ప్రభుత్వాన్ని వణికిస్తున్న ప్రజా వ్యతిరేకత

by Ravi |   ( Updated:2023-11-10 00:45:20.0  )
ప్రభుత్వాన్ని వణికిస్తున్న ప్రజా వ్యతిరేకత
X

త తొమ్మిదేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల నుంచి కాకుండా ప్రజా వ్యతిరేకత అనే బలమైన ప్రత్యర్థిని చూసి వణుకుతోందంటే అతిశయోక్తి లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అసమర్థత వల్ల అప్పనంగా అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి 2023 అసెంబ్లీ ఎన్నికలు కత్తిమీద సాములాగా మారాయి.

గర్జించే స్థాయి నుంచి..

ప్రస్తుతం కేసీఆర్ రాజకీయ అవినీతి ప్రజల చర్చల్లో ప్రధాన అంశం కానప్పటికీ పలు ఇతర కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తొలిసారిగా ఓటమి భయం పట్టుకుంది. ప్రధానంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, రాజకీయ, పౌర హక్కులను కాలరాయడం, ప్రజలకు అందుబాటులో పాలన లేకపోవడం. అధికార, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుడు దోవలో ఉపయోగించుకోవడం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ నేతల ఆకృత్యాలు మితిమీరిపోవడం, పరీక్షల నోటిఫికేషన్లు, పేపర్ లీకులతో ప్రభుత్వ పరువు గంగలో కలవడం, పార్టీలోని అగ్రనేతల నియంతృత్వ పోకడలు, అనుయాయులను అందలమెక్కించి ప్రజలను గాలికొదిలేయడం వంటివి గత అయిదేళ్లుగా ప్రజల నోళ్లలో నిత్యం నానుతూ వచ్చాయి.

ముఖ్యంగా గత నాలుగైదు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కానీ, కేసీఆర్ కానీ చేసిన అతిపెద్ద పొరపాట్లు ప్రజల మూడ్‌ని వ్యతిరేకంగా మలిచాయి. అవేమిటంటే, అభ్యర్థుల ఎంపిక, డబ్బులు ఎరవేసే రాజకీయం, సోషల్ మీడియాలో మైండ్ గేమ్స్, టికెట్ రాని ఇతర పార్టీల నాయకులను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించడం, ప్రవల్లిక ఆత్మహత్య లాంటి ఘటనలపై అవగాహన లేకుండా నాయకత్వమే వ్యాఖ్యానించడం, ఇవన్నీ ప్రజల్లో ఎంత అసంతృప్తిని పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ జీవిత చరిత్రలో మొదటిసారిగా ప్రసంగాల్లో గర్జించే స్థాయి నుంచి తనను తాను కాపాడుకునే స్థాయికి పడిపోయారు. ఇటీవల వరుసగా జరిగిన ఇలాంటి పరిణామాలు కేసీఆర్‌కు భయం పట్టుకుందని తెలియజేస్తున్నాయి.

భయపెడుతున్న సర్వే రిపోర్టులు

కొంత కాలం క్రితం వచ్చిన విశ్వసనీయమైన సర్వే రిపోర్టులు కేసీఆర్ ప్రభుత్వాన్ని కంపింప జేస్తున్నాయి. దీంతో కేసీఆర్ ప్రసంగాల్లో తాను ఓడిపోతున్నాను అన్న భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దానికి తోడు తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత 70 నుంచి 75 శాతానికి చేరుకోవడం గమనార్హం. ప్రముఖ సర్వే ఫలితాల బట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ముందడుగులో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ తప్పుడు అంచనాలు, లెక్కల వల్ల, అలసత్వం, నిర్లక్ష్యం వల్ల బీఆర్ఎస్‌కు లాభం చేకూరవచ్చనడంతో సందేహం లేదు. కానీ అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ సర్వ శక్తులూ కూడదీసుకుని గట్టి పోటీ ఇవ్వగలిగితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 25 స్థానాలకే పరిమితం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కొంతమంది సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు.

ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలు రెండుగా చీలిపోయారు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా, అనుకూలంగా.. వచ్చే ఎన్నికల్లో సైలెంట్ ఓటర్లు, తటస్థ ఓటర్లు (యువత, రైతులు, నిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు) కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ పనితీరు ఇప్పుడు ప్రజల పరిశీలన అనే లిట్మస్ పరీక్షను ఎదుర్కొంటోంది. తెలంగాణ వాదం నీరసించిపోవడం, కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడం, కేసీఆర్ చరిష్మా (2014లో 75 శాతంగా ఉండగా ఇప్పుడది 25 శాతానికి) పడిపోవడం, ప్రభుత్వ పథకాలపై నిర్లక్ష్యం, దళిత బంధులో అవినీతి రాజ్యమేలడం, ప్రశ్నా పత్రాల లీక్, మేడిగడ్డ ఘటన వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపనున్నాయి.

ఈ పార్టీల మధ్యే పోటాపోటీ

నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాజా అంచనా ప్రకారం 12 స్థానాలను బీజేపీ, బీఎస్పీ, ఎంఐఎం పంచుకోగా మిగిలిన వాటిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా తలపడనున్నాయి. కేసీఆర్ ఒకవైపు డబ్బును, మరోవైపు పోల్ మేనేజ్‌మెంట్‌ను నమ్ముకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను, సృజనాత్మకమైన పథకాల మ్యానిఫెస్టోను నమ్ముకుంది. ఈ రెండు పార్టీల వ్యూహాల్లో ఏది ఎక్కువ ప్రభావం చూపగలిగితే వారికే విజయం తథ్యం. ఆట ఎప్పుడో మొదలైంది. రానున్న రోజుల్లో ఇది తారస్థాయికి చేరుకోబోతోంది. ఎవరు గెలిచినా తెలంగాణలో రాజకీయాలు మునుపటిలో ఉండవన్నది నిజం. 2028 నాటికి తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి నాంది పలకవచ్చు కూడా.

- వి. వికాస్ కుమార్

[email protected]

Advertisement

Next Story

Most Viewed