జననాడి: ఈశాన్య జనవాణి.... ఎలా ఉంది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి

by Ravi |   ( Updated:2023-02-27 19:15:30.0  )
జననాడి: ఈశాన్య జనవాణి.... ఎలా ఉంది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి
X

నిరంతర నిర్లక్ష్యానికి ప్రతీకలు, నిర్విరామ వైఫల్యాలకు నిలువుటద్దాలు ఈ దేశ ఈశాన్య రాష్ట్రాలు. రాజకీయ అనిశ్చితి, పాలకుల అలక్ష్యం వెరసి... అంతటా రాజ్యమేలే అవినీతి, గట్టెక్కని అభివృద్ధి, అందని సంక్షేమం, తీరని ప్రజల కష్టాలు, కడగండ్లు ఇవీ స్థూలంగా పరిస్థితులు. రాజకీయ పార్టీలు, ఒకరు కాకుంటే మరొకరు లేదా కూటమిగానైనా అధికార పీఠమెక్కుతారు, దిగుతారు... కానీ సమస్యలు మాత్రం ఎన్నటికీ దిగిరావు! ఎన్నికలు కూడా మార్పు తీసుకురాలేనంతటి దురవస్థ! కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును ఏ మాత్రం ప్రభావితం చేయలేని లోక్‌సభ స్థానాల అరకొర నంబర్లే జాతీయ పార్టీల చిన్నచూపునకు కారణమంటారు. అందుకే, ఈశాన్యమొక నైరాశ్యభారతం! రాష్ట్రాల శాసనసభలకు సోమవారం పోలింగ్‌ ముగిసిన నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర (ముందే, ఫిబ్రవరి 16న) లలోనూ ఇదే పరిస్థితి. మౌలిక సదుపాయాలు మెరుగుపడవు, నిరుద్యోగిత ఎడతెగని నిత్యసమస్య, అక్రమ మైనింగ్‌ ఆగదు, హద్దులు దాటే అవినీతి.... ప్రజల బాగోగులు ఏ మాత్రం పట్టని పాలకులదే ఇష్టారాజ్యం! ప్రధాన స్రవంతి జాతీయ పార్టీలకు ఆసక్తి తక్కువ. పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చే ప్రాంతీయ`ఉప ప్రాంతీయ పార్టీలదే హవా! ఒకే పార్టీని ప్రజలెవరూ సాంతం నమ్మరు. పార్టీలు, వాటి పేర్లకన్నా ఇక్కడ వ్యక్తులే కీలకపాత్ర పోషిస్తారు.

పెద్ద పార్టీలతోనో, తమతో తామేనో చిన్నా చితకా పార్టీలు జట్టుకట్టాల్సిందే. అయితే ఎన్నికల ముందు, కాకుంటే ఎన్నికలు ముగిశాక చేతులు కలిపి సంకీర్ణ సర్కార్ల ఏర్పాటే వాటి కర్తవ్యం! ఒకటీ, అర రాష్ట్రాలు తప్ప ఇదీ ఈశాన్య రాష్ట్రాల్లో నేడు నెలకొన్న రాజకీయ చిత్రం. అభివృద్ధి చేసో, సంక్షేమం అమలుపరచో ప్రభుత్వాలు, పార్టీలు ప్రజాభిమానం చూరగొని ఎన్నికలు గెలిచే వాతావరణం లేని దిబ్బరాజ్యాలుగా మారాయి ఈశాన్య రాష్ట్రాలు. అధికారం, డబ్బు, కేంద్రంలో ప్రభుత్వం వంటివి ఎన్నికల్లో ఇటీవల కీలకపాత్ర వహిస్తున్నాయి. పరిస్థితులు వాటంతట అవి ప్రజానుకూలంగా మారవేమో... కనీసం ప్రభుత్వాలైనా మారుతాయా మారే ప్రభుత్వాలైనా ప్రజాజీవితాల్లో మార్పులకు వాకిళ్లు తెరుస్తాయా ఇదే, ఇప్పుడు సమాధానం రావాల్సిన కోటి రూకల ప్రశ్న.

