టి సమస్త పాలనా యంత్రాంగాన్ని సలహాదారులు శాసిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు పైన కూర్చొని ఉంటే.. బడుగు, బలహీన వర్గాల మంత్రులు చేతులు కట్టుకుని నిలబడి ఉండటం మీ పెత్తందారీ విధానానికి అద్దం పడుతోంది. మంత్రి విశ్వరూప్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టడాన్ని అందరూ చూశారు. గతంలో తిరుమల పర్యటనలో పెద్దిరెడ్డిని పక్కనే కూర్చోబెట్టుకున్న జగన్ రెడ్డి.. దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి తన పక్కన కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా అవమానించారు. చివరకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని సైతం తన కులం, మతం వారికే కట్టబెట్టి హిందువుల మనోభావాలను గాయపరిచారు.
రాష్ట్రంలోని ప్రజలను సాంఘికంగా, సామాజికంగా, ఆర్ధికంగా విభజించారు. అత్యంత జుగుప్సాకరమైన కుల వివక్షతను పెంచి పోషిస్తున్నారు. దేశం మొత్తం కీర్తిస్తున్న వ్యక్తులను, సంస్థలను కుల పిశాచం బలిపీఠంపై ఉంచారు. సంపద సృష్టించడం చేతగాక సంపద సృష్టించే కంపెనీలు, సంస్థలకు సైతం కుల ముద్ర వేసి తరిమేసిన ఘన చరిత్ర జగన్ రెడ్డిది కాదా? రాష్ట్రంలో కుల వ్యవస్థలో కనిపించే మానవ క్రౌర్యానికి, నియంతృత్వానికి మీ పాలన పరాకాష్ట. అంటరానితనం, అస్పృశ్యత దేశంలో కనుమరుగవుతుంటే.. మీ ఏలుబడిలో వాటి భౌతికరూపాలు, లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి యావత్ జాతి సిగ్గుతో తలదించుకోవాలి. పెత్తందార్లు, పేదల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలకు కారణం మీ దివాలాకోరు పరిపాలన విధానం కాదా?
వెలి వేసినట్లు.. పేదల ఇళ్లు!
నిజంగా పేదలపై అంత ప్రేమ ఉంటే తండ్రి అధికారాన్ని, మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రోకోలతో పోగేసుకున్న సంపదలో ఒక్క శాతమైనా పేదలకు పంచగలరా? వెయ్యి మందికి పైగా మీ సొంత సామాజికవర్గం వారికి కీలకమైన పదవులు కట్టబెట్టారు. మీరు నామినేట్ చేసిన కీలకమైన పోస్టులలో బడుగు బలహీనవర్గాల వారు ఎంతమంది ఉన్నారు మీరేమో పదుల సంఖ్యలో, వందల ఎకరాల్లో రాజప్రాసాదాలు నిర్మించుకున్నారు. పేదలకు మాత్రం పది ఇళ్లు కూడా కట్టించడం చేతకాలేదు. కట్టే ఇళ్లు కూడా నివాసయోగ్యం కావు. వారిని ఊరికి దూరంగా వెలి వేసినట్లు ఉంచడం మీ పెత్తందారీ పోకడలకు నిదర్శనం కాదా? ఒకవైపు వారిని అడుగడుగునా అవమానిస్తూ మరోవైపు మొసలి కన్నీరు కారుస్తున్నారు.
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ప్రజల్లో విద్వేషాలు పెంచే ప్రసంగాలు చేసి కుల, మత, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. వీటిపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేష వ్యాఖ్యల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర చాలా కీలకమైంది. పాలకపక్ష తప్పిదాలను ఎత్తిచూపుతూ సరైన దారిలో నడిపించే బాధ్యత ప్రతిపక్ష పార్టీలపై ఉంటుంది. ప్రతిపక్ష నేతల భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ వారిని నియంత్రిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సభలు, సమావేశాలు, పాదయాత్రలకు వస్తున్న స్పందనలను చూసి జగన్ రెడ్డి తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. అమరావతి రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు పదేపదే మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ అని మాట్లాడటం కోర్టు ధిక్కరణ కాదా? పోలవరం ప్రాజెక్టుపై ఎన్ని పిల్లి మొగ్గలు వేశారు, ఎన్నిసార్లు మాట మార్చారు?
