మనందరి ఐన్‌స్టీన్... సత్యేంద్రనాథ్ బోస్..!

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-31 13:49:59.0  )
మనందరి ఐన్‌స్టీన్... సత్యేంద్రనాథ్ బోస్..!
X

ఈ శతాబ్దాన్ని అత్యంత ప్రభావితం చేసిన విఖ్యాత మేధావుల్లో ప్రముఖులు ఆల్బర్ట్ ఐన్ స్టీన్, మేరీ క్యూరీ. వీరిద్దరితో సైతం అభినందించబడ్డ...మన భరతమాత ముద్దుబిడ్డ, ఇలాంటి విఖ్యాత మేధావులు ఎందరో గుర్తించిన భారతరత్నం, విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్. "An Important Step Forward" అంటూ ఐన్ స్టీన్ లాంటి ప్రముఖ శాస్త్రవేత్తే మన బోస్ పరిశోధనా పత్రం "Planks law and Hypothesis of Light Quanta"ను జర్మనీ భాషలోకి అనువదించారు. అలాగే ఐన్‌స్టీన్‌కు అసాధారణ రీతిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టిన సాపేక్ష సిద్ధాంతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు బోస్. ఇప్పుడన్నా మనందరం గుర్తించి, ఆయన స్ఫూర్తి వారసత్వాన్ని నేటితరం కొనసాగించాల్సి వుంది.

భౌతిక శాస్త్రంలో బాహుబలి

భారతీయ భౌతిక శాస్త్రవేత్తల్లోనే 'బాహుబలి'గా మనం బోస్ ను చెప్పవచ్చు. ఒక్క రంగంలోనో, ఒక్క సబ్జెక్ట్ లోనో అసాధారణ ప్రావీణ్యం ప్రదర్శించడమే గొప్ప అనుకుంటున్న తరుణంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిలాసఫీ, ఆర్ట్స్, సాహిత్యం, సంగీతం తదితర అంశాల్లో సైతం అద్భుతమైన ప్రతిభను కనబరిచారు బోస్. ఆసియా ఖండంలోనే సాహిత్యంలో తొలి నోబెల్ బహుమతి గెలిచిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1937 లోనే తన పుస్తకం 'విశ్వ -పరిచయ్'ను బోస్‌కు అంకితం ఇచ్చారు. నేడు సత్యేంద్రనాథ్ బోస్ ఉదయించిన దినం. బోస్ 1894 జనవరి 1న ఉదయించి 1974 ఫిబ్రవరి 4న అస్తమించారు.

భారతీయ భౌతిక శాస్త్రవేత్తల త్రయం

విఖ్యాత భారతీయులు జగదీశ్ చంద్రబోస్, ప్రపుల్ల చంద్ర రాయ్‌లు సత్యేంద్రనాథ్ గురువులు. విఖ్యాత భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా సత్యేంద్రనాథ్‌కు స్నేహితుడు. క్వాంటం భౌతికశాస్త్రంలో బోస్-ఐన్ స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్-ఐన్ స్టీన్ కండెన్సెట్ థియరీలు చాలా ప్రఖ్యాతి పొందాయి. ఐన్ స్టీన్‌తో కలిసి బోస్ వీటిపై పరిశోధనలు చేశారు. సివిరామన్, మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్‌లను నేటి శతాబ్దపు భారతీయ భౌతిక శాస్త్రవేత్తల త్రయం (త్రిమూర్తులు)గా చెప్పవచ్చు. సత్యేంద్రనాథ్ బోస్ పరిశోధనలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి గెలిచారు. కానీ మన బోస్ నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యినప్పటికీ గెలవక పోవడం నేటికీ ఆశ్చర్యకరం.

