- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత వైద్యం కొంత మానుకుని...
జీవితంలో చాలా విషయాలలో స్వంత నిర్ణయాలు తీసుకోవాలి కానీ వైద్యం విషయంలో కాదు. అలా చేస్తే చాలా రోగాలు విషమించడం మాత్రమే కాదు, మిగతా వారికి కూడా విషమంగా మారవచ్చు. యాంటీ మైక్రోబియల్ మందుల దుర్వినియోగం ఈ కోవకి చెందుతుంది. ముఖ్యంగా, ఈ రకం మందుల వాడకం భారత్‌లో అంతగా నియంత్రణలో లేదు. దాని ఫలితంగా అర్హతలేని వారి ప్రిస్క్రిప్షన్ మేరకు ఈ మందుల వితరణ జరుగుతోంది. చాలా సందర్భాలలో రోగులు తమంత తామే కొనుక్కుని వాడతారు. రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోవటడమే కాకుండా, దీనిద్వారా వచ్చే విపరిణామాలు అన్నీ ఇన్నీ కావు.
2022లో ప్రఖ్యాత వైద్య పరిశోధనా పత్రిక లాన్సెట్‌లో ప్రచురించిన పరిశోధనా వ్యాసం ప్రకారం, 2019 నాటి గణాంకాల ఆధారంగా, భారత దేశంలోవాడే యాంటీబయోటిక్స్ 90 శాతం ప్రైవేట్ రంగ వైద్య సదుపాయాల ద్వారా పంపిణీ చేయబడుతున్నాయి; వాడకంలో ఉన్న 47 శాతం యాంటీబయోటిక్స్ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థచే ఆమోదించబడనవే ఉన్నాయి. అంటే, వాటి సామర్ధ్యం, భద్రత విషయంలో భరోసా లేదన్నమాట! భారత్‌లో అత్యధికంగా వాడే యాంటీబయోటిక్ మెడిసిన్ అజిత్రోమైసిన్. డాక్టరు పర్యవేక్షణ లేకుండా, నియమాలు పాటించకుండా యాంటీబయోటిక్స్ వాడకంవల్ల రోగ నిరోధకత పెరిగే అవకాశం ఉంది. అంటే, ఒకసారి పనిచేసిన మందు, మరోసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాడితే అంతగా పనిచేయకపోవచ్చు, లేదా అస్సలు పనిచేయకపోవచ్చును. దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు; ఉదాహరణకి 5 రోజులు వాడవలసిన మందుని మధ్యలో ఆపేయడం, రోజుకి రెండు సార్లు వాడవలసిన మందు ఒక్కసారి మాత్రమే వేసుకోవడం, 500 ఎంజీ కనీస మోతాదు అయితే 250 ఎంజీ మోతాదునే వాడడం, పదేపదే అవే మందులు వాడడం, సోకిన వ్యాధిని నిర్దుష్టంగా నిర్ధారించకుండా మందులు వాడడం--ఇలా ఎన్నో.
ఇలా చంపితే.. అలా బతికేస్తాయి
బాక్టీరియాలు ప్రధానంగా గ్రామ్ నెగెటివ్, గ్రామ్ పాజిటివ్ అని రెండు జాతులుగా విభజింపబడ్డాయి. కొన్ని క్రిమి సంహరక మందులు ఒక జాతి బాక్టీరియాని ఎదుర్కొంటాయి, మరికొన్ని ఇంకొక జాతి బాక్టీరియాని ఎదుర్కొంటాయి. కాబట్టి రోగికి సోకిన బాక్టీరియా జాతిని నిర్ధారించకుండా మందులు వాడితే రోగం నయం కాదు సరికదా రోగ నిరోధకత పెరుగుతుంది. అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థ 2022 వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్‌లో, చాలా సందర్భాలలో, జ్వరానికి కారణం దోమలవల్ల వ్యాపించే వ్యాధులు అయినప్పటికీ, జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరిన వారిలో దాదాపు అందరికీ యాంటీబయోటిక్స్‌తో వైద్యం చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ చెప్పిన కారణాలు మాత్రమే కాక మరెన్నో కారణాల వల్ల నిరోధకత పెరుగుతుంది. డార్విన్ చెప్పిన “బలవంతులదే మనుగడ” అన్న సిధ్ధాంతం క్రిమి కీటకాదులకు కూడా వర్తిస్తుంది! మనం వాటిని చంపడానికి ప్రయత్నిస్తూంటే అవి ప్రతిఘటిస్తూ వాటి వంశాభివృధ్ధి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటి వంశాంకురాలు స్థిరంగా మనుగడ సాగించేలా అనుకూల జన్యుమార్పిడి చేసుకుంటూ బతుకుతాయి. ప్రాణికోటి ఈ భూమి మీద వెలసినప్పటినుండి మనుగడ కోసం సాగించిన పోరాటం ఇదే కదా!
