దళిత వీరత్వానికి ప్రతీక..

by Ravi |   ( Updated:2025-01-01 01:15:48.0  )
దళిత వీరత్వానికి ప్రతీక..
X

చరిత్రను మట్టితో కప్పేస్తే అది పుడమిని చీల్చుకుంటూ ఏదో ఒక రోజు బహిర్గతమవుతుంది. చరిత్రలో అసలైన కోణాన్ని మరుగున పరిచి వేరువేరు కోణాలలో చరిత్రను చూపించిన చరిత్రకారులు సంబరపడినంత కాలం పట్టలేదు దాచిన చరిత్ర విశ్వరూప దర్శనం కావడానికి. పంచమ జాతి వారిగా, సమాజ ఛాయలకు దూరంగా, ఆత్మ న్యూనతతో, జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్న దళితులు రొమ్ము విరిచి ఇది మా ఘనమైన చరిత అని దిగంతాలకు చాటుకునేలా ఆత్మ ధైర్యాన్ని కలిగించిన సంఘటన, మహార్ల ప్రతిఘటనకు సాక్షీ భూ తంగా నిలిచింది భీమా కోరేగావ్.

మహారాష్ట్రలోని ప్రస్తుత పూణే జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం భీమా కోరేగావ్. జనవరి ఒకటి 1818లో ఈ యుద్ధం జరిగింది. మరా ఠా సమాఖ్యలోని పీష్వా వర్గానికి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన యుద్ధాన్ని స్వాతంత్ర పోరాటంగా చిత్రీకరిస్తూ అసలైన చరితను మరుగున పరిచే కుట్రలు జరిగాయి. కానీ వాళ్ల ఆటలు ఎంతో కాలం సాగలేదు. అసలైన చరిత్ర సమాజం ముందుకు రాక తప్ప లేదు.

అసలు చరిత్ర..

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నాయకత్వంలో 500 మంది మహర్ సైనికులు, 250 మంది అశ్వదళం, 24 గన్నర్లతో బెటాలియన్ బయలుదేరింది. మహర్ సైన్యానికి ‘కోరేగావ్’ గ్రామంలో(పూణేకు 30 కి.మి) భీమా నది ఒడ్డున, 20,000 పదాతిదళం, 8000 మంది అశ్వదళంతో కూడిన పీష్వాల సైన్యం అనుకోకుండా ఎదురైంది. దాదాపు 50 రెట్లు అధికంగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసినా భయపడకుండా, ముందుకు దూకింది మహర్ సైన్యం.. మధ్యాహ్నానికి తమవెంట వచ్చిన అశ్వదళం, గన్నర్లతో పాటు ఆహారం మోసుకొచ్చేవారు పారిపోయినా కూడా వెనకడుగు వేయకుండా పోరాడసాగింది. ఒక్కొక్క సైనికుడు 40 మందితో పోరాడడం చూసి, ఇక ఓటమి తప్పదని భయపడిపోయిన కేప్టన్ స్టాటన్ యుద్ధం ముగిసిందని ప్రకటించి తన సేనలను లొంగిపోమని ఆజ్ఞాపించాడు. అప్పుడు మహర్ సైన్యం నాయకుడు శికనాగ్ తీవ్ర స్వరంతో "చరిత్రలో మాకు అవకాశం వచ్చిన ప్రతీసారీ మేము ఏమిటో నిరూ పించాం, ఈ రోజు మాకు అవకాశం మళ్లీ వచ్చింది. వందల సంవత్సరాలుగా మమ్మల్ని బానిసలుగా మార్చి, చిత్ర హింసలకు గురి చేసి, పశువులకన్నా హీనమైన బతుకులు అనుభవించేలా చేసిన ఈ బ్రాహ్మణ ఆధిపత్యంపై, బదులు తీర్చుకోవడానికి ఈ రోజు వచ్చిన ఈ అవకాశాన్ని మేం వదు లుకోం నువ్వు భయపడకుండా చూస్తూ ఉండు కేప్టెన్ సాబ్.. మా అఖరి రక్తం బొట్టు పోయేదాకా మేం పోరాడతాము" అంటూ గర్జించాడు.

తలతెగితే పారిపోయిన పీష్వా సైన్యం

అతని ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యపడిన కేప్టన్ స్టాటన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఆహారం, నీరు కూడా లేకుండా ఆ రోజు ఒక పగలు, ఒక రాత్రి జరిగిన భీకర యుద్ధంలో 500 మంది మహర్ సైనికులు 20,000 మంది పీష్వా సైన్యాన్ని ఊపిరి సలపనీయకుండా ఎదుర్కొన్నారు. చావుకే భయం పుట్టించే విధంగా పోరాడిన మహర్ల ప్రతాపానికి, భీమా నది పీష్వాల రక్తంతో ఎర్రగా మారిపోయింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకు గోవింద్ బాబా తలను మొండెం నుండి వేరు చేసి బాపు గోఖలేకు పంపాడు శికనాగ్. తల లేని కొడుకు శవాన్ని వొడిలో పెట్టుకుని పిచ్చివాడిలా ఏడుస్తూ, భయంతో వణికిపోతూ, అందరూ పారిపోండి అంటూ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు పెట్టాడు బాపు గోఖలే.. దీంతో భయకంపితులైన పీష్వా సైన్యం, ఫూల్గావ్‌లోని బాజీరావు శిబిరం వైపు పరుగులు తీయసాగారు.. వారిని భీమా నది దాటేదాకా తరిమి తరిమి నరికింది మహర్ సైన్యం.

అసలైన చరిత్రను తెలియజేద్దాం!

చరిత్రలో ఈ ఘటనను బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని సంపూర్ణం చేసిన ఆంగ్లో-మరాఠా యుద్ధంగా, పీష్వాలను స్వాతంత్ర సమరయోధులుగా చెబుతారు చరిత్రకారులు.. కానీ నిజానికి సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం మహర్ సైనికులు చేసిన ఒక వీరోచిత యుద్ధం ఇది. ఈ చరిత్రకు సాక్ష్యంగా 1821లో కొరేగావ్ గ్రామంలో యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో "విజయస్తూపం" ఏర్పాటు చేసింది బ్రిటీషు ప్రభుత్వం. యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 22 మంది మహర్ సైనికుల పేర్లను ఆ విజయ స్తూపంపై చెక్కించి ప్రతి సంవ త్సరం వారికి నివాళి అర్పించేది."ఇది మహర్ పోరాట యోధుల చరిత్ర. యావత్ సమాజానికి స్ఫూర్తినిచ్చే పోరాటమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1927 నుండి చనిపోయేదాకా కూడా ప్రతి సంవ త్సరం జనవరి 1న తప్పకుండా విజయ స్తూపాన్ని సందర్శించి నివాళులు అర్పించేవారు. బాబాసాహెబ్ తదనంతరం ఆయన ఆలోచనా విధానాన్ని కొనసాగించే బాధ్యత తీసుకున్న "సమతా సైనిక్ దళ్" ఇప్పటికి ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన వేల సంఖ్యలో హాజరై నివాళు లు అర్పిస్తూ చరిత్రను కాపాడుకుంటూ వస్తోంది. ఆ అసలైన చరిత్రను భావితరాలకు అందజేద్దాం, అసమానతలు లేని సమ సమాజం వైపు పయనిద్దాం.

- ములక సురేష్

94413 27666

Advertisement

Next Story

Most Viewed