కార్మిక హక్కుల ప్రదాత

by Ravi |   ( Updated:2024-05-01 00:45:40.0  )
కార్మిక హక్కుల ప్రదాత
X

భారతదేశ కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా అంబేద్కర్ చేసిన కృషి నిరుపమానం అనే చెప్పాలి. కార్మిక జీవితాలను మెరుగుపర్చిన ఎన్నో చారిత్రాత్మకమైన చట్టాలను ఆయన రూపొందించారు. అవి.. పని గంటలు 12 నుండి 8 గంటలకు తగ్గింపు, లింగ భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం, వేతన చెల్లింపు చట్టం, ఉద్యోగ వేతన సవరణ చట్టం, భారత కర్మాగారాల చట్టం, భారత కార్మిక సంఘ చట్టం, కార్మికుల పరిహార చట్టం, కార్మికుల రక్షణ చట్టం, ప్రసూతి ప్రయోజన చట్టం, కార్మిక రాజ్య బీమా చట్టం, మహిళలు, బాల కార్మిక రక్షణ చట్టం, బొగ్గు గనుల కార్మిక భవిష్య నిధి, బోనస్ చట్టం, మహిళా కార్మికుల సంక్షేమ నిధి, బొగ్గు గనుల్లో భూగర్భ పనుల్లో మహిళల నియామకంపై నిషేధం పునరుద్ధరణ, వేతనంతో కూడిన సెలవులు, సామాజిక భద్రత వంటివి. రాజ్యాంగంలో ఆయన ప్రవేశపెట్టిన ఆయా నిబంధనలు కాలక్రమంలో మారుతూ కొనసాగుతూ వస్తున్నాయి.

అయితే, భారతదేశంలో కొనసాగిన చాతుర్వర్ణ వ్యవస్థ వల్ల కార్మిక విభాగంలో కూడా కులం జోరపడి కార్మికుల మధ్య ఐక్యత లేకుండా చేసింది. కుల వ్యవస్థ వల్ల భారత దేశంలో అణగారిన ప్రజలని ఆనాడు దేశంలో ఉన్న అగ్రవర్ణ నాయకులు శ్రామికులు కార్మికులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలని తమ వ్యవసాయ భూముల్లో, ఇండ్లల్లో గోడ్డు చాకిరి చేయించుకుని వేతనం కూడా చెల్లించకపోయేది. పని చేయడమే తమ ధర్మంగా బీసీ ఎస్సీ ఎస్టీలు భావించేలా అలాంటి వ్యవస్థని అగ్రవర్ణాలు సృష్టించాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఏ ఉద్యమం కానీ ఇతర దేశాల నాయకులు కానీ భారతదేశ ప్రజల స్థితిగతులు మార్చలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కుల వ్యవస్థ అంత బలంగా నిర్మాణమై ఉన్నది. ఈ కుల వ్యవస్థని ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఏ విప్లవం కూడా ధ్వంసం చేయలేకపోయింది. భారతదేశ కార్మికుల్లో వెలుగులు తీసుకొచ్చిన ఘనత మాత్రం ఒక్క అంబేడ్కర్‌కి మాత్రమే దక్కుతది. ఎందుకంటే ఆయన రాసిన భారత రాజ్యాంగం వల్లనే ఈ దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న కార్మికులైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల జీవితాలు మారాయి.

నిజమైన కార్మిక ప్రేమికుడు

అంబేడ్కర్ తన కుటుంబం కంటే ఎక్కువగా భారతదేశ కార్మికులని ప్రేమించారు. తనకంటే ఎక్కువగా ఈ దేశ ప్రజలని మరీ ముఖ్యంగా అగ్రవర్ణ సమాజం చేత అనేక విధలుగా దోపిడీకి గురవుతూ శ్రామికులు, కార్మికులుగా ఉన్న బీసీ,ఎస్సీ, ఎస్టీ, అగ్రకులాల్లో ఉన్న పేదలని, మహిళలను ప్రేమించారు. దేశంలోని 93% బీసీ ఎస్సీ ఎస్టీల కార్మిక సమాజాన్ని తన గుండెల్లో పెట్టుకుని కార్మికుల రక్షకుడిగా, కార్మికుల బాంధవుడుగా, కార్మికుల పక్షవాతిగా అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయారు. కానీ అదే కార్మిక సమాజం అంబేద్కర్‌ని తమ గుండెల్లో నేటికి కూడా పెట్టుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కార్మిక సమాజానికి నాయకత్వం వహిస్తున్న అగ్రవర్ణ నాయకులదే. భారతదేశ చరిత్రలో కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయుడు అంబేద్కర్ మాత్రమే. 1936 ఆగస్టు 15 న అంబేడ్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని(ఐఎల్‌పీ) స్థాపించాడు. 1937 లో జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికల్లో అంబేద్కర్ ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసి 14 చోట్ల విజయం సాధించగలిగింది. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కార్మికుల చిన్న, సన్నకారు రైతుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. ముంబై లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1937_1942 వరకు సభ్యునిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 1942 జూలై 22 నుండి 1946 అక్టోబర్ 21 వరకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లేబర్ మినిస్టర్‌గా అంబేడ్కర్ పనిచేశాడు. కార్మిక విభాగానికి అంబేద్కరిజాన్ని, భారత రాజ్యాంగ విలువలని జోడించి రాజకీయాలు చేసి సామాజిక రాజకీయ ఆర్థిక పరివర్తన తీసుకురావడమే కార్మిక సమాజానికి, అంబేద్కర్‌కి ఇచ్చే నిజమైన గౌరవం.

పుల్లెంల గణేష్

95530 41549

Advertisement

Next Story

Most Viewed