- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంపదలోనూ... బీసీలది వెనకబాటేనా!
భారతదేశంలో వెనుకబడిన కులాలు పేదరికంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పేదరికం చాలా తీవ్రంగా ఉంది. అనాదిగా వెనుకబడిన కులాలకు చెందిన ప్రజలకు స్థిరమైన జీవనాధారాలు లేకపోవడం, భూస్వామ్య వ్యవస్థ, వ్యవసాయ కార్మికులుగా పనిచేయడం, చిన్న చిన్న పనులు చేసుకుని రోజువారీ జీవితాలు గడపడం వంటివి మాత్రమే ఉపాధిగా ఉంటూ వస్తోంది. మొదటి నుంచి కూడా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయ పరంగా ఎదిగిన ఉన్నత వర్గాల వ్యక్తులకూ, అణగారిన వర్గాలకూ మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను రూపమాపడమే లక్ష్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ రూపకల్పన చేయటం జరిగింది.
కానీ రాజ్యాంగ రూపకల్పనతో సామాజిక అసమానతలు కొద్దిగా తగ్గినా.. ఆర్థిక ఆసమానత్వం మాత్రం అలానే ఉంది. మొత్తం సంపదలో కులాలవారీగా పరిశీలిస్తే.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 88.4 శాతం సంపద ఉన్నత కులాల దగ్గర ఉన్నట్టు కొన్ని సామాజిక ఆర్థిక సంస్థలు చేస్తున్న ప్రాథమిక నివేదికలు తెలుపుతున్నాయి. బీసీల దగ్గర కేవలం 9శాతం సంపద మాత్రమే ఉండటం బాధాకరం. ఇప్పటికే అన్ని రంగాల్లో వెనుకబడుతున్న బీసీలు సంపద విష యంలో కూడా మరింత వెనుకబడి ఉన్నారు. అందుకే తమకు సరియైన న్యాయం జరగాలం టే జనాభా ప్రాతిపదికన అన్ని రంగాలలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని, రాజ్యాధికార దిశగా అడుగులు వేయడానికి సన్నద్ధం అవుతున్నారు.
భారీగా బిలియనీర్ల సంపద...
మన దేశం ఆకలి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆరోగ్య వైపరీత్యాలు వంటి బహుళ సంక్షోభాలతో బాధపడుతుండగా, దేశంలోని బిలియనీర్లు మాత్రం ఆర్థికంగా సామాజికంగా బాగా అభివృద్ధి చెందుతున్నారు. భారతీయుల అసమానతలపై 2023 ఆక్స్‌ఫామ్ నివేదికను పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. భారతదేశ జాతీయ సంపదలో 1 శాతం మంది జనాభా వద్దనే 42.5 శాతం సంపద కలిగి ఉండటం ఆశ్చర్యకరం. ప్రపంచంలోనే అత్యధికంగా 228.9 మిలియన్ల పేదలు మన దేశంలోనే ఉండటం కూడా అవమానకరం. దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి భారతదేశంలోని బిలియనీర్ల సంపద రోజుకు 121 శాతం లేదా రూ. 3,608 కోట్లు పెరుగుతూనే ఉంది. దేశంలోని 100 మంది అతి సంపన్నుల మొత్తం సంపద రూ.54.12 లక్షల కోట్లకు చేరుకుంది, అంటే ఇది మొత్తం ఒక ఏడాదిన్నర కేంద్ర బడ్జెట్‌కు సమానమన్నమట.
బీసీల దగ్గర 9% శాతమేనా ?
ఎన్నో ఏళ్లుగా ఆర్థికంగా బలంగా ఉన్న ఉన్నత వర్గాల సంపద అటూ దేశంలోను, ఇటూ రాష్ట్రంలోనూ అనూహ్యంగా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో దాదాపుగా 10 శాతం ఉన్న ఓసీల వద్ద సుమారు 89 శాతం సంపద ఉండటం విశేషం. రాష్ట్రంలో 60 శాతం పైగా జనాభా గల బీసీల వద్ద కేవలం 9 శాతం మాత్రమే ఉండటం ఆశ్చర్యకరం. 2013లో 17.8 శాతం సంపదను కలిగి ఉన్న బీసీలు 2022 సంవత్సరం వచ్చే నాటికి 9 శాతం సంపదను మాత్రమే కలిగి ఉండటం ఆలోచించదగ్గ విషయం. ఇందుకు ప్రధాన కారణం బీసీలు కేవలం శ్రామిక వర్గాలుగానే జీవనం కొనసాగించడం, ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వాలు ఏ మాత్రం సహకరించకపోవడం సరికదా ఉచితాల మాయలో భ్రమలో బీసీలను ఓటు బ్యాంక్ యంత్రాలుగానే చూడ టం, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగ అవకాశాలు కనీస స్థాయిలో కల్పించలేకపోవడం. అందుకే బీసీలు ఆర్థిక సమానత్వానికి కనుచూ పు మేరలో కానరావడం లేదు. బీసీలు రాజ్యాంగ పరమైన లక్ష్యానికి అనుగుణంగా ఎలాంటి ప్రతిఫలాలను కూడా అందిపుచ్చుకోలేకపోతున్నారు. బీసీల సంపద పెరగకపోగా మరింతగా తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు, రాజ్యాధికార అంశాలపై బీసీల ఆవేదనలో అర్థం ఉందనే విషయాన్ని సబ్బండ వర్గాలు ముఖ్యంగా పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం పదేపదే చెప్పడాన్ని అధికార పక్ష నేతలు అర్థం చేసుకోలేకపోవడం ఎంత మాత్రం మంచిది కాదు.
