తెలంగాణాలో.. బీజేపీ విస్తరించడానికి కారణం ఎవరు..?

by Ravi |   ( Updated:2024-05-30 01:15:10.0  )
తెలంగాణాలో.. బీజేపీ విస్తరించడానికి కారణం ఎవరు..?
X

మూడు దశాబ్దాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష, విప్లవ ఉద్యమాల ప్రభావం చాలా ఉండేది. ముఖ్యంగా యువతీ యువకులు ఈ భావజాలానికి ఆకర్షితులై విప్లవ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసి ప్రజల మన్ననలు పొందేవారు. అందుకే ప్రజల బాధల విముక్తి కోసం జరిగే పోరాటాలకు ప్రజల మద్దతు బలంగా ఉండేది. ప్రజల్లో సైతం వామపక్ష ఉద్యమకారుల ద్వారా తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం, భరోసా ఉండేది. కానీ తెలంగాణ సమాజం పలు కారణాల వల్ల మారుతోంది.. బీజేపీకి టోకున మద్దతు పలికే స్థాయికీ రాష్ట్రం పరిణమిస్తోంది.

1990-2000 మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వామపక్ష ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసి, నిర్బంధాలను అమలు చేశాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి చైతన్య పూరిత భావనలకు, ప్రజా ఉద్యమాలకు దూరం చేశాయి. మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభం, గ్రామ గ్రామాన జేఏసీల ఏర్పాటు, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగాక.. నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రాంత మేధావి వర్గం, యువకులు, కవులు, కళాకారులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని సబ్బండ వర్గాలను మేలుకొలిపి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరుబాట చేశారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మెతో అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను సుసాధ్యం చేశారు.

చాపకింద నీరులా ఆ పార్టీ..

స్వరాష్ట్రం సిద్ధించాక ఏర్పడిన నూతన ప్రభుత్వం.. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ వచ్చింది. కానీ అప్పటివరకు చైతన్యపూరిత తెలంగాణ సమాజంపై అనధికారిక నిర్బంధాన్ని విధించింది. ప్రజా ఉద్యమాల వేదికైన ధర్నా చౌక్‌ను ఎత్తేసింది. స్వరాష్ట్రం ఏ ఉద్యమాల నుండి వచ్చిందో.. ఆ ప్రజాఉద్యమాలపై కేసీఆర్ నిర్భంధం విధించడం ప్రజలు హర్షించలేదు. ఎందుకంటే.. తెలంగాణ సమాజం తిండి లేకుండా భరిస్తుంది కానీ నిర్బంధాన్ని సహించదు. ఆధిపత్య భావజాలాన్ని భరించదు. వాటి నుండి విముక్తి కోసం పోరాడుతుంది.

రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చురుగ్గా ఉండేవి. దేశవ్యాప్తంగా బీజేపీప్రభావం చూపేది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పార్టీ ఫిరాయింపుల వలన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బలహీనపడ్డాయి. అలాగే ప్రజాస్వామిక, ఉద్యమ సంఘాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అనేక ప్రజా ఉద్యమాలను అణచివేయడంతో వామపక్ష భావజాలంతో పనిచేస్తున్న కార్మిక, కర్షక, ఉపాధ్యాయ సంఘాల ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో ఏర్పడిన శూన్య వాతావరణాన్ని బీజేపీ తన భావజాల వ్యాప్తికి అనుబంధ సంఘాలతో విశేషంగా కృషిచేసి గ్రామీణ ప్రాంతాల్లో తన ఓటు బ్యాంకు పెంచుకునే ప్రక్రియ చేపట్టింది. క్రమంగా చాప కింద నీరులా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా యువతలో పట్టు సాధించడం మనం గమనించవచ్చు.

హిందూ వర్గంపై పట్టు కోసం..

ఆ భావజాల వ్యాప్తి నిరోధానికి కృషి చేయాల్సిన వామపక్ష పార్టీలు, కార్మిక, కర్షక, ఉపాధ్యాయ ఉద్యమ సంఘాలు గత దశాబ్ద కాలంలో నాటి ప్రభుత్వం విధించిన నిర్బంధంలో ఉండిపోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పరోక్షంగా బీజేపీ ఎదగడానికి దోహదం చేశాయి. రాష్ట్రంలో బీజేపీ ఉధృతంగా తన భావజాల వ్యాప్తి చేస్తూ తెలంగాణ సమాజంలో అత్యధికంగా ఉండే హిందూ సామాజిక వర్గంపై పట్టు సాధించడం కోసం గ్రామా గ్రామాల్లో హిందూ ఉత్సవాలను విగ్రహాల ప్రతిష్టాపనలను తన అనుబంధ సంఘాలతో చేయించి రాష్ట్రంలో మెల్లమెల్లగా పార్టీ ప్రజలకు చేరువయ్యేలా చేసింది. దానికి తోడు దేశంలోనే తన సైద్ధాంతిక భావజాల వ్యాప్తికి సోషల్ మీడియా వినియోగించి.. యువకులు, మధ్యతరగతినీ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ సఫలం అయింది. ఇలా గతంలో ఉద్యమ భావజాలం, సామాజిక స్పృహ చైతన్యపురిత భావజాలం కలిగిన తెలంగాణ ప్రజల్లో యువకులు, మధ్యతరగతి ఉద్యోగులు ప్రజలు నిదానంగా ఆ భావజాలానికి దూరమై బీజేపీ సైద్ధాంతిక భావజాలానికి దగ్గరయ్యారు. బీజేపీ రాష్ట్రంలో తీసుకున్న ఇలాంటి చర్యల వలన మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో.. రాష్ట్రంలో ఆ పార్టీ గతంతో పోల్చుకుంటే..ఈ సారి ఓట్ బ్యాంకు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఓటు షేరింగ్ బీజేపీకి టర్న్ అవుట్ అయినట్టుగా క్షేత్ర స్థాయి పరిస్థితిని చూస్తే మనకు అవగతం అవుతుంది.

పార్లమెంట్ ఫలితాల తర్వాత..

ఏది ఏమైనా తెలంగాణ ఓటర్లలో కీలకమైన యువత, మధ్యతరగతి ఉద్యోగులు, మహిళల భావజాలంలో మార్పు వచ్చినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. వామపక్ష భావజాలానికి, ప్రజా ఉద్యమాలకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రజలు ఆ భావజాలానికి దూరం అయ్యారు. పట్టణ ప్రాంత మెజారిటీ ప్రజలు ఉద్యమాలకు, సామాజిక స్పృహకు దూరమై, వ్యక్తి పూజ ప్రభావానికి లోనై బీజేపీకి అండగా నిలిచారు. దీనికంతటికి గత పాలకులు, వామపక్ష భావజాల పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సామాజమే బాధ్యులు. ప్రజల్లో బీజేపీ సైద్ధాంతిక భావజాలానికి దగ్గరయ్యారని చెప్పడానికి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే.. ప్రజల మనోభావాలకు సంకేతాలు కానున్నాయి. ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ప్రజా ఉద్యమాలను నిర్మించడానికి మరింతగా చెమటోడ్చాల్సిన అవసరం ఉంది. ప్రజలతో మమేకమైతేనే పార్టీల అస్తిత్వం కొనసాగుతుంది.

-పాకాల శంకర్ గౌడ్,

సామాజిక విశ్లేషకులు

98483 77734

Advertisement

Next Story

Most Viewed