- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఈ ఆత్మహత్యలూ విద్యలో భాగమేనా?
భవిష్యత్తుకు బంగారు బాట వేయవలసిన చదువులు విద్యార్థులను అర్ధాంతరంగా కబళించడం ఏమిటి? పరీక్షల ఒత్తిడి, ఫలితాల పట్ల అతి ఉత్సాహం, పోటీ తత్వం, మానసిక ఆందోళన, తీవ్రమైన భావోద్వేగాల మధ్యన ఆత్మహత్యల పేరుతో కుటుంబాలలో చిచ్చు రగిలించడం భావ్యమేనా? సామాజికపరమైన ఈ అంశం పట్ల విద్యావేత్తలు, ప్రభుత్వాలు, సామాజిక కార్యకర్తలు ముఖ్యంగా తల్లిదండ్రులు స్పందించాల్సిన అవసరం లేదా! విద్యార్థుల ఆత్మహత్యలు కనీసం మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఒక ఊపు అందుకున్న విషయాన్ని గమనించినప్పుడు విద్యారంగంలో వచ్చిన పెడధోరణులు, విద్యార్థులపై పాఠశాలలో లేదా విద్యాసంస్థలు కలిగించే తీవ్రమైన ఒత్తిడి, అదే సమయంలో తల్లిదండ్రులు అతి ఉత్సాహం.. కారణాలు ఏమైనా కావచ్చు... విద్య ఎప్పుడైతే ఈ దేశంలో ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపిందో. అప్పుడే ఈ విష ఫలితాలకు బీజం పడ్డ విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. తోటి వాళ్ళు అవమానించారని, తల్లిదండ్రులు మందలించారని, సిబ్బంది బెదిరించారని, ప్రవర్తన పైన అనేకమంది అనుమానపడ్డారని అపోహలతో ఆత్మన్యూనతకు గురై పిట్టల్లా రాలుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు గురించి ఈ సమాజం ఆలోచించకుంటే మానవ వనరుల్లో ప్రధానమైన యువశక్తి నిర్వీర్యం కాక తప్పదు.
ఆత్మహత్యలకు అసలు కారణం
ముఖ్యంగా మహిళలు, యువతులు, అకృత్యాలు... అత్యాచారాల బారిన పడి ముక్కలుగా చేయబడి సమాజానికి దూరమవుతుంటే మరోవైపు విద్యలోని పెడ ధోరణుల కారణంగా బలవన్మరణాలకు పాల్పడడం అంటే మానవ వనరులను కోల్పోవడమే కాదు, ఎదిగిన బిడ్డలను ఈ సమాజం నష్టపోవడం అవుతుంది. దీనికి పరిష్కారాలను వెతకాలి. చరిత్రలోకి తొంగి చూడాలి. 1964 నుండి 66 మధ్యకాలంలో విద్యారంగంపై పరిశోధన చేసిన ప్రొఫెసర్ కొఠారి తన నివేదికలో కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సమవయస్కుల మధ్యన ప్రేమానురాగాలతో కూడిన సహసంబంధం కొనసాగుతుందని, కుల మతాలకు అతీతంగా ఆర్థిక అంతరాలకు భిన్నంగా సమానమైన ఆలోచనలతో విద్యా వ్యవస్థ కొనసాగుతుందని తద్వారా ఆత్మస్థైర్యాన్ని నింపవచ్చునని సూచించడం జరిగింది. సుమారు 60 సంవత్సరాలు కావస్తున్నా అలాంటి కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయక పోటీ తత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన భుజాలు మోయలేని బరువులను చిన్నపిల్లలు మోసే దుష్ట సంప్రదాయం ఈ దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్నది. అశాస్త్రీయమైన మార్కులు, ర్యాంకులు, పోటీ తత్వాలను ఛేదించినప్పుడు మాత్రమే స్వేచ్ఛ స్వాతంత్య్రాల మధ్య ప్రకృతి నడుమ మానసిక ప్రశాంతతలో విద్యను కొనసాగించడానికి, అభ్యసించడానికి, విశ్లేషించడానికి అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. లేకుంటే ఇలాగే పిట్టల్లా రాలిపోయే దౌర్భాగ్యానికి పాలకవర్గాలే సమాధానం చెప్పవలసిన అవసరం భవిష్యత్తులో ఉంటుంది.
