- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫిరాయింపుదారుని రీకాల్ చేయాలి
ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు అధికారం కోసం పార్టీ ఫిరాయించడం ఇటీవల కాలంలో పరిపాటి అవుతోంది. 2014లో తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 సీట్లు గెలిచింది. కానీ కొద్దిరోజుల్లో ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి ఫిరాయించారు. మధ్యప్రదేశ్ లోనూ కాంగ్రెస్ సభ్యులు ఫిరాయించారు. రాజస్తాన్‌లో ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల తర్వాత వైసీపీ సభ్యులు టిడిపీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది. ఆంధ్ర ప్రదేశ్‌లో శాసనసభ్యుడు ఒకరు అధికారపార్టీ అసోసియేటెడ్ సభ్యుడిగా మారాడు. ఇలా పలు రాష్ట్రాల్లో జరుగుతునే ఉంది. ప్రజలు ఆ వ్యక్తిపై, అతను పోటీ చేసే పార్టీపై నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తారు. కానీ గెలిచిన తరువాత ప్రతిపక్షంలో ఉంటే తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి పార్టీ మారుతున్నానని చెబుతున్నారు. ఇది ప్రజలను మోసం చేయడమే కదా. వారు ప్రతిపక్షంలో ఉండమని ప్రజలు తీర్పు చెబితే అధికార పక్షంలోకి వెళ్లడం తప్పే అవుతుంది. గతంలో హర్యానాలో ముఖ్యమంత్రితో సహా పార్టీ శాసనసభ్యులందరూ ఒకేసారి పార్టీ మారి సంచలనం సృప్టించారు. దానికి ఆయారాం! గయారాం! అనే నానుడి వచ్చింది. ఆ తర్వాత ఫిరాయింపుల చట్టం తెచ్చినా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని ఫిరాయింపులను మాత్రం కొనసాగిస్తున్నారు. కొత్తగా చేరే పార్టీ రాజీనామా చేసి రమ్మనమని డిమాండ్ చేయాలి. లేదా ఎన్నికల ముందు అయినా చేరాలని నిబంధన పెట్టాలి. శాసన సభ్యుడిగా వస్తే రాజీనామా చేయించి మళ్లీ ఉపఎన్నిక జరిపించాలి. అప్పుడే ప్రజాస్వామ్య విలువలు నిలుస్తాయి. రాజకీయపార్టీలు ముందుగా అభ్యర్థులను నిర్ణయించే సమయంలో రాజీనామా పత్రాలపై సంతకాలు పెట్టించుకోవాలి. లేదా ప్రజలు రీకాల్ చేసేలా ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలి. అదే ఫిరాయింపులకు తగిన పరిష్కారం. దీనిపై ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలి. అందుకు మేధావులతో చర్చించి రాజ్యాంగం పరిరక్షించే విధంగా పరిష్కారం ఆలోచించాలి.
ఎన్నికల అఫిడవిట్ వాస్తవంగా ఉండాలి
అభ్యర్థులు ఎన్నికలకు వెళ్లేముందు నామినేషన్ పత్రంలో పాటు తన కుటుంబానికి ఉన్న ఆస్తుల విలువపై అఫిడవిట్ సమర్పిస్తారు. ఇటీవల బినామీ పేర్లతో అక్రమ ఆస్తులు సంపాదించడం పరిపాటి అయ్యింది. ఆస్తి వారి ఆధీనంలోనే ఉన్నా అది వారి బంధువులు,లేదా అనుచరుల పేర ఉంటుంది. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అఫిడవిట్లో చేర్చకపోతే అధికారులు పరిశీలించాలి. నామినేషన్లు పరిశీలనకు పెట్టి అభ్యంతరాలు లేవంటేనే ధృవీకరించాలి. వీరి గురించి ప్రతిపక్ష అభ్యర్థులను అడిగితే అసలు నిజాలు వస్తాయి. ఎందుకంటే తామే గెలవాలని వారు నిజాలు చెబుతారు. దానిపై విచారణ జరిపి అధికారులు నిర్ణయం తీసుకోవచ్చు. దీనికి నామినేషన్లు వేసేచోట ఫిర్యాదుల పెట్టె పెడితే సరి. అఫిడివిట్ సరిగాలేదని తేలితే అతన్ని కొన్ని సంవత్సరాల పాటు ఎన్నికలకు దూరంగా ఉంచాలి. ఆ మేరకు సంస్కరణలు తీసుకురావాలి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ శేషన్ గుర్తుకు వస్తారు. ఆయన ఉన్నప్పుడు ఎన్నికలు సజావుగా జరిగేవి. అభ్యర్థులు తప్పు చేయడానికి భయపడేవారు. ఉన్న నిబంధనలనే ఖరాఖండిగా ఆయన అమలు చేసేవారు. అప్పుడే అభ్యర్థులు భయంతో నిబంధనలు పాటించారు. మరి ఇప్పుడు సంస్కరణలు తెస్తే అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు భయపడో, తాను పోటీ చేసే పార్టీపట్ల భక్తితోనో ఖచ్చితంగా పాటిస్తారని నమ్ముదాం. ప్రజాస్వామ్య విలువలు కాపాడతారని ఆశిద్దాం.
యం.వి. రామారావు,
సీనియర్ జర్నలిస్టు
72869 64554