ముందు మనం మారదాం

చరిత్ర గమనించి పరిశీలిస్తే మనదేశంలోని చాలామంది విఖ్యాత శాస్త్రవేత్తలకు ఈ దేశంలో అనుకున్నంత గుర్తింపు, ప్రోత్సాహం అందలేదని ఎంతోమంది ఆవేదనతో చెబుతున్న విషయం. ఈ దేశ యువతలో మెజారిటీ భాగం సినిమా హీరోలను, క్రికెటర్లను, రాజకీయ నాయకులను మాత్రమే అనుసరిస్తుంటారు. కానీ తమ జీవితాలను ఈ దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి కోసం త్యాగం చేసిన విక్రమ్ సారాభాయ్, హోం జహాంగీర్ బాబా, అబ్దుల్ కలాం వంటి మహానుభావుల గురించి పెద్దగా తెలుసుకోవటం లేదు. ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో, కళాశాలల్లో మనదేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన చరిత్ర, మన శాస్త్రవేత్తల జీవితచరిత్రలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేరణ ఇవ్వాల్సిన అవసరం నేడు ఎంతైనా వుంది. అభివృద్ధి చెందిన దేశంగా మనం ఎదగాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా వుండాల్సిందే..! మనలో మనం మారాల్సిందే..!

'దైవకణాల' ప్రతిపాదకుడు

బోస్ Fellow of the Royal Societyగా సెలెక్ట్ అయ్యారు. విశ్వ ఆవిర్భావానికి మూలమైన కణాలుగా శాస్తవ్రేత్తలు చెబుతున్న "దైవకణాలకు" పాల్ డిరాక్ అనే శాస్త్రవేత్త హిగ్స్-బోసాన్ అని బోస్ పేరు వచ్చేలా నామకరణం చేసారంటే ప్రతి భారతీయుడి గుండె "ఇది కదరా మన స్థాయి అంటే.. మనమంటే..! తగ్గేదేలే..!" అంటూ సగర్వంగా మన జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ, బోస్‌ను 'రియల్ బాహుబలి'గా స్మరించుకోవాలి. ఇండియా ఐన్ స్టీన్‌గా కీర్తించాలి.

పద్మవిభూషణ్‌తో సరిపెడితే ఎలా?

ఎంతోమంది విఖ్యాత శాస్త్ర వేత్తలు భారతరత్నంగా గుర్తించిన బోస్‌కు భారత ప్రభుత్వం 1954 లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది. కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్నతో సముచిత గౌరవం ఇస్తే అది మనందరికీ, యావత్ ప్రపంచానికి గర్వకారణం. మన తరగతి గదుల్లో కూడా ఇలాంటి మహానుభావుల జీవితాలను విద్యార్థులకు బోధిస్తే భవిష్యత్తు తరాల్లో మనదేశం గర్వించే శాస్త్ర వేత్తలు వస్తారు. నేటితరంలో పరిశోధనలు చేయడానికి జీవితంలో చాలా సమయం వృథా అవుతుందని, త్వరగా ఏదో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలనే వ్యాపారాత్మక భావనలు పెరగడం వల్ల శాస్త్రీయ రంగాల్లోకి ఏదో సాధించాలనే తాపత్రయంతో వస్తున్న వారి సంఖ్య చాలా తగ్గుతుందనేది వాస్తవం. ఈ తత్వంలో మార్పు రావాలి. సత్యేంద్రనాథ్ బోస్ స్ఫూర్తితో ప్రపంచం గర్వించదగ్గ భారతీయ శాస్త్రవేత్తలుగా నవతరం ఎదగాలని ఆకాంక్షిస్తూ బోస్ మాటలతో ముగిస్తున్నాను.

"I knew unless I got stopped

I was going to go all the way.

I don't know if I can run any faster,I just ran as fast as I could."

నూతన సంవత్సర శుభాకాంక్షలతో...

(జనవరి 1న సత్యేంద్రనాథ్ బోస్ జయంతి సందర్భంగా)

ఫిజిక్స్ అరుణ్ కుమార్

ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ

93947 49536

Advertisement

Next Story

Most Viewed