బాసర త్రిబుల్ ఐటీ లో ఒక విద్యార్థిని పరీక్ష రాస్తూ మధ్యలో వెళ్లి అమాంతం బలవరం మరణానికి పాల్పడ్డ తాజా ఉదాహరణ మనకు తెలిసినదే. బాచుపల్లి వసతి గృహంపై నుండి మరో విద్యార్థిని దూకిన ఘటనతో ప్రాణాలు ఎలా కోల్పోయారో మనకు తెలుసు. ఇంటర్ పరీక్షలు తప్పామని మార్కులు సరిగా సాధించలేకపోయాం అన్న బెంగ తో ఏపీలో 9 మంది తెలంగాణలో 8 మంది పిల్లల ప్రాణాలు ఆవిరి అయిన విషయం తెలిసిందే. గతంలో ఈ సంప్రదాయం ఇంటర్మీడియట్ కళాశాలకు మాత్రమే ఉండేది కానీ ఇటీవల కాలంలో మెడికల్ కళాశాలలు, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల లోపల కూడా మరణాలు తొంగి చూడడం, పరిపక్వత సాధించిన విద్యార్థుల్లోనూ ఇలాంటి ఉద్వేగాలు ఉదయించడం దారుణమైన సంఘటనలుగా భావించాలి. 2017- 2021 మధ్య భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు 9,905 నుంచి 13 వేలకు పెరిగాయని జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడిస్తున్నాయి. అంటే రోజుకు 35 మంది విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నట్టే కదా.
కొన్ని అధ్యయనాలు- పరిష్కారాలు
ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల్లో 3 వంతుల మంది వరకు మానసిక భావోద్వేగానికి లోనవుతున్నట్లు తద్వారా విచక్షణ కోల్పోయి ప్రాణాలు కోల్పోతున్నట్లు జాతీయ అధ్యయనం సుమారు 20 ఏళ్ల క్రితమే నిగ్గు తేల్చిన విషయం తెలిసినదే. వడపోత విధానాలను, ఒత్తిడి కలిగించే బోధనను సంస్కరించడం ద్వారా విద్యార్థులు స్వేచ్ఛా వాతావరణంలో విహరించగలిగేలా చూడాలని ఆ అధ్యయనం చూపిన పరిష్కారం. మనదేశంలో పరీక్షా విధానంలో బట్టీ పట్టే లోపభూయిష్ట విధానం కొనసాగుతుంటే సృజనకారులుగా తీర్చిదిద్దవలసిన క్రియాశీల విధానాలకు అంకురార్పణ చేయాల్సిన అవసరాన్ని పాలకులు, విద్యావేత్తలు విస్మరించడం ఆందోళనకరం. విద్యార్థుల అభివృద్ధికి తగిన స్థాయిలో అంశాల ఎంపికతో పాటు వారి స్పృహను ఆధారంగా చేసుకుని పాఠ్యాంశాలను రూపొందించాలి. కానీ డిగ్రీలు, పర్సంటేజ్, రాంకులు, గ్రేడ్లకు విలువ ఇవ్వడం కారణంగా తట్టుకోలేక నేలకొరుగుతున్నారని గుర్తిస్తే మంచిది.
పర్సంటేజీలు, ర్యాంకులపై నిషేధం
విద్యార్థులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడిన ప్రకృతి వాతావరణంలో ఆడుతూ పాడుతూ చదువుకునే వాతావరణాన్ని తప్పనిసరి చేయాలి. విద్యా వ్యవస్థలో పర్సంటేజీలు, ర్యాంకులు, గ్రేడ్లతో కూడిన విధానాలను నిషేధించాలి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి మానసిక వేత్తలతో ప్రత్యేక తరగతులను నిర్వహించడం ద్వారా జీవితం లక్ష్యం , విద్యా ఆచరణ అంశాలపై అవగాహన కలిగించాలి. ఒత్తిడిని తట్టుకునేలా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా స్వీడన్, ఐర్లండ్, ఎస్టోనియా, ఆస్ట్రియా, జర్మనీ వంటి దేశాలలో ఇస్తున్న శిక్షణ వంటి నైపుణ్య కార్యక్రమాలను మనదేశంలోనూ ప్రారంభించి మూసలో పోసిన విద్యా విధానానికి భిన్నంగా స్వేచ్ఛగా ఇష్టంతో నచ్చిన అంశాలను ప్రకటించే స్వేచ్ఛ ఉన్ననాడు మాత్రమే మానసిక వికాసం పెరుగుతుంది. మానవ వనరులను మరింతగా దేశాభివృద్ధికి ఉపయోగించుకునే అవకాశం దక్కుతుంది. విలువైన ప్రాణాలను గాలిలో కలిసిపోకుండా కాపాడుకుందాం. విద్యకు పునర్ నిర్వచనాన్ని దేశ ప్రగతి రీత్యా నిర్ణయించుకుందాం.
-వడ్డేపల్లి మల్లేశం
ఉపాధ్యాయ ఉద్యమ నేత
90142 06412