- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారతీయ సినిమాకు తొలి ఆటా మాటా
మాటలు పాటలు నేర్చిన మొట్ట మొదటి భారతీయ సినిమా విడుదల అయి మార్చి 14 నాటికి 90 ఏళ్లు. మొట్టమొదటి భారతీయ టాకీ ‘ఆలం ఆరా’ 14 మార్చి 1931 రోజున అప్పటి బాంబే నగరంలో మాజిస్టిక్ సినిమా హాల్లో ప్రదర్శిత మయింది. తమకిష్టమైన అభిమాన నటీనటులు తెరపై మాట్లాడడం పాటలు పాడడం చూసి ఆనాటి ప్రేక్షకులు అబ్బురపడ్డారు.. ఆనందించారు. ఎంతగా అంటే అప్పుడే జనాన్ని నియంత్రించడానికి పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఎనిమిది వారాలకు పైగా హౌస్ ఫుల్‌గా ప్రదర్శించబడింది. ఆలం ఆరా తర్వాత కొంచెం అటూ ఇటుగా తెలుగుతో సహా వివిధ భారతీయ భాషల్లో కూడా టాకీ సినిమాలు వచ్చాయి.
తొలిరోజుల్లో భారతీయ మూకీ సినిమాలకు కొల్హాపూర్ నిర్మాణ వేదికగా ఉండేది. తర్వాత సినిమా లాభసాటి వ్యవహారంగా భావించిన బాంబే నూలు మిల్లుల యాజమాన్యాలు పెట్టుబడి పెట్టి సినిమాను క్రమంగా పూనా తర్వాత బాంబేకి తరలించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సినిమాటోగ్రఫీ రంగంలో వస్తున్న మార్పులతో పాటు ‘జాజ్ సింగర్’ లాంటి సినిమాల్లో ధ్వని మాటలు పాటలు చేరడంతో మన సినిమా రంగంలో కూడా అనేకమంది ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు. అట్లా అనేక మంది ప్రయత్నాలు చూస్తూవుండగా అర్దెషీర్ ఇరానీ చేసిన ప్రయత్నం విజయవంతమయి మొట్టమొదటి టాకీ ‘ఆలం ఆరా’ రూపకర్తగా చరిత్రలో మిగిలిపోయాడు. అప్పటిదాకా సైలెంట్ సినిమాల్లో పెద్ద హీరోలుగా నిలదొక్కుకున్న అనేక మంది సినిమాల్లోకి మాటలు పాటలు రావడంతో ఖంగుతిన్నారు. మార్పునకు అనుగుణంగా మారలేక పలువురు తెరపై నుంచి తప్పుకున్నారు. సోహ్రాబ్ మోడీ, పృథ్వీ రాజ్ కపూర్, మన కరీంనగర్ ముద్దు బిడ్డ పైడి జైరాజ్ లాంటి కొంతమంది మాత్రం సైలెంట్, టాకీలు రెండింటిలో నిలదొక్కుకున్నారు.
అనితర సాధ్యమైన ప్రభావం
మొదట సైలెంట్(మూకీ) తర్వాత టాకీ సినిమాలు ఆనాడే స్టంట్ సినిమాలతో పాటు పలు సామాజిక ఆర్థిక కోణాల్లోంచి రూపొందించబడ్డాయి. అంతే కాదు మాటలు పాటలు నేర్చిన సినిమా దేశ వ్యాప్తంగా హిందీని జాతీయ భాషగా చేయడంలో పెద్ద సాధనంగా కూడా ఉపయోగపడింది. వివిధ భాషలతో సంస్కృతులతో వున్న దేశంలో తమిళనాడు లాంటి ఒకటి రెండు ప్రాంతాలు తప్ప కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా అటు అస్సాం దాకా హిందీ సినిమా తన ప్రభావాన్ని కలిగి వుండడం మనం గమనించవచ్చు. అట్లా భాషతో పాటు ఆహార్యము నడకా తీరులో కూడా హిందీ సినిమా మొత్తం భారతీయ జీవన రీతి పైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని చూపిందన్నది అక్షర సత్యం.