నాన్ని ఓటర్లుగా మార్చి, సరికొత్త హామీలతో ఓట్ల గండం గట్టెక్కడం, ఆనక అన్నీ మరవటం పార్టీలకు ఈశాన్య రాష్ట్రాల్లో రివాజయింది. సమీకరణాలు, సంకీర్ణాలతో సర్కార్లు ఏర్పాటు చేయడం, అటుపై పాలకులు వోటర్లను సామాన్య జనాలుగా మరచిపోవడం మామూలే! పాతికేళ్ల మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వానికి, మూడున్నర దశాబ్దాల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి త్రిపురలో అయిదేళ్ల కింద ప్రభుత్వ ఏర్పాటుతో చరిత్ర సృష్టించిన బీజేపీ, ఇప్పుడు అదే ఊపులో లేదు. పాలకపక్షం పట్టుసడలి విడివిడిగానైనా విపక్షమే బలపడింది. పాలన నిలుపుకోవడానికి బీజేపీ తంటాలుపడుతోంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో ‘చేయి’ కలిపినా... అధికారం దక్కేంత బలపడలేదు. మేఘాలయలో బీజేపీ భాగస్వామిగా ఆరుపార్టీలతో సంకీర్ణ సర్కారు నెలకొల్పిన ‘నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ’ (ఎన్పీపీ) ఇప్పుడా నమ్మకంతో లేదు. 1972లో రాష్ట్రం ఏర్పడ్డ నుంచీ తప్పని సంకీర్ణాల శకం ఇంకా కొనసాగినా.... ఏ పార్టీకీ తగినన్ని స్థానాలు దక్కని నేటి స్థితిలో, ఏ ముక్క, ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో కూడా తెలియని అయోమయ స్థితి మేఘాలయది! రాత్రికి రాత్రి ఏకమొత్తంగా ఎమ్మెల్యేలంతా పార్టీ మారిన నాగాలాండ్‌లో ఇప్పుడున్నదంతా పాలకపక్షమే! చట్టసభలో దాదాపు విపక్షం లేని పరిస్థితుల్లో ఎన్నికలు జరిగిన ఈ తరుణంలో.... ప్రజలెవరికి పట్టం కడతారో తెలియని అస్పష్ట చిత్రం జనక్షేత్రంలో వేలాడుతోంది. దేశ రాజకీయాల్ని మలుపుతిప్పే ఎన్నికల సంకేతాలేమీ ఈ మూడు (ఈశాన్య) రాష్ట్రాల ఫలితాల నుంచి వెలువడవన్నది కఠిన వాస్తవం.

అందరూ చిన్నచూపు చూసే ఈశాన్య రాష్ట్రాల్లో దక్షిణాదికి చెందిన ‘పీపుల్స్‌ పల్స్‌’ మరోమారు సర్వే నిర్వహించింది. గతంలోనూ మేఘాలయ, త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో సర్వే జరిపింది. తాజాగా ఎన్నికలు జరిగిన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయల్లో ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్‌, రహస్య బ్యాలెట్‌ పద్ధతుల్లో తాజా సర్వే జరిపింది. అరవయ్యేసి అసెంబ్లీ స్థానాలున్న మూడు రాష్ట్రాల్లో, ఒక్కో చోట ఎంపిక చేసిన 15 నియోజకవర్గాల్లోనూ నాలుగేసి పోలింగ్‌ స్టేషన్ల పరిధి, ప్రతిచోటా 20 చొప్పున శాంపిల్‌ (మొత్తం శాంపిల్‌ 1200) సేకరించి, సమాచారాన్ని విశ్లేషించింది. ఇది కాకుండా, పీపుల్స్‌ పల్స్‌ సర్వేయర్లు అన్ని నియోజకవర్గాలూ తిరిగి, పలువురితో ముచ్చటించి ఆయా నియోజకవర్గాల్లో, తద్వారా ఆయా రాష్ట్రాల్లో నెలకొని ఉన్న ‘జనం ఆలోచనా సరళి’ (మూడ్‌ ఆఫ్‌ ది స్టేట్‌)ని కూడా తెలుసుకున్నారు. చివరి విడత పోలింగ్‌ పూర్తయి, సర్వేలపై ఎన్నికల సంఘం విధించిన కట్టడి గడువు (27 ఫిబ్రవరి) ముగిసేటప్పటికి మూడు రాష్ట్రాల్లో స్థూలంగా ఇదీ చిత్రం!