కుల రాజకీయంలో ఘనాపాఠి!
ఈ నేపథ్యంలో నిర్మాణాత్మకమైన సూచనలను ప్రభుత్వానికి ఇవ్వడాన్ని ముఖ్యమంత్రి నేరంగా భావిస్తున్నారు. ప్రతిపక్షాలను అణచివేసే దిశగా అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, తప్పులు ఎత్తి చేయకూడదనే దుర్మార్గపు ఆలోచనల్లో ఉన్నారు జగన్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాననే స్పృహ కోల్పోయి అసందర్భంగా ప్రతి వేదికపైన సామాజిక అశాంతిని రగిల్చే అంతులేని విద్వేషాన్ని ప్రజల మదిలో నింపే ప్రయత్నం చేస్తున్నారు. కులం, డబ్బు, తాయిలాలు ఈ మూడే ఎన్నికలను ప్రభావితం చేస్తాయని జగన్ నమ్మకం. గత ఎన్నికల్లో ఈ అంశాలే తనకు విజయాన్ని చేకూర్చాయని విశ్వసిస్తున్నారు. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. కుల విద్వేష భావజాలాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారు.
చంద్రబాబు సామాజికవర్గంపై వ్యతిరేకత పెంచి మిగతా సామాజికవర్గాలను రెచ్చగొట్టారు. వారిపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలను పెంచారు. చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన 30 మంది డీఎస్పీలకు ఆయాచితంగా ప్రమోషన్లు ఇచ్చారని అబద్ధపు ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. ఇంతకంటే విషప్రచారాలు రాబోయే ఎన్నికల్లో మరిన్ని పోగేస్తున్నారు. వచ్చే ఎన్నికలను క్లాస్, క్లాసెస్ వార్ ముసుగులో క్యాస్ట్ వార్ నడపాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను కులాల పేరిట విభజించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. పేదలను పేదలుగానే ఉంచి పెత్తందార్లు అయిన అదాని, అమూల్, మేఘా ఇంజనీరింగ్, షిర్డీసాయి వంటి కంపెనీలకు సహజ వనరులను, రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారు.
అప్పుడు మాట్లాడండి!
అసలు యుద్ధం జరుగుతోంది పేద ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య. ఈసారి ఎన్నికల్లో ప్రజలు గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. దేశంలో ఏ ప్రభుత్వమూ ఈ విధమైన వికృత రూపాన్ని ప్రదర్శించడం లేదు. ఇంతటి అరాచకం, దుర్మార్గాలు, హింస, పీడన, పెత్తందారులు, ప్యాక్షనిస్టులకే సాధ్యం. పౌరహక్కులు, మానవహక్కులు కాలరాస్తున్నారని తెగ బాధపడుతున్నాం.. అసలు జీవించే హక్కునే హరించివేస్తున్నారు. కులపునాదులపై మీరు నిర్మించిన పార్టీ, అహంకారపు కోటలు కూలిపోయే సమయం ఆసన్నమైంది. ఇకనైనా మీ చెర నుంచి రాజ్యాంగానికి విముక్తి కలిగించాలి. ముఖ్యమంత్రి సామాజికవర్గానికి ఆయాచితంగా పందేరం చేసి.. వేసిన పదవులను, అధికారాలను, అక్రమ సంపాదనను బడుగు, బలహీనవర్గాలకు పంచిన తర్వాతనే సామాజిక న్యాయం గురించి మాట్లాడితే బాగుంటుంది. అదే సామాజిక నీతికి పునాది అవుతుంది.
మన్నవ సుబ్బారావు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు
99497 77727