బీఆర్ఎస్‌కి ఖేదం.. బీజేపీకి మోదం!

by Ravi |   ( Updated:2024-06-06 00:46:02.0  )
బీఆర్ఎస్‌కి ఖేదం.. బీజేపీకి మోదం!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంది. కానీ దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తానన్న బీఆర్ఎస్‌లో స్తబ్దత ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని బీజేపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. మోదీ అమిత్ షా వరుస పర్యటనలతో పాటు గతంలో బండి సంజయ్ చేసిన కృషి, రాష్ట ఆధ్యక్షునిగా కిషన్ రెడ్డి వ్యూహం అనూహ్య ఫలితాలు ఇచ్చాయి. మోదీ చరిష్మాతో పాటు రానున్న కాలంలో రాష్ట రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకోవాలన్న ఆశయంతో బీజేపీ కలిసికట్టుగా ఓ జట్టుగా పనిచేసింది. పసుపుబోర్డు ఏర్పాటు తదితర ఆంశాలు బీజేపీ ఈసారి లాభం చేకూర్చినాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మాదిరిగా కాకుండా తెలంగాణలో బహుళ ప్రాంతీయ పార్టీలు లేకపోవడం బీజేపీ అవకాశాలను మరింత సులభతరం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలుగుదేశం వదిలిపెట్టినట్టి శూన్యతను బీఆర్ఎస్ ఉపయోగించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడంతో, మారిన బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్ళింది.

బీజేపీ ప్రభంజనం

2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో.. అప్పట్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఐదు సీట్లు గెలుచుకుంది. 2018 లో భాగస్వామ్యం విడిపోయింది. గోషామహల్ నుండి రాజా సింగ్ మాత్రమే అసెంబ్లీలో బీజేపీ శాసనసభ్యుడు. కొద్ది నెలల్లోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 2020 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ మళ్లీ అందరికీ షాక్ ఇచ్చింది, దాని సంఖ్యను కేవలం నాలుగు సీట్ల నుండి 48 సీట్లకు పెంచుకుంది. పైగా 35% ఓట్ షేర్‌తో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది. 2014 తర్వాత ఇది అత్యధిక సంఖ్యే, పార్టీ ఓట్ల శాతం 2014లో 10.5% నుంచి 2019 లోక్ సభ ఎన్నికల్లో 19.45%కి నిరంతరం పెరుగుతూ వస్తోంది.

బీసీలే దన్నుగా విజయయాత్ర

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాని సంఖ్య మళ్లీ 14%కి పడిపోయింది, 2024 ఎన్నికల్లో మోడీ ప్రజాదరణ తమకు సహాయపడుతుందని నాయకులు ఆశించారు. మహారాష్ట్ర, కర్ణాటకతో ఉన్న తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఆర్యసమాజ్ బలంగా ఉంది. 'ఆర్యసమాజ్ ప్రభావం క్రమంగా బలహీనపడినప్పుడు, ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా జిల్లా కేంద్రాలలో ప్రవేశిం చగలిగింది. ఉత్తర తెలంగాణలో (వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాలు) వామపక్ష భావజాలానికి వ్యతిరేకంగా ప్రజల నుండి మద్దతు పొందగలిగింది. 52% వెనుకబడిన తరగతులు, 18% దళితులు, దాదాపు 9% మైనారిటీలు ఉన్న రాష్ట్రంలో తమ కుల, సామాజిక ఇంజనీరింగ్ ప్రభావవంతంగా ఉందని బీజేపీ ఆంచనా. అదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ పాలనలో వెనుకబడిన తరగతులకు స్థానం కల్పించడంలో విఫలమయ్యాయి, తెలంగాణలోని బీసీలు బీఆర్ఎస్ క్షీణత తర్వాత బీజేపీ వైపు చూశారు. అదే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణమైంది.

- సుధాకర్

99898 55445

Advertisement

Next Story

Most Viewed