పలుచబడ్డ విభజన రేఖా- త్రిపుర

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ(సీపీఎం)లు తలపడుతున్నాయి. ఒక్కపెట్టున తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ వచ్చి ఇక్కడ హడావుడి చేస్తున్నా, సీట్ల పరంగా అది ప్రభావం చూపే అవకాశం లేదు. తమ కోటలు బద్దలుకొట్టిన బీజేపీపై ఈసారి ప్రతీకారం తీర్చుకునే పట్టుదలతో సీపీఐ(ఎం) కాంగ్రెస్‌తో ‘చేయి’ కలిపింది. కిందటి ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ హవా తగ్గినా, అత్యధిక స్థానాలు గెలిచే అవకాశముంది. 2018 అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత లోక్‌సభ (2019) ఎన్నికలు, చివర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో (2021)నూ బీజేపీ ఆధిపత్యమే కొనసాగింది. దాదాపు నాలుగేళ్లపాటు ఏకపక్ష ధోరణి, వివాదాస్పద వ్యాఖ్యలతో ‘రాజ్యం’ చేసిన బీజేపీ ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ను చివరి యేడాదిలో మార్చడం కొంతలో కొంత పార్టీకి మేలు చేసిందనే భావన ఉంది. ప్రభుత్వ, ముఖ్యంగా ఇదివరకటి ముఖ్యమంత్రి ఏకపక్ష ధోరణితోపాటు ఎన్నికల హామీల వైఫల్యాలను విపక్షాలు తమ ప్రచారంలో ఎండగట్టాయి. వారి ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా, కేరళలో ముఖాముఖి తలపడే కాంగ్రెస్‌`కమ్యూనిస్టులు ఇక్కడ జట్టు కట్టడం కేవలం అవకాశవాద రాజకీయమని, వారి కలయికను బీజేపీ జనంలో పలుచన చేసేందుకు యత్నించింది. తుది ఫలితాలెలా ఉంటాయన్నది ఉత్కంఠ.

పీపుల్స్‌ పల్స్‌ అంచనా: బీజేపీ 18 -26, సీపీఐ(ఎం) 14-22, టీఎంసీ 11-016, కాంగ్రెస్‌ 1-3, ఐపిఎఫ్‌టి 0-1, ఇతరులు 1-2.

తండ్రి పేరు ముంచిన తనయుడి తడాఖా- మేఘాలయ

భాగస్వామ్య పక్షమైన బీజేపీతో సహా ‘మేఘాలయ డెమోక్రటిక్‌ అలయెన్స్‌’ (ఎండీఎ) లోని ఇతరులూ సీబీఐ దర్యాప్తు డిమాండ్‌ చేసేంత అవినీతి, ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా (ఎన్పీపీ) ది. నిజాయితీపరుడైన లోక్‌సభ మాజీ స్పీకర్‌, దివంగత నేత పి.ఎ.సంగ్మాకు పేదలు, అట్టడుగువర్గాల్లో మంచి పేరుంది. ఆయన కుమారుడైన కన్రాడ్‌ సంగ్మా అవినీతి, నియంతృత్వ పోకడలతో అపఖ్యాతి అపారంగా మూటగట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో అదే పెద్ద ప్రచారాంశమైంది. కిందటి ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచి కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించినా బీజేపీ చొరవతో మిగతా పక్షాలన్నీ (ఎన్పీపీ, బీజేపీ, యుడిఎఫ్‌, పీడీపీ, హెచ్‌ఎస్‌పీడీపీ, స్వతంత్రులు) జట్టుకట్టి ఎన్పీపీ (19 స్థానాలు) నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

కాంగ్రెస్‌ కీలకనేత, మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా ఈ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మారారు. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి (అందులో నలుగురు మళ్లీ వెనక్కి వచ్చారు) పార్టీ మారి తృణమూల్‌ పంచన చేరారు. 60 లో 36 స్థానాలున్న ఇతర పర్వత ప్రాంతాలు ఖాసీ, జైంతియాలలో ఇతడ్ని స్థానికేతరుడిగా భావిస్తారు కనుక ప్రభావం తక్కువే! గారో హిల్స్‌లో మాత్రం పి.ఎ.సంగ్మా తర్వాత అంతటి మంచి పేరున్నది ముకుల్‌ సంగ్మాకే! చూడాలి ఆయన తృణమూల్‌ని ఏ తీరాలకు చేరుస్తారో! ప్రస్తుత ముఖ్యమంత్రి సంగ్మా మాత్రం తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కుటుంబమే బాగుపడింది తప్ప రాష్ట్రంలో ఏ సమస్యా పరిష్కారం కాలేదనే విపక్షాల ప్రచారం జనంలోకి బాగా వెళ్లింది. ప్రధాన పోటీ ఎన్పీపీకి తృణమూల్‌కి మధ్యేననే ప్రచారం ఉంది. ఫలితాల తర్వాత ఎవరెవరు ఎవరి వెనుక జట్టుకడతారనేది రాబోయే సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్ణయించవచ్చు.

పీపుల్స్‌పల్స్‌ అంచనా: నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్పీపీ) 17-26, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) 10-14, యుడిపి 8-12, బీజేపీ 3-8, కాంగ్రెస్‌ 3-5, ఇతరులు 4-9.

‘నాగా’ సాగతీత ఇంకెంత కాలం- నాగాలాండ్

పాతికేళ్లుగా సాగుతున్న శాంతిచర్చల ప్రక్రియ కొలిక్కి వచ్చి ‘నాగా’ రాజకీయాంశానికి పరిష్కారం ఎప్పటికి లభించేనో ఆసారి కూడా ఆ అంశంతో పాటు అవినీతి, ప్రభుత్వ నిష్క్రియాపరత్వం ప్రచారాంశాలయ్యాయి. పార్టీలు ముక్కలవడం, రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలు శిబిరాలు మార్చడం మామూలు విషయమైన నాగాలాండ్‌లో ఆఖరు నిమిషంలో ఎవరి ప్రయోజనాలను ఎవరు దెబ్బతీస్తారో తెలియని పరిస్థితి! కిందటిసారి ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచి ‘నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌’ (ఎన్పీఎఫ్‌) అతిపెద్ద పార్టీగా అవతరించి కూడా విపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. నేషనల్‌ డెమాక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అదే క్రమంలో ఇప్పుడు ఎన్డీపీపీ 40 చోట్ల, బీజేపీ 19 చోట్ల పోటీ చేశాయి. గెలిచిన 26లో 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో చివరకు మొత్తం ఎన్పీఎఫ్‌ పార్టీయే ప్రభుత్వంలో భాగమైంది. విపక్షమే లేని సభ నడుస్తూ వచ్చింది. చట్టసభలోనే కాక ప్రజాక్షేత్రంలోనో బలహీన ప్రతిపక్షం కళ్లకు కడుతోంది. ఫలితంగా, ఎన్పీఎఫ్‌ 20కి మించి స్థానాల్లో పోటీ చేయలేకపోయింది. కాంగ్రెస్‌ కూడా పాతికలోపు స్థానాలకే పరిమితమైంది.

పాలక కూటమి ఎన్డీపీపీ-బీజేపీ, బలహీన విపక్షాన్ని ఎదుర్కోవడం ద్వారా లబ్దిపొందనుంది. ఆశ్చర్యంగా వారికి ప్రతికూలించే ఒక అంశం, దివంగత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ స్థాపించిన లోక్‌జనశక్తి (ఎల్జీపీ) పార్టీ! బీజేపీలో టిక్కెట్లు రానివారు, ఎన్పీఎఫ్‌ నుంచి పార్టీ మారిన కొందరు ఎల్జీపీలో చేరి, బీజేపీ పరోక్ష మద్దతుతో ఎన్డీపీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వారిలో అత్యధికులు డబ్బున్నవారు కావడంతో ఎల్జేపీ కీలక భూమిక నిర్వహించే సూచనలున్నాయి. అయినా... పాలక కూటమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ‘గ్రేటర్‌ నాగాలాండ్‌’ ఒక పెద్ద డిమాండ్‌గా తెరపైకి వస్తోంది. 88 శాతం క్రిష్టియన్లున్న రాష్ట్రం కావడంతో, ఇదే మతాంశాన్ని విపక్షాలు ప్రచారాస్త్రం చేసుకొని బీజేపీని ఎండగట్టడానికి చూశాయి. కేంద్ర ప్రభుత్వాన్ని చూపిస్తూ బీజేపీ, ఇక్కడ ప్రధానంగా ‘మోదీ’ మంత్రాన్ని జపిస్తోంది.

పీపుల్స్‌ పల్స్‌ అంచనా: ఎన్డీపీపీ 20-27, బీజేపీ 14-21, ఎల్‌జేపీ 5-10, ఎన్పీఎఫ్‌ 3-8, కాంగ్రెస్‌ 2-4, ఇతరులు 