'ఎన్నికల కమిషన్' స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించగలదా?

by Ravi |   ( Updated:2024-03-19 01:00:13.0  )
ఎన్నికల కమిషన్  స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించగలదా?
X

ఎన్నికల కమిషన్ అధికారి అరుణ్ గోయల్ హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకు మునుపే ఒక కమిషనర్ పదవీకాలం పూర్తి అయినందున పోస్ట్ ఖాళీగా ఉంది. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే పదవిలో మిగిలారు. ఆయన ఒక్కరే రాబోయే లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తారా? అన్న మీమాంస తలెత్తిన సమయంలో ప్రధానమంత్రి గత గురువారం మధ్యాహ్నం ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం ప్రక్రియను పూర్తి చేశారు.

మోడీకి కావలసింది రాజ్యాంగ పరిరక్షణా వ్యవస్థలు కావు. తన మాట తూ.చా తప్పకుండా పాటించే విధేయ సంస్థలే కావాలి.ఇంతకుముందు ఎన్నికల కమిషనర్‌‌ను నియమించే కమిటీలో ప్రధానమంత్రి తోపాటు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండేవారు. కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ కమిటీలో స్థానం ఉండటం మోడీకి ఇష్టం లేదు. అందుకే సుప్రీంకోర్టు మాట చెల్లకుండా చేయడానికి మోడీ ప్రభుత్వం హడావుడిగా ఎన్నికల కమిషనర్ల నియామక విధివిధానాల చట్టాన్ని మార్చివేసింది. అంతేకాకుండా ఆ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా చేశారు. కొత్త కమిటీలో ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సభ్యుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు మాత్రమే సభ్యులుగా ఉంటారు.

అంతటా మోడీనే

అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా స్థానం లేకుండా చట్టం తీసుకురావడానికి సవాల్ చేస్తూ ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం (ఏడీఆర్), కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాగూర్ కూడా సుప్రీంకోర్టులో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరగవలసిన సమయంలో అర్జెంట్‌గా మోడీ ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియమాకాన్ని హడావుడిగా పూర్తి చేశారు. ఈ కమిటీలో సభ్యుడైన లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ కొత్త చట్టం తీసుకురావడాన్ని వ్యతిరేకించారు. అంతేకాక గురువారం జరిగిన నియామక పద్ధతి మీద కూడా అభ్యంతరాలు లేవనెత్తుతూ ఒక అసమ్మతి పత్రాన్ని సమర్పించారు. అయితే ఈ అసమ్మతి పత్రాన్ని ఖాతరు చేసేవారెవరు? అసమ్మతి తెలియజేశాను అన్న ఆత్మ సంతృప్తి మాత్రమే ఆ ప్రతిపక్ష నాయకుడికి దక్కింది. ఈ ముగ్గురు సభ్యులలో ఇద్దరు ప్రభుత్వానికి చెందిన వారే కనుక ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ఇక అసమ్మతికి, భిన్న అభిప్రాయానికి తావుండే అవకాశం లేదు. కనుక మోడీ మాటే అంతటా, అన్నివేళలా చెల్లుబాటు అవుతుంది.

ఇష్టానుసారం జరగాలని..

రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ సర్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిని మరో ఇద్దరు కమిషనర్లను ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. నియమకాలు ప్రభుత్వం ద్వారానే జరుగుతాయి. అందులో ఎవరికీ, ఎలాంటి అభ్యంతరాలూ లేవు. కానీ, ఎవరిని నియమిస్తున్నారు ఆ నియామక ప్రక్రియ సజావుగా చట్టానికి లోబడే ఉందా లేదా అనేదే సమస్య. అయితే ఎటుతిరిగి చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటే చెల్లుబాటు అవుతుంది. ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం ఆయన మంత్రివర్గం సహచరులలో ఎవరికీ లేదు. ఎన్నికల సంఘంలో సభ్యులుగా ఎవరైతే నేమి అన్న అహంకార ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సీబీఐ, విజిలెన్స్ కమిషన్ కన్నా ఎక్కువ స్వతంత్ర ప్రతిపత్తితో మెలగవలసిన వ్యవస్థ ఎన్నికల కమిషన్‌ది.

భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు ఒక విశేషమైన ప్రత్యేక ప్రతిపత్తి స్థానాన్ని కల్పించింది. ఆ కమిషన్ వ్యవహారంలో ప్రభుత్వం చేసుకోవడానికి వీలుండదు. ఇలాంటి వెసులుబాటు ఉంటేనే కానీ, మన ప్రజాస్వామ్యానికి గుండెకాయవంటి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదు. కానీ ఎన్నికల ప్రక్రియ క్రమం అంతా తన ఇష్టానుసారమే జరగాలన్నది మోడీ పంతమైనప్పుడు రాజ్యాంగాన్ని మాత్రం ఆయన ఎలా ఖాతర్ చేస్తారు?

విధేయ సంస్థలే కావాలి!

ఏ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో, అంతా మోడీ ఇష్ట ప్రకారమే జరగడం మొదలై చాలా కాలమే అయింది. గత బెంగాల్ శాసనసభ ఎన్నికలు నిర్వహించిన తీరు దీనికి ప్రబలమైన ఉదాహరణగా చెప్పుకోవాలి. మోడీకి కావలసింది రాజ్యాంగ పరిరక్షణా వ్యవస్థలు కావు. తన మాట తూ.చా తప్పకుండా పాటించే విధేయ సంస్థలే కావాలి. 2019 ఎన్నికల్లో మోడీ, అమిత్ షా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఫిర్యాదులు వస్తే, అప్పటి ఎన్నికల కమిషన్ అధిపతి 'లవాస' ఏదో చర్య తీసుకోవాలన్న ఆలోచన చేస్తే ఆయన కుటుంబంపై సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించారు. ఒత్తిడులను తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లో ఆయన తన పదవికి రాజీనామా చేసి పోయేదాకా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడులు తెచ్చింది. ఒక రకంగా లవాసాను అక్షరాల ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తరిమేశారు. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్లు కచ్చితంగా మోడీ మనస్సు ఎరిగి నడుచుకొనే వారే అయి ఉంటారనడంలో సందేహం ఏముంది?

డా. కోలాహలం రామ్ కిషోర్

98493 28496

Advertisement

Next Story

Most Viewed