చిన్న చిన్న సంపాదనలు... చదువుకి సోపానాలు

by Ravi |   ( Updated:2024-01-19 01:15:51.0  )
చిన్న చిన్న సంపాదనలు... చదువుకి సోపానాలు
X

కొన్ని జీవితాలు ఉత్తేజాన్ని కలిగించేవైతే, కొన్ని కనువిప్పు కలిగించేవి, మరికొన్ని అయ్యో అనిపించేవి, మరికొన్ని అభినందించేవి, కొన్ని కొత్త పాఠాలు నేర్పించేవి. ఏదైతేనేమి, కారు లేని కొన్ని రోజుల ఈ ప్రయాణం.. కొంత ఆసక్తిని, కొన్ని అనుభవాలను పరిచయం చేసింది.

ఇటీవల వారం రోజుల పాటు కొన్ని కారణాల వల్ల నా ఆఫీసుకి, ఇంటికి ఓలా, ఉబర్, రాపిడో యాప్‌ల ద్వారా క్యాబ్, ఆటో, బైక్ సేవలు ఉపయోగించుకోవాల్సి వచ్చింది. మొదటి రెండు రోజులు క్యాబ్, ఆటో డ్రైవర్లతో ఇంటరాక్ట్ కాలేదు కానీ 35, 50, 60 రూపాయలకు 5 కి. మీ దూరాన్ని చేర్చే బైక్ వాలాలతో అంత తక్కువ మొత్తంతో ఏమి గిట్టుబాటు అవుతుందని, ఆఫీసుకి పోయి వచ్చే వేళల్లో మాటా మంతి కలిపా.. మనసు ద్రవింప చేసే ఎన్నో కథలు అనకూడదు కానీ వారి జీవిత చిత్రాలు అనాలేమో..

ఇక్కడ పార్ట్‌టైం పనులంటే..

కొన్ని జీవితాలు ఉత్తేజాన్ని కలిగించేవి అయితే, కొన్ని కనువిప్పు కలిగించేవి, మరికొన్ని అయ్యో అనిపించేవి, మరికొన్ని అభినందించేవి, కొన్ని కొత్త పాఠాలు నేర్పించేవి. ఏదైతేనేమి కారులో ప్రయాణం కన్న బైక్ ప్రయాణం కొంత ఆసక్తిని కలిగించింది. కొన్ని అనుభవాలను పరిచయం చేసింది. బైక్ ద్వారా ప్రయాణం చేయడం వల్ల పార్కింగ్ సమస్య లేదు, ట్రాఫిక్‌లో చిక్కుకొని చికాకు పడేది లేదు, పైగా తక్కువ ఖర్చుతో గమ్యాన్ని చేరడమే కాకుండా, ఒక వ్యక్తికి ఉపాధి కల్పించామన్న సంతృప్తి నన్ను ఆనందపరచింది. వాళ్ళతో మాటలు కలిపినప్పుడు వారి అవసరాలు వారిని రోడ్డు బాట పట్టించాయని, చిన్న చిన్న మొత్తాలు వారి దీర్ఘకాలిక లక్ష్యాలకు సోపానాలు అయ్యాయని అర్థమైంది.

ఎందరో భారతీయులు ఉన్నత విద్య కోసం అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, బ్రిటన్ దేశాలకు వెళ్లి అక్కడ హోటల్స్‌లో, పెట్రోల్ బంకుల్లో, షాపింగ్ మాల్స్‌లో పని చేస్తూ కొంత సంపాదించుకొని తల్లిదండ్రులకు భారం కాకుండా చదువుకోవడం చూస్తూ ఉంటాం. కాని అదే పిల్లలు ఇక్కడ అలాంటి పనులు చేయాలంటే కాస్తంత తటపటాయిస్తారు, నామోషీగా ఫీల్ అవుతారు. కానీ ఈ కుర్రాళ్ళు వారి చదువు కోసం ఓ పక్క కుటుంబాన్ని చూసుకుంటూ, పోషిస్తూ, వారి చదువుకు వారే పెట్టుబడి పెట్టుకుంటూ ఉన్నత లక్ష్యాల వైపు ఒక్కో మెట్టు ఎక్కుతూ సాగిపోతున్నారు. చాలా మంది కాలేజ్ నుండి వచ్చాక సాయంత్రం పూట, లేదా ఉదయం కొంత సేపు వారికి సమయం దొరికినప్పుడల్లా ఆయా యాప్స్ ఓపెన్ చేసుకొని వచ్చిన రైడ్స్ అంగీకరిస్తూ ఎందరినో గమ్యాలు చేరుస్తూ తమ గమ్యం వైపు ప్రయాణం చేస్తున్నారు..

కదిలించే గాథలు..

ఇటీవల ఏ ఫంక్షన్‌లో చూసినా వడ్డించేవాళ్లలో ఎక్కువగా చిన్న వయసు కుర్రాళ్ళు, అమ్మాయిలను చూస్తుంటాం. వారిలో ఎవరిని కదిలించినా ఏదో జేబు ఖర్చుల కోసమనో, చదువు కోసమనో పార్ట్ టైం ఉపాధి అవకాశాలు పొందుతున్నట్లు విన్నాను. ఇంజనీరింగ్ చదువుతూ కూడా కేటరింగ్ కుర్రాళ్ళ అవతారం ఎత్తి ఎంతో కొంత సంపాదిస్తూ వారికి వారు చేయూత నిచ్చుకోవడం సంతోషం వేసింది.

ఒక్కొక్కరిని కదిలిస్తే కదిలించే గాథలు.. ఒకరు చెల్లె పెళ్లికి ఉందని, ఒకరు తండ్రి చనిపోయాడు అమ్మ ఒక్కతే కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బంది అవుతుందని, ఒకబ్బాయి అయితే ఇంటర్‌లో రెండు సబ్జెక్ట్స్ పోయాయి, అవి పాస్ అయ్యాకే ఇంటికి పోవాలని పట్నం వచ్చి పని చేసుకుంటూ చదువుతున్నానని, మరొక అబ్బాయి రోడ్ యాక్సిడెంట్ జరిగి కోలుకున్న మూడు నెలలకే ఉపాధి కోసం పట్నం బాట పట్టాడు. ఇలా డిగ్రీ, పీజీ, బీటెక్ చదివీ ఓ పక్క పోటీ పరీక్షలకు సిద్ధం అవుతూనే ఉబర్, ఓలా బైకులు నడుపుతూ వేడి నీళ్లకు చన్నీళ్ళు తోడుగా జేబు ఖర్చుల కోసం రోజుకు రెండు నుండి ఐదు గంటల పాటు బైక్‌పై చక్కర్లు కొడుతూ ఎందరినో గమ్యాల చేరుస్తూ తమ గమ్యం వైపు దూసుకెళుతున్న యువతరాన్ని అభినందించక తప్పదు. 'రూపాయి రూపాయి కూడబెడితే వంద అవుతుంది సార్' అన్న పద్దెనిమిదేళ్ల కుర్రాడి మాటలు వింటుంటే కళ్ళు చెమర్చాయి. బిల్లుపై ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తుంటే, సార్ చిల్లర లేదు ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి సార్ అని ఒకరిద్దరు మర్యాదగా తిరస్కరిస్తుంటే వారి ఆత్మ గౌరవానికి ముచ్చటేసింది. బలవంతంగా జేబులో పెట్టి ముందుకు కదిలా కొన్నిసార్లు.

ఉడుత సాయం చేద్దాం!

కొంత మంది షాపింగ్ మాల్స్‌లో పని చేయడం చూసా, కొంత మంది పెట్రోల్ బంక్‌ల్లో పార్ట్ టైం జాబులు చేస్తున్న వారిని చూసా.. మరికొంత మంది పెద్ద పెద్ద చదువులు చదివి చిన్న పాటి ఆసుపత్రుల్లో, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న యువత కలలు పండాలని ఉన్నత ఉద్యోగాలు సాధించడానికి ఈ చిన్ని చిన్ని ఉద్యోగాలు వారికి లక్ష్యానికి సోపానాలు కావాలని ఆశిద్దాం. పెద్ద పెద్ద కార్లు, వ్యక్తిగత వాహనాలు వాడే వారు ఈ ఓలా, ఊబర్, రాపిడో కుర్రాళ్లకు చేయూత నిచ్చే విధంగా వారి వారి ఆఫీసులకు బైకులపై వెళితే వారికి ఉపాధి నిచ్చిన వారే కాకుండా వారి లక్ష్యంలో ఉడుత సాయం చేసిన వారు అవుతారు. వారి బిల్లులో చిల్లులు పెట్టి యాప్ యాజమానులు ఇచ్చే కమీషన్‌ను అదనంగా టిప్‌లా ఇస్తే ప్రోత్సహించిన వారు అవుతారు. యువత నామోషీ ఫీల్ అవకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. పెద్ద పెద్ద లక్ష్యాలు చిన్న చిన్న మెట్లను ఎక్కడం ద్వారా అధిగమించాలి. ఒక్కో రూపాయి కూడబెడితే లక్ష అవుతుంది.. ఒక్కో మెట్టు ఎక్కితే లక్ష్యం దగ్గరవుతుంది.

శిరందాస్ శ్రీనివాస్

94416 73339

Advertisement

Next Story