- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మధ్యతరగతికి భరోసానిచ్చిన బడ్జెట్

సాధారణ ప్రజల నుండి కార్పొరేట్ల వరకు అందరికీ కేంద్ర బడ్జెట్ ఆశల పల్లకి లాంటిది. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తన ఎనిమిదో బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పించి రికార్డు సృష్టించారు. ప్రతీ సంవత్సరం బడ్జెట్ వస్తుందంటే వేతన జీవులు ఏమైనా రాయితీలు ఇస్తారేమోనని ఎంతో ఆశతో ఎదురు చూస్తారు..
నిజానికి దేశంలో అత్యధిక పన్నుల భారాన్ని మోస్తున్నది మధ్యతరగతి ప్రజలేనని ఈ గణాంకాలను పరిశీలిస్తే మనకు అవగతం అవుతుంది. మధ్యతరగతి నుంచి ఇతర వర్గాల నుంచి వినియోగ స్థాయి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను విధానాన్ని హేతుబద్ధం చేయాలని, ఆదాయ పన్నులో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావించి వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షల వరకు పెంచింది.
ఆర్థిక వృద్ధిని ప్రేరేపించేందుకు..
ఈ బడ్జెట్‌ను స్థూలంగా చూస్తే అంతర్జాతీయ పరిణామాలకు తట్టుకొని మన ఆర్థిక వ్యవస్థ నిలబడేలా, మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెంచేలా, నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా, గ్రామీణ వ్యవసాయదారులకు మేలు చేసిదిగా, ఉన్నంతలో ఈ బడ్జెట్ భరోసానిచ్చిందని చెప్పవచ్చు. గత నాలుగేండ్ల కనిష్ట స్థాయికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 6.4% వృద్ధి రేటు మాత్రమే సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కానీ వాస్తవ పరిస్థితులకు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మందగించిన ఆర్థిక వ్యవస్థలు, భౌగోళిక రాజకీయ అనిచ్చితి, పెరుగుతున్న ద్రవ్యో ల్బణం, ప్రజల వినియోగ స్థాయి పడిపోవడం, నిరుద్యోగిత, డాలర్‌తో పోల్చుకుంటే రూపా యి విలువ క్షీణత వల్ల మన దేశ ఆర్థిక వృద్ధి రేటుపై ప్రభావం పడింది. జీడీపీ అంచనా కుదించబడినందున ఆర్థిక వృద్ధిని ప్రేరేపించే విధానాలకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చింది.
వినియోగానికి పెద్ద పీట!
మౌలిక సదుపాయాల, ఉద్యోగాల కల్పనను, వ్యాపార సౌలభ్యత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేస్తుందని, పన్నుల సంస్కరణలు, ప్రోత్సాహకాలు ఆర్థిక వృద్ధికి కీలకంగా ఉన్నందున, వాటిలో సంస్కరణలు ఉంటాయ ని, ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా బడ్జెట్ ఉంటుందని ఆర్థికవేత్తలు, మేధావులు భావించారు. ఆర్థిక వేత్తల అంచనాలకు అనుగుణంగానే ఈ బడ్జెట్ ఉంది. జీడీపీ పెరగాలంటే ప్రజల వినియోగం పెరగాలి. వినియో గం పెరగాలంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలి. గత ఏడాది పట్టణ వినియోగం తగ్గ డం వల్ల దాని ప్రభావం జీడీపీపై పడింది. ప ట్టణ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభు త్వం ఈ బడ్జెట్ ద్వారా చర్యలు చేపట్టింది.
విద్యారంగం కేటాయింపులు తక్కువే!
దేశంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నా, ప్రపంచంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలన్నా, విద్య వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం దేశ జీడీపీలో కనీసం 6% నిధులు విద్యారంగానికి కేటాయించాలి. కానీ గత దశాబ్ద కాలంగా దాదాపుగా 4.1%-4.6% మాత్రమే కేటాయింపులు జరిగాయి. క్షేత్రస్థాయి నుండి నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్లో దేశంలోని ప్రభుత్వ స్కూల్లో 50వేల అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు హర్షణీ యం. కానీ పరిశోధనా రంగానికి అత్యధికంగా నిధుల కేటాయింపులు మరింతగా పెరగాలి. పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు ఇన్నోవేషన్స్, స్టార్ట్ అప్స్‌లను ప్రోత్సహించడం ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుంది. సాంకేతిక, ఆరోగ్య సంరక్షణ సవాళ్ల కోసం విద్యార్థులను సిద్ధం చేయడం గురించి కూడా బడ్జెట్ నొక్కి చెప్పింది.
పనిముట్లపై జీఎస్టీ రాయితీ తగ్గించాలి!
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించ డానికి రైతులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ లిమిట్‌ను మూడు నుండి ఐదు లక్షలకు పెంపు నిర్ణయం, పప్పు దినుసుల పంటలపై ప్రత్యేక దృష్టి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వాణిజ్య పంట అయిన కాటన్ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు వంటి చర్యలు వ్యవసాయ రంగం అభివృద్ధికి దోహదపడతాయి. కానీ రైతాంగం సహ జంగా ఉపయోగించే వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ రాయితీ ఇస్తే రైతాంగానికి మరింత మేలు చేకూరే అవకాశం ఉంది. కొవిడ్ తర్వాత ప్రభుత్వం ఆరోగ్య సేవలు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా రాబోయే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్ల పెంపు, అన్ని జిల్లాల్లో డే కేర్ కేన్సర్ సెంటర్ ఏర్పాటు నిర్ణయాలు వైద్య రంగ బలోపేతానికి దోహదపడతాయి. కేవలం సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టకుండా దేశంలోని ప్రజల కు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితం గా అందిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. ప్రపంచంలో భారతదేశం మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.
పాకాల శంకర్ గౌడ్
98483 77734