సమగ్ర కులగణనను ప్రారంభించాలి

by Ravi |   ( Updated:2024-09-03 15:29:07.0  )
సమగ్ర కులగణనను ప్రారంభించాలి
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అధికారంలోకి రాగానే ఓబీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ హామీ నిలబెట్టుకునే సమయం వచ్చింది. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి బీసీ రిజ్వేషన్లను 42% పెంచాలి. తెలంగాణలో కొత్తగా బీసీ కమిషన్ పేరిట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో కులగణన లేకుండా, రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మాత్రం ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరని గుర్తించాలి.

బీసీల సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు కులగణన ఓ గొప్ప అవకాశంగా మారాలి. ఓబీసీ కులాల లెక్కలు లేకపోవడం వలన అనేక సార్లు బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కంటూ ఓ క్లారిటీ వస్తుంది. కులాలవారీగా జనాభా లెక్కలు ఉన్నప్పుడే అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించే వీలు ఏర్పడుతుంది. బీసీ కులాలను ఉప కులాలుగా విభజించటం వీలవుతుంది. క్రిమిలేయర్‌ను కూడా సమర్థవంతంగా అమలుచేసే అవకాశం ఉంటుంది. కులజనగణన వలన మాత్రమే ఓబీసీ కులాలకు సమానత్వం, సామాజిక న్యాయం అందుతాయి. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచవ చ్చు. కులగణన ఈ దేశానికి ఒక దశ, దిశను నిర్దేశిస్తుంది.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఎప్పుడు?

గత కొన్ని సంవత్సరాలుగా బీసీలు, బీసీ బిల్లు కోసం ఉద్యమిస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. బీసీ అట్రాసిటీ చట్టం కూడా తీసుకుని వచ్చి బీసీలకు రక్షణ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో బీసీ జనగణన చేపట్టాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్లను 52 శాతం పెంచాలి. దీనిపై బీసీలంతా ఏకతాటిపై వచ్చి ఉద్యమించేలా జాతీయ బీసీ దళ్ కార్యాచరణను సిద్ధం చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్ట సభల్లో 10 శాతం కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. బీసీలు చట్ట సభల్లో అడుగు పెట్టాలంటే కేవలం రిజర్వేషన్లతోనే సాధ్యమవుతుంది. మోడీ పాలనలో బీసీ వర్గాల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదు. కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు.

బీసీలకు రిజర్వేషన్లను పెంచాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలి. ఇంటింటి సర్వే ఎప్పుడు మొదలవుతుందా? అని తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. రిజర్వేషన్‌ను అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయాల్సిందే. అప్పుడే ప్రజల సంపూర్ణ మద్దతు లభిస్తుంది. రాహుల్ గాంధీ మాటకు విలువ ఇచ్చి తెలంగాణలో వేగంగా కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలి. కులగణన అనేది బీసీల జన్మహక్కు.. కులగణన చేపట్టకపోతే పార్టీలకతీతంగా సామూహిక నిరాహార దీక్షలు, ధర్నాలకు దిగబోతున్నాం. తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతోంది.. వారిని ఇప్పటికే ఎన్నో పార్టీలు మోసం చేశాయి. దయచేసి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆ లిస్టులోకి చేరకూడదని చేతులు జోడించి వేడుకుంటున్నాము. దేశంలో 51 శాతం జనాభా ఉన్న బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కూడా లేవు. బిహార్‌లో 5 వారాల్లోనే కులగణన చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు, సంఘాలు అందరూ ఏకమవ్వాలి.

తెలంగాణలో కొత్తగా బీసీ కమిషన్ పేరిట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీసీ కమిషన్‌కు కొత్తగా పాలకమండలిలో రాజకీయ నాయకులతో భర్తీ చేస్తే ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. బీసీ కమిషన్ పాలకమండలిలో నిపుణులు లేకుండా నియామకాలు జరిపితే ఉత్పన్నమయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి, ఎవరైతే బీసీల కోసం తెలంగాణలో పాటు పడుతున్నారో, గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారో.. వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, సముచిత స్థానం కల్పిస్తుందని భావిస్తున్నాను.

దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు

99599 12341

Advertisement

Next Story