పొత్తుల కత్తుల యుద్ధం!

by Ravi |   ( Updated:2024-03-07 01:15:52.0  )
పొత్తుల కత్తుల యుద్ధం!
X

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోన్న ప్రశ్న. ఎందుకంటే, బీజేపీకి జనసేన మిత్రపక్షం. కానీ, తెలుగుదేశంతో జత కట్టారు పవన్‌ కల్యాణ్‌. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కమలదళ వ్యూహం పరిశీలిస్తే ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఏపీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు పరిస్థితులు గోచరిస్తున్నాయి.పొత్తుల ప్రస్తావన లేకుండానే ఎన్నికల కార్యాచరణకు సిద్ధం ఔతోంది కమలదళం. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ సీట్లకు అభ్యర్థుల కోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. పొత్తులతో సంబంధం లేకుండా అభ్యర్థులను సిద్ధం చేయాలన్న అధిష్టానం ఆదేశాలతో ప్రతి లోక్‌సభ నియోజక వర్గంలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాక వాటిని వడబోసి తుది జాబితాను ఢిల్లీకి పంపనుంది. అంతేకాదు.. టీడీపీ, జనసేన నుంచి వచ్చే నేతలను, టికెట్లు రాని వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కమలంతో పొత్తుపై తెగని ఆశలు

ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఉమ్మడి జాబితా విడుదల చేయడమే కాకుండా, ఉమ్మడిగా బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ కూడా తమతో కలిసి పనిచేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొంత కాలంగా ధీమాగా చెబుతూ వస్తున్నారు. అంతేకాదు, టీడీపీతో కలిసి పనిచేసేందుకు ఢిల్లీ పెద్దలను ఒప్పించడానికి తాను తిట్లు కూడా తినాల్సి వచ్చిందంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని భావించడం అటు జనసేనకు, ఇటు టీడీపీకి పెద్ద దెబ్బే అవుతుంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. పొత్తుల అంశంపై పలుమార్లు చర్చించారు. ఈ చర్చలు ఓ కొలిక్కి రాకముందే జనసేన-టీడీపీ కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం బీజేపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. పొత్తులే కాకుండా, సొంతంగా బలపడేందుకు వ్యూహాలను రచించాలని పార్టీ నేతలకు, అధిష్టానం సూచనలు మార్గదర్శకాలు జారీ చేసింది..

'జెండా' సభల ప్రభావం ఎంత?

జనసేన -తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయ కేతనం ‘జెండా’ భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభలో పవన్ చేసిన ప్రసంగం సలహాలిచ్చే వాళ్ళు కాదు… యుద్ధం చేసేవాళ్ళు కావాలి. సామాన్యుడి రాజకీయం చేస్తే వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. మనం వ్యూహాలు వేస్తే భరించలేకపోతున్నారు. సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో వైసీపీకి చూపిస్తాం. పొత్తులు పెట్టుకుంటాం… వైసీపీ ఫ్యాక్షన్‌ కోటలు బద్ధలు కొడతాం. నాకు సలహాలు సూచనలు అవసరం లేదు. యుద్ధం చేసే నాయకులు కావాలి. జగన్‌ దాష్టీకానికి ఎదురొడ్డి నిలబడే యువత కావాలి అన్న వ్యాఖ్యలు ఇరు పార్టీల శ్రేణులలో ఎంత మాత్రం ఉత్సాహాన్ని నింపాయో తెలియదు కానీ పవన్ చేసిన ప్రసంగం రెండు పార్టీలలో చర్చనీయాంశమైంది.

జనసేన -తెలుగుదేశం పార్టీలు సమన్వయం చేసుకోవాలి సంయమనంతో వ్యవహరించాలి. పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలి. అసమ్మతిని చల్లార్చాలి. ప్రకటించిన స్దానాల్లో అభ్యర్థుల బలబలాలను క్షేత్ర స్థాయి నివేదికల ఆధారంగా తెలుసుకొని ఆత్మ విమర్శ చేసుకొని మార్పులు చేర్పులు చెయ్యాలి. తదుపరి జాబితా ప్రకటించే సమయంలో లోతుగా నిశితంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ప్రచారాన్ని ఎన్నికల మేనిఫెస్టోని త్వరగా రూపొందించి ప్రచార పర్వాన్ని ప్రారంభించి కదనరంగంలోకి దూకాలి.

ప్రజల తీర్పు ఎటువైపు!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను మారుస్తూ వస్తున్న వైఎస్సార్‌సీపీ.. ఇప్పటివరకూ 7 జాబితాలలో దాదాపు 60 మందికి పైగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల పేర్లను ప్రకటించింది. ఫిబ్రవరి 28న 8వ జాబితాను విడుదల చేసింది. మరో 3 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. ఆభ్యర్థులు విజయం సాధించటంపై సర్వేలు నిర్వహిస్తూ అసమ్మతిని చల్లారుస్తూ ప్రజా వ్యతిరేకత ఉన్న అస్మదీయులను సైతం పక్కకు పెట్టి పూర్తి స్థాయిలో విజయంపై కసరత్తు చేస్తోంది వైఎస్సార్‌సీపీ. సంక్షేమమే గెలిపిస్తుంది అన్న ధీమా మంచిదే కానీ అభివృద్ధిని విస్మరించడం ఎంతవరకు సబబో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇప్పుడు ప్రత్యర్థులకు అదే ప్రధాన అస్త్రం కాబట్టి వచ్చే ఎన్నికల మేనిఫెస్టోపై ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలి. ఈ పొత్తుల కత్తుల యుద్దంలో విజేతలని నిర్ణయించేది ప్రజలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ జయ కేతన పవనాలు వీస్తాయో వేచి చూద్దాం.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story

Most Viewed