ఎస్సీల దగ్గర 2.6 శాతం.. ఎస్టీల లెక్కే లేదు..
తెలంగాణ సంపదలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కూడా జనాభాకు అనుకూలమైన ఆర్థిక భాగస్వామ్యం లేదు. గణాంకాల ప్రకారం 2013లో 1.8 శాతం సంపదను, 2020లో 4.1 సంపదను కలిగి 2022 వచ్చేసరికి మళ్లీ 2.6 శాతానికి దిగజారిపోయారు. బీసీలతో పోల్చుకుంటే వారి స్థాయిలో ఎస్సీలు బీసీలంతగా ఆర్థికంగా వెనుకబడి లేకపోయినప్పటికీ, జనాభా స్థాయి పరంగా వారికి తగిన ఆర్థిక ప్రాధాన్యత లభించడం లేదు. ఇక సంపద జాబితాలో ప్రామాణికంగా తీసుకునే స్థాయిలో ఎస్టీ కులాలు లేకపోవడం మరింత విచారకరం. సంపదలో బీసీలతోపాటు వెనుకబడిన ఎస్సీలు, ఎస్టీలు, సామాజిక, ఉద్యోగ, రాజకీయ పరంగా అవకాశాలు పొందుతున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం అనుకున్న స్థాయిలో ఎందుకు ఎదగలేక పోతున్నారో ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ, బడ్జెట్ పత్రాలలో భారీ కేటాయింపుల గారడీ ఉన్నప్పటికీ, కింది స్థాయిలో ఆర్థిక సమానత్వం అలాగే ఉండిపోవడాన్ని ప్రభుత్వ పెద్దలు గ్రహించలేక పోవడం గమనార్హం.
రాష్ట్రం వచ్చాక..
తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుకబడిన కులాల ఎంత కీలకమో అందరికీ తెలుసు. 90 శాతానికి పైగా బీసీ కులాల బిడ్డలే పోరాడి ప్రాణాలు కోల్పొయారు. కానీ పోరాడి తెచ్చు కున్న తెలంగాణలోనూ నేటికీ వాళ్ల కులాల సామాజిక ఆర్థిక పరిస్థితిలో ఏ మాత్రం మార్పులు రాలేకపోయాయి. తెలంగాణ రాక ముందు 2013లో బీసీల సంపద 17.8 శాతం వరకు ఉండేది. తెలంగాణ వచ్చిన 2014లో 20 శాతం సంపదతో బీసీల వాటా కొంత పెరిగినట్టు అనిపించినా.. ఆ తర్వాత ఆ పెరుగుదల శాతం ఎక్కువ కాలం నిలువలేదు. మళ్లీ 2022 నుంచి బీసీల సంపద ప్రతి ఏటా తగ్గడం మొదలైంది. మొత్తంగా చూస్తే దాదాపు బీసీల సంపద భాగస్వామ్యం 9 శాతం వద్దనే నిలిచిపోయింది. బీసీలు ఈ స్థాయిలో దిగజారిపోతున్నా ఓసీల సంపద మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 2013లో 80.3 శాతంగా ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 78.1కి పడిపోయి, తిరిగి 2022 ఏడాది వచ్చే సరికల్లా 88.4 శాతం భారీ సంపదను కలిగి ఉన్నారు. సుమారు పదేళ్ల కాలంలో ఓసీలు దాదాపు 10 శాతం సంపదను వృద్ధి చేసు కుంటే.. ముఖ్యంగా బీసీలు మాత్రం దాదాపుగా 8 నుంచి 9 శాతం సంపదను కోల్పోవడం బాధాకరం.
డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ.
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659