మ్యాన్ హోళ్ల క్లీనింగ్‌పై జీహెచ్ఎంసీ ఫోకస్.. ఫిర్యాదులపై సత్వరమే పరిష్కారం

by srinivas |
మ్యాన్ హోళ్ల క్లీనింగ్‌పై జీహెచ్ఎంసీ ఫోకస్.. ఫిర్యాదులపై సత్వరమే పరిష్కారం
X

దిశ, సిటీబ్యూరో: బోర్డు దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జలమండలి ఈడీ మ‌యాంక్ మిట్టల్‌తో క‌లిసి ఓ అండ్‌ఎం అధికారులతో ఎంసీసీ(మెట్రో కస్టమర్ కేర్) ఫిర్యాదులపై ఆయ‌న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు సొంతంగా ప్రణాళికలు వేసుకుని ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరా, కలుషిత నీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మరోవైపు రోడ్లపై సీవరేజీ ఓవర్ ఫ్లో కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మ్యాన్ హోళ్లు ఉప్పొంగితే వెంటనే పూడిక తీయాలని సూచించారు. వాటి నుంచి తీసిన వ్యర్థాలను (సిల్ట్) వెంటనే అక్కడి నుంచి తొలగించాలన్నారు. ఎక్కడైనా మ్యాన్ హోళ్లు ధ్వంసమైతే వెంటనే పునర్నిర్మాణం చేపట్టాలని, మ్యాన్ హోళ్ల కవర్లు కనిపించని స్థితిలో ఉంటే వెంటనే కొత్త మూతలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంసీసీలో వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారం వివరాలపై ఆరా తీశారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం కొన‌సాగుతున్న 90 రోజుల డీసిల్టింగ్ ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

90 రోజుల కార్యచ‌ర‌ణ ప్రణాళిక‌..

రోడ్లపై మురుగునీరు పొంగిపొర్లకుండా నివారించేందుకు అక్టోబర్ 2 నుంచి జలమండలి 90 రోజుల కార్యాచ‌ర‌ణ ప్రణాళిక చేప‌ట్టింది. ఇందులో భాగంగా మురుగునీటి లైన్లలో పేరుకుపోయిన పూడిక‌ను తొల‌గిస్తోంది.

పూడిక తీసిన పైప్‌లైన్ పొడ‌వు 2000 కి.మీ.లు

ప్రాంతాల సంఖ్య 16వేలు

పూడిక తీసిన మ్యాన్‌హోళ్ల సంఖ్య 1,65,000

ట్యాంక‌ర్ల స‌ర‌ఫ‌రాపై ఈడీ స‌మీక్ష..

జ‌ల‌మండ‌లి నీటి ట్యాంక‌ర్ల బుకింగ్‌, స‌ర‌ఫ‌రా తీరుపై ఈడీ మ‌యాంక్ మిట్టల్ అధికారుల‌తో స‌మీక్షించారు. ప్రస్తుత ట్యాంక‌ర్ల బుకింగ్, స‌ర‌ఫ‌రా, వెయిటింగ్ వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ట్యాంక‌ర్లు బుక్ చేసుకున్న వారికి వీలైనంత‌ వెంట‌నే స‌ర‌ఫ‌రా అయ్యేలా చూడాల‌ని అధికారుల‌కు సూచించారు. రెసిడెన్షియ‌ల్ అవ‌స‌రాల‌కు ట్యాంక‌ర్లు బుక్ చేసుకునే వారికి స‌ర‌ఫ‌రాలో మొద‌టి ప్రాధాన్యం ఇవ్వాల‌ని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed