అన్ని పార్టీలకు.. 10 స్థానాల ధీమా!

by Ravi |   ( Updated:2024-05-21 00:30:56.0  )
అన్ని పార్టీలకు.. 10 స్థానాల ధీమా!
X

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఓడ్డాయి. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఓటర్లు తమకు బాసటగా నిలిచారని ఆయా పార్టీలు భావిస్తూ తమ విజయం ఇక నల్లేరు మీద నడకే అన్న దీమాతో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 32 లక్షల 16 వేల 348 మంది ఓటర్లు ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 2 కోట్ల 24 లక్షల 806 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ఒక కోటి 11 లక్షల 91 వేల 542 మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నారు. ఇప్పటికే పార్టీలు జరిగిన పోలింగ్ ఆధారంగా.. ఆయా పార్టీల నాయకత్వం, అభ్యర్థులు లెక్కలు... కూడికలు తీసివేతలు చేస్తూ ఓట్ల లెక్కలు గడుతూ విజయ తీరాలకు చేరుతామని పార్టీలు ఒక అంచనాకు వచ్చాయి.

ఎవరి ధీమా వారిదే!

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో 66.3 శాతం పోలింగ్‌ నమోదు అయింది. అత్యధికంగా ఖమ్మంలో లోక్‌సభ స్థానంలో 76.09 శాతం ఓటింగ్‌ నమోదు అయింది. భువనగిరి లోక్‌సభ స్థానంలో 76.78 శాతం ఓటింగ్‌ నమోదు అయి రెండవ స్థానంలో నిలిచింది. మెదక్‌లో 75.09 శాతం ఓటింగ్‌ నమోదు అయి మూడవ స్థానంలో నిలువగా, చివరి స్థానంలో హైదరాబాద్‌ నిలిచి 48.48 శాతం ఓటింగ్‌ నమోదు అయింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికల్లో 3 శాతం ఓటింగ్‌ పెరిగింది. అదిలాబాద్‌ 74.03, పెద్దపల్లి, 67.87, కరీంనగర్‌, 72.54, నిజామాబాద్‌ 71.92, జహీరాబాద్‌ 74.63, మెదక్‌ 75.09, మల్కాజిగిరి 50.78, సికింద్రాబాద్‌ 50.78, హైదరాబాద్‌ 48.48, చేవెళ్ళ 56.5, మహబూబ్‌నగర్‌ 72.43, నాగర్‌కర్నూల్‌ 69.46, నల్గొండ 74.02, భువనగిరి 76.78, మహబూబాబాద్‌ 71.85, ఖమ్మం 76.09, శాతం ఓటింగ్‌ నమోదు అయింది. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు పోల్చి చూస్తే 8.56 శాతం ఓటింగ్‌ లోక్‌సభ ఎన్నికల్లో తగ్గింది. ఈ పోలింగ్‌ సరళిని అంచనా వేసిన కాంగ్రెస్‌ పార్టీ 10 నుంచి 14 స్థానాలు, బీఆర్ఎస్ 14 స్థానాలు, బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయా పార్టీల నాయకత్వం గట్టి నమ్మకంతో ఉన్నాయి. తాము ఇచ్చిన గ్యారింటీలు అమలు చేసినందువల్ల విజయం తమదేనని అధికార పక్షం ధీమాతో ఉంది. గతంలో తాము చేసిన అభివృద్ధి వల్లనే ఓటర్లు తమకు పట్టం కడుతారన్న ధీమాతో బీఆర్ఎస్ ఉంది. బీజేపీ తాము సైతం ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడం కాకుండా విజయం సాధిస్తామన్న ప్రగాడ విశ్వాసంతో ఉంది. ఇలా అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తునప్పటికి వీరి భవితవ్యం జూన్‌ 4న తెలనున్నది.

గుర్రం రాంమోహన్‌ రెడ్డి

7981018644

Advertisement

Next Story