అభ్యర్థుల మానసిక క్షోభకు వెలకట్టగలమా

by Sumithra |   ( Updated:2023-04-15 20:01:03.0  )
అభ్యర్థుల మానసిక క్షోభకు వెలకట్టగలమా
X

‘దొంగలున్నారు జాగ్రత్త!’ ఆరు నెలల క్రితం వచ్చిన ఈ సినిమా దొంగతనాల వల్ల జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పింది. పైకి మనకు చిన్నచిన్న దొంగతనాల్లాగే కనిపించినా.. వీటి వల్ల ఎన్ని జీవితాలు ఎంతగా అతలాకుతలమైపోతాయో విస్పష్టంగా చెప్పింది. సైంటిస్ట్ అవ్వాలనే లక్ష్యంతో చదువుకునే విద్యార్థినికి డబ్ల్యూహెచ్ఓ సెమినార్ ఆఫర్ వస్తుంది. దీంతో ఆమె ఎయిర్ పోర్ట్ కు వెళ్తుండగా, చిన్న పని కోసం మార్గమధ్యంలో కారు ఆపుతుంది. అంతలోనే ఆమె ల్యాప్ టాప్, సర్టిఫికెట్లు చోరీకి గురవుతాయి. దీంతో తీవ్ర మానసిక వేదనతో ఆ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోగా, తండ్రి ఆ దొంగపై ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో తీసిన సినిమా ఇది. కొన్ని డబ్బుల కోసమే ఈ చోరీ చేస్తున్నానని దొంగ అనుకుంటుండగా, దీని వల్ల ఎందరు, ఎంత మానసిక క్షోభ అనుభవించాల్సి వచ్చిందో, ప్రాణాలు ఎలా పోయాయో దీంట్లో స్పష్టంగా చెప్పారు. ఈ సినిమా గురించి ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశాన్ని ప్రభుత్వం ఎంతో లైట్ గా తీసుకుంటున్నది. మంత్రుల నుంచి ఉన్నతాధికారుల ప్రకటనలు సైతం దాన్నే ప్రస్ఫుటిస్తున్నాయి. అయితే పరీక్షలు రద్దు చేయడం ద్వారా ఎగ్జామ్స్ రాసిన లక్షలాది మంది అభ్యర్థుల మానసిక క్షోభను అర్థం చేసుకునేందుకు మాత్రం ప్రభుత్వం సిద్ధంగా కనిపించడం లేదు.

ప్రిపరేషన్ కూడా ‘పరీక్షే’

ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావడం కూడా అభ్యర్థులకు దీర్ఘకాలిక పరీక్ష లాంటిదే. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారికి ఎగ్జామ్స్ రద్దు వల్ల పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, పేద, మధ్యతరగతి విద్యార్థులు, అభ్యర్థులకు మాత్రం ఎన్నటికీ తీరని కష్టమే. జాబ్ నోటిఫికేషన్లు రాగానే అప్పులు చేసి మరీ గ్రామాల నుంచి పట్టణానికి వచ్చి చదువుకున్న విద్యార్థులు లక్షల్లో ఉంటారు. ఆస్తులు కూడా అమ్మి పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు లాంగ్ లీవ్ పెట్టి ఎందరో మంది పరీక్షలు రాశారు. పరీక్షలు రాయడానికి వేలాది మంది తమ ప్రయివేటు ఉద్యోగాలను వదులుకొని మరీ ప్రిపేర్ అయ్యారు. తల్లి పుస్తెల తాడు అమ్మి ఒకరు, చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులను తీసుకొచ్చి మరొకరు.. ఇలా కోచింగ్ లు తీసుకొని ఎగ్జామ్స్ కు సిద్ధమయ్యారు. ఎగ్జామ్స్ రాయడానికి వీరు ఖర్చు చేసిన డబ్బు, సమయాన్ని ‘పేపర్ లీక్ కామన్ ఇన్సిడెంట్’గా చెప్పే ప్రభుత్వం పెద్దలు తిరిగి తెచ్చివ్వగలరా ఎగ్జామ్స్ రద్దు చేసుకొని చేతులు దులుపుకుంటే సరిపోతుందా? దొంగలను మాత్రమే జైల్లో పెట్టి పనైపోయిందంటే ఒప్పుకోవాల్సిందేనా? నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్పీఎస్సీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోరు? పరీక్షల రద్దుతో అభ్యర్థులు పడ్డ మానసిక క్షోభను అర్థం చేసుకునేదెవరు? మళ్లీ ఎగ్జామ్స్ రాయడానికి, ప్రిపేర్ కావడానికి అయ్యే ఖర్చు ఎవరు భరించాలి?

పరిహారం డిమాండ్ న్యాయమైనదే

ఎన్నాళ్లుగానో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడటం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా వృథానేనా అని కుమిలిపోతున్నారు. దీంతో పరీక్షల రద్దుతో నష్టపోయిన అభ్యర్థులకు పరిహారం చెల్లించాలనే డిమాండ్‌ను ప్రతిపక్షాలు ముందుకు తీసుకొచ్చాయి. ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష పరిహారమివ్వాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేస్తుండగా, కనీసంగా రూ. 50 వేలైనా ఇవ్వాలని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల కోరుతున్నారు. దొంగలను పట్టుకొని శిక్షించడం ఒకవైపైతే.. ఆ దొంగతనాల వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేయాల్సింది ప్రభుత్వమే కదా! కానీ ప్రతిపక్షాల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొట్టి పారేస్తున్నారు. అభ్యర్థులకు పరిహారం ఇవ్వడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు.

ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినప్పుడు పరిహారం ప్రకటించే ప్రభుత్వం, కొందరు లీకువీరుల వల్ల లక్షలాది మంది అభ్యర్థులు తమ సమయం, ఖర్చును నష్టపోయినప్పుడు పరిహారం ఎందుకు ప్రకటించకూడదు? ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయనే కాకుండా మానవత్వంగానైనా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండు. మొత్తం ప్రిపేర్ అయిన సమయాన్ని పరిగణనలోకి తీసుకోకపోయినా, నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్స్ మధ్యలో ఉండే సమయం, ఆ సమయంలో పట్టణంలో ఉండడానికి, తినడానికి అయ్యే ఖర్చు, కోచింగ్ సెంటర్ల ఖర్చును లెక్కగట్టయినా సరే ఇస్తే బాగుంటుంది. లేకుంటే క్వాలిఫై అయి, మెరిట్ సాధించిన పేద, మధ్యతరగతి అభ్యర్థులకైనా పరిహారమిచ్చేలా కార్యాచరణ రూపొందించాలి. పరీక్షల రద్దుతో అభ్యర్థుల మానసిక క్షోభకు వెలకట్టలేకపోయినా, పరిహారం ఇవ్వడం వల్ల నిరాశ, నిస్పృహలకు లోనైన అభ్యర్థులకు కాస్తయినా ఉపశమనం లభిస్తుంది.

- మహమ్మద్ ఆరిఫ్, సీనియర్ జర్నలిస్ట్,

96184 00190




Advertisement

Next Story