దశాబ్ది నిర్బంధానికి వీడ్కోలు..

by Ravi |   ( Updated:2024-03-07 01:15:52.0  )
దశాబ్ది నిర్బంధానికి వీడ్కోలు..
X

సుదీర్ఘ నిర్బంధం తర్వాత ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, ఆయనపై అక్రమ కేసులు బనాయించి మానవ హక్కులను, పౌరహక్కులను హరించిన పోలీసులకు, చిత్ర హింసలు పెట్టిన జైలు అధికారులకు శిక్షలు ఉండవా? ఒక వికలాంగ మేధావిపై రాజ్యానికి ఇంత కక్ష సాధింపు అవసరమా? ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపే సంపాదకులకు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు, ప్రొఫెసర్లు, క్రీడాకారులకు ఈ నిర్భంధాలు తప్పవా? మనది ప్రజాస్వామిక రాజ్యమేనా? అని పౌర సమాజం ప్రశ్నిస్తుంది.

న్యాయానికి నిర్వచనం ఏమిటి? ‘వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. కానీ, ఒక నిర్దోషి కూడా శిక్షింపబడటానికి వీలులేదు’. అయినా మన దేశంలో గత పదేళ్లుగా ఈ అన్యాయం, అక్రమం, నిర్భంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి.. అనే బూటకపు కేసులో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంగ్ల శాఖలో ఫ్రొఫెసర్‌గా పనిచేసిన ప్రొసెసర్ జి.ఎస్.సాయిబాబాతో పాటు, మరో ఐదుగురిని ప్రభుత్వ అరెస్టు చేసి ఇంతకాలం జైళ్ళలో నిర్బంధించింది. ఇప్పుడు ఆ నిందితులను బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబా తో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగపూర్ బెంచ్ నాయమూర్తులు జస్టిస్ వినయ్ జ్యోషి, జస్టిస్ వాల్మీకి మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం, మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన అరోపణలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. అందుకే వారిపై అభియోగాలను కొట్టి వేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.

రెండోసారి అనుకూలంగా తీర్పు

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధం చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చ్‌లో సాయిబాబాతో పాటు ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబర్ 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తిరిగి మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ యం.ఆర్.షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారం అయినప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. ఈ తీర్పును మళ్ళీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మీకి మెనెజెస్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది.

న్యాయం గెలిచిందా, ఓడిందా!?

ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టు అయ్యారు. ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. దాదాపు పదేళ్లు జైలులో అనేక దుర్భర బాధలు అనుభవించారు. 95 శాతం వికలాంగుడు. నలుగురు మనుషుల సహాయంతో గానీ నిత్య కాలకృత్యాలను కూడా తీర్చుకోలేని అసహాయుడు. ఆయనకు నిత్యం చికిత్స అవసరం. అయినా జైలు అధికారులు సరైన చికిత్స అందించలేదు. రోజూ షుగర్, బీపీకి వాడవలసిన ఔషధాలు కూడా ఇవ్వక కోవిడ్ సమయంలో నానా ఇబ్బందులు పెట్టారు. చలికి కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా ఇవ్వడం లేదు. ఈ చలికి, అనారోగ్యంతో ఇక్కడే ఈ జైలులోనే చనిపోతానని ఆయన భార్య వసంతకు జైలు నుంచి పలు లేఖలు కూడా రాశాడు’. అవి అన్ని పత్రికల్లో వచ్చాయి. ఆమె విజ్ఞప్తులు అనేకమంది ఆయన అభిమానులను, పౌరహక్కుల నేతలను, మానవతా వాదులను కలచి వేసింది. ఇప్పుడు ఈ తీర్పు కాస్త ఊరట ఇచ్చింది. ఈ సుదీర్ఘ పోరాటం తర్వాత న్యాయం దక్కింది.

పదేళ్ళ నిద్రలేని రాత్రుల తర్వాత ఆమెకు, ఆమె కుటుంబానికి ఊరట లభించింది. ఈ సందర్భంగా సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త 10 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆయనను అర్ధాంతరంగా తొలగించారు. మానసికంగా ఆర్థికంగా ఆయన భార్య, కుటుంబ సభ్యులు నానా చిత్రహింసలు పడ్డారు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నామని ఆయన భార్య వసంత పత్రికలకు చెప్పారు. సాయిబాబా వ్యక్తిత్వం గురించి ఆయన విద్యార్థులకు, ప్రజలకు వాస్తవాలు తెలుసుననీ, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఇప్పటికీ కక్ష తీరలేదు

మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించి మంగళవారం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతో సహా ఇతరులను విడుదలను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టును కోరినట్లు మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ వీరేంద్ర షరాఫ్ తెలిపారు. గత పదేళ్ళుగా చేయని నేరాలను చేసినట్లు రుజువు చేయలేక విఫలమైన అసమర్థ ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వకేట్ జనరల్ చేసిన విజ్ఞప్తి అప్లికేషన్‌ను నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. అయినా ప్రొ.సాయిబాబాకి న్యాయం పూర్తిగా జరిగినట్లు కాదు. నిజానికి తిరిగి ఆయన ఉద్యోగం ఆయనకు ఇవ్వాలి. ఇంతకాలం ఆయన డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణించి జీతభత్యాలు చెల్లించాలి. సర్వీసులో కొనసాగినట్లు సర్వీసు బుక్‌లో నమోదు చేయాలి. బూటకపు కేసులో ఇరికించి, అక్రమంగా నిర్బంధించి వేధించినందుకు, ప్రభుత్వం ఆయనకూ, మొత్తం సమాజానికి క్షమార్పణలు చెప్పాలి. సంబంధిత పోలీసు ఇతర విచారణ అధికారులపై కఠిన చర్య తీసుకుంటూ ప్రకటన విడుదల చేయాలి.

డా. కోలాహలం రామ్ కిషోర్

98493 28496

Advertisement

Next Story