- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ గౌరవాన్ని పెంచిన..సుప్రీం హ్యాండ్ బుక్
ప్రకృతిని మనం స్త్రీ స్వరూపంగా భావిస్తాం. ప్రకృతిమాతను చెట్లు, పుట్టలు, కొండల్లోనూ చూస్తాం.. కొలుస్తాం. స్త్రీ రూపంలోని దేవతా మూర్తులను ఎల్లవేళలా ఆరాధిస్తాం. కానీ సమాజంలో స్త్రీలను గౌరవించే విషయానికి వచ్చేసరికి మన ఆలోచనా దృక్పథం మారిపోతుంటుంది. మగ పిల్లలు పుడితే సంతోషిస్తూ.. ఆడపిల్లలు పుడితే బాధపడుతుంటాం. పని ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మహిళలను చిన్నచూపు చూసే ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. అన్ని రంగాల సంస్థలకు మహిళల పని సామర్థ్యం తక్కువనే బ్యాడ్ ఒపీనియన్ ఉంది. పైకి భక్తి.. లోపల కుయుక్తి అన్నట్టుగా సాగుతున్న భారత సమాజానికి మార్గదర్శనం చేసే దిశగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ముందడుగు వేసింది.
జడ్జీలకు దిశా నిర్దేశం.. హ్యాండ్ బుక్
న్యాయస్థానాల్లో విచారణలు, వాదనలు, తీర్పుల్లో స్త్రీలను కించపరిచే పదాలను వినియోగించకుండా ఉండాలని జడ్జీలకు దిశా నిర్దేశం చేసేందుకు 30 పేజీల హ్యాండ్‌బుక్‌ను సుప్రీంకోర్టు మొన్న విడుదల చేసింది. ‘హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్’ అనే టైటిల్ కలిగిన ఈ హ్యాండ్‌బుక్ సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మహిళలను కించపరిచేలా న్యాయ వ్యవహారాల్లో ప్రస్తుతం వాడుతున్న అసభ్య పదాల స్థానంలో వినియోగించాల్సిన ప్రత్యామ్నాయ పదాలను ఆ హ్యాండ్‌బుక్‌లో చక్కగా పొందుపరిచారు.ఈ బుక్ ని గతంలో దేశంలోని వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులలోని అసభ్య పదాలను కూడగట్టి దీనిని రూపొందించారు. అప్పుడు వాడిన ఆ పదాలను మీరు చూస్తే నోరెళ్లబెడతారు ఎందుకంటే కోర్టు కేసులకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్‌లో, పిటిషన్స్‌లో, తీర్పు కాపీల్లో ఇలాంటి అసభ్య పదాలను వాడేవారా? అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి ఆ వ్యాఖ్యానాలు!
మహిళా సంఘాలూ మేల్కోండి
మహిళల గౌరవాన్ని నిలబెట్టాలా.. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేలా.. లింగ వివక్షకు తావు లేకుండా చేసేందుకు సుప్రీంకోర్టు చేసిన ఈ కృషి అన్ని రంగాలకు అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక్క సిరా చుక్క వెయ్యి మెదళ్లకు కదలిక సృష్టించగలదని అంటారు. అదే నిజమైతే.. బూతులకు గుడ్ బై చెప్పేందుకు సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన హ్యాండ్ బుక్ లోని ప్రతీ పదం కూడా దేశంలోని అన్ని రంగాలకు స్ఫూర్తిని పంచాలి. అందులోని బూతు పదాలను తమతమ రంగాల్లో వాడబోమని ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, వాటితో ముడిపడిన సంఘాలు తీర్మానాలు చేయాలి. ఈ దిశగా వాటిపై మహిళా సంఘాలు ఒత్తిడి పెంచాలి. ఆయా సంఘాలు, సంస్థలను కలిసి విజ్ఞాపనలు సమర్పించాలి. ప్రయత్నం లేనిది ఫలితం రాదు. మహిళా జనోద్ధరణ జరగాలంటే .. మహిళా సంఘాలు తమ నిజమైన చొరవను, పోరాట స్ఫూర్తిని ఇలాంటి విషయాల్లో చూపించాలి.
ఆ పదాలు ఉండవు!
వేశ్య, వ్యభిచారిణి, ప్రాస్టిట్యూట్, వోర్, హుకర్ అనే పదాలకు బదులుగా సెక్స్ వర్కర్ అనే పదాన్ని వాడాలని సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన హ్యాండ్ బుక్ లో సూచించారు. ఉంపుడుగత్తె అనే అర్థంలో వాడిన కీప్, కాంక్యుబైన్ బదులుగా విమెన్ విత్ సెక్సువల్ రిలేషన్స్ అవుట్‌సైడ్ ఆఫ్ మ్యారేజ్ (వివాహ బంధానికి వెలుపల లైంగిక సంబంధాలు నెరిపే మహిళ)గా పేర్కొనాలని తెలిపారు. ఉంపుడుగత్తె సంతానమని చెప్పేందుకు వాడుతున్న బాస్టర్డ్ అనే పదానికి బదులుగా నాన్ మ్యారిటల్ చైల్డ్ (వివాహేతర సంతానం) అని తెలపాలి. హౌస్ వైఫ్‌ను హోమ్‌మేకర్ అని పిలవాలి. మిస్ట్రెస్‌ను విమెన్ అని సంబోధించాల్సి ఉంటుంది. కెరీర్ విమెన్‌ను.. విమెన్ (మహిళ) అని పిలిస్తే సరిపోతుంది. ఈవ్ టీజింగ్‌ను ఇక మీదట స్ట్రీట్ సెక్సువల్ హరాస్‌మెంట్‌గా పేర్కొనాల్సి ఉంటుంది. స్పిన్స్టర్ (కన్య) అనడం కంటే అన్‌మ్యారీడ్ విమెన్ అనడం సముచితం అని సుప్రీంకోర్టు హ్యాండ్‌బుక్ పేర్కొంది. ఇలా పలు పదాల స్థానంలో కొత్తవాటిని ఉచ్చరించాలని, వాటినే న్యాయమూర్తులు తమ ఆదేశాల్లో వాడాలని, తీర్పుల్లో రాయాలని అందులో సూచించారు.
జెండర్ ఈక్వాలిటీలో.. వెనుకంజ!
"ప్రపంచ బ్యాంకు జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్"లో భారత్ వెనుకబడి ఉంది. ఒకేలాంటి పనికి స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు ఇచ్చేలా చూసేందుకు భారత్‌లో చట్టాలేమీ లేవు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ జెండర్ గ్యాప్ నివేదిక 2022 ప్రకారం.. స్త్రీ, పురుషుల సమానత్వంలో జాబితాలోని 146 దేశాల్లో భారత్ 135వ స్థానంలో ఉంది. ఉదాహరణకు మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్) యాక్ట్ 2017, మైన్స్ యాక్ట్ 1952, ఫ్యాక్టరీస్ యాక్ట్ లాంటి చట్టాల్లో పురుషుల్లా మహిళలు ఫ్యాక్టరీల్లోని కొన్ని విధుల్లో పాల్గొనకుండా ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి ఆంక్షల వల్లే ప్రపంచ బ్యాంకు జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో భారత్ వెనుకంజలో ఉంది. ఈ పరిస్థితి మారాలంటే మహిళలు, మహిళా సంఘాలు న్యాయపోరాటం చేయాలి. జస్టిస్ డీవై చంద్రచూడ్ లాంటి ధర్మ తత్పరులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఈ సమయంలో లింగ వివక్షను రూపుమాపే ఎజెండాతో న్యాయ పోరాటం చేస్తే సమాజ ఉద్ధరణ దిశగా తగిన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
మహ్మద్ హాజీపాషా
జర్నలిస్ట్
89198 31749