యాంటీబయోటిక్ పనిచేయకపోతే అంతే...
ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం యాంటీబయోటిక్ నిరోధకత ప్రపంచం ఎదుర్కునే 10 ముఖ్య ప్రమాదాల్లో ఒకటి; అంతేకాక, కోవిడ్ లాంటి మహమ్మారికి దారితీసే ప్రమాదంగా కూడా వైద్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. అది ఎలా జరుగుతుంది. అంటే... ఒక రోగికి జ్వరం వచ్చింది; వెంటనే దుకాణానికి పోయి azitromicin కొనుక్కుని వేసుకుంటాడు. రెండురోజుల తరవాత జ్వరం తగ్గిందని మందు వేసుకోవడం ఆపేస్తాడు. కొన్ని నెలల తరవాత మళ్ళీ జ్వరం, దగ్గు వస్తే అదే మందు వాడడం మొదలుపెడతాడు. కానీ మూడు రోజులు వాడినా గుణం కనపడదు. మోతాదు పెంచి, ఇంకొన్ని రోజులు వాడతాడు. అయినా గుణం కనపడదు. అంటే, ఆ రోగికి అనారోగ్యం కలిగించిన క్రిములు అతను వేసుకునే మందుకి అలవాటు పడి స్పందించడంలేదన్నమాట. ‘తినగ తినగ వేము తియ్యగానుండు’ అన్నట్టు ఆ రోగిలో ఉన్న క్రిములు అజిత్రోమైసిన్ మాత్రను రుచి మరిగి ఆ మందుని ఆహారంగా మలచుకుని మనుగడ సాగిస్తున్నాయన్నమాట!
రోగక్రిములు విషకన్యలుగా మారి...
వేరొక రోగి తేలికపాటి జ్వరం వచ్చినప్పుడు తనకి అందుబాటులో ఉన్న యాంటీబయోటిక్ వేసుకుంటాడు. జ్వరం ఎక్కువగా లేదు కదా అని నియమిత మోతాదు కంటే తక్కువ మోతాదు వేసుకుంటాడు. జ్వరం తగ్గినదని మరునాడు మానేస్తాడు. అలా జ్వరం వచ్చినప్పుడల్లా ఇదే రకంగా స్వంత వైద్యం చేసుకుంటాడు. ఒకసారి ప్రమాదకర ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంతకుముందు వాడిన యాంటీబయోటిక్స్ పనిచేయవు. కొంచెం, కొంచెం విషం, క్రమంగా సేవించి దానికి అలవాటు పడి జీవించే, చరిత్రలో చిత్రించిన విష కన్యలలా, రోగి శరీరంలోని క్రిములు యాంటీబయోటిక్స్‌కి అలవాటు పడ్డాయన్నమాట. అంటే, ఔషధ నిరోధక క్రిములు ఆ రోగిలో ఉన్నాయి. ఈ రోగికి ఉన్న అంటు వ్యాధి, పక్కవారికి, ఆ పక్క వారికి, అలా సమాజంలో సోకితే, సాధారణంగా వాడే యాంటీబయోటిక్స్ ఎవరికీ పనిచేయకపోవచ్చును. ఇలాంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో నెలకుంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2019లో ఔషధ నిరోధకత కారణంగా భారత్‌లో సుమారు మూడు లక్షలమంది మరణించినట్టు తెలుస్తోంది. ఏటా ఈ సంఖ్య పెరుగుతోందని అంచనా.
యాంటీబయోటిక్స్ నిరోధకతను అధిగమించే మందులు, టీకాలు రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది. కానీ, కొత్త యాంటీబయోటిక్స్ ఆవిష్కరణ, అభివృధ్ధి పెక్కు సవాళ్ళతో కూడిన విషయం. 1987 తరవాత కొత్త జాతి యాంటీబయోటిక్స్ ఆవిష్కరింపబడలేదన్న సత్యం... ఔషధాలు కనిపెట్టి, వాడకంలోకి తీసుకురావడం ఎంత కష్టమో తెలుపుతుంది. స్వంత వైద్యం కొంత మానుకుని, ఈ సమస్యకి పరిష్కారం దిశగా మన వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పుతో వచ్చే తేలికపాటి జ్వరాలకి యాంటీబయోటిక్స్ అవసరం లేదు. మన శరీరానికి కొద్దిపాటి విశ్రాంతి, పౌష్టిక ఆహారం ఇస్తే చాలు పూర్తి స్వస్థత చేకూరుతుంది. పాశ్చాత్య దేశాలలో అంటీబైయోటిక్స్ డాక్టరు చీటీ లేకుండా దొరకవు. అలాంటి వ్యవస్థ భారతదేశంలో కూడా రావాలి.
డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ, అమెరికా