ప్రేమకథా నేపథ్యంలో..
ఇట్లా మొత్తం సినిమా రంగాన్ని అతలాకుతలం చేసిన టాకీ యుగంలోని తొలి సినిమా ఆలం ఆరా రూపకర్త అర్దెషీర్ ఇరానీ పార్సీ జోరాస్ట్రియన్ కుటుంబంలో 1886 డిసెంబర్ 5న పుట్టాడు. నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాతగా ఎదిగిన ఆయన మొదటి రంగుల సినిమా ‘కిసాన్ కన్య’ కూడా తీశాడు. సినిమాల నిర్మాణంతో పాటు టాకీసులు, కార్ల ఏజెన్సీ లాంటి వ్యాపారాలు కూడా చేసాడు. తన స్టార్ ఫిలిమ్స్ కంపెనీతో మొదట సైలెంట్ సినిమా ‘అభిమన్యు’ రూపొందించాడు. తనకి భోగీలాల్ దావే కంపనీలో సహచరుడిగానూ సినిమాలకు ఫోటోగ్రాఫర్‌గానూ పని చేసాడు. ఒక రాజాస్థానానికి చెందిన ప్రేమకథగా రూపొందిన ఆలం ఆరా 120 నిమిషాల నిడివితో నాలుగు నెలల్లో నిర్మితమయింది. దాదాపు ఏడు పాటలున్న ఈ సినిమాలో ‘ దే దే ఖుదా కే నాంపర్...’ అన్న పాట తొలి భారతీయ సినిమా నేపధ్య గీతంగా చరిత్రకెక్కింది. వజీర్ మొహమ్మద్ తన స్వీయ సంగీత దర్శకత్వంలో ఈ పాట పాడారు. తొలి గాయకుడయ్యారు.
తొలి టాకీలో మన ఎల్వీ ప్రసాద్
ఇక ఆలం ఆరా లో తెలుగువారికి స్థానం దక్కింది. ఎల్వీ ప్రసాద్ ఇందులో రాజు సుల్తాన్ సలీం ఖాన్ పాత్ర పోషించాడు. ఇక ఆలం ఆరా విడుదల అయిన దాదాపు సంవత్సరానికి 1932 ఫిబ్రవరి 2న మొట్టమొదటి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ విడుదల అయింది. హెచ్.ఎం.రెడ్డి తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించి తొలి ద్విభాషా సినిమా రూపకర్తగా నిలబడ్డారు. మొత్తం సినిమా ట్రూప్ ను సి.ఎస్.ఆర్. సహకారంతో బాంబే తరలించి రూపొందించారు. ఇట్లా అష్ట కష్టాలు పడి సినిమాకు మాటలు పాటలు నేర్పి ప్రజల ముందుకు తీసుకొచ్చిన సినిమా నిజానికి “దృశ్యమాధ్యమ”మా?“శ్రవణమాధ్యమ”మా? అన్న మీమాంస నుంచి “దృశ్యశ్రవణ” మాధ్య మంగా రూపుదాల్చింది. అయితే ఇవ్వాళ మొత్తం భారతీయ సినిమా నిర్మాణ రూపురేఖలలో విపరీత మార్పులకు గురయింది. సినిమా కళా వ్యాపారమా అన్న వాదనలో వ్యాపారం వైపునకే మొగ్గినట్టు, దృశ్య శ్రావణ మాధ్యమంలో ధ్వని వైపునకే మొగ్గి అసలయిన దృశ్య లక్షణాన్ని కోల్పోవడం ఒకింత బాధాకరమే కానీ కేవలం తాత్కాలికంగా ఇంద్రియాలను ప్రేరేపితం చేసే సినిమాల స్థితి నుంచి మనసుకు హత్తుకునే అర్థవంతమైన సినిమాలు రావాలనీ వస్తాయనీ ఆశిద్దాం.
వారాల ఆనంద్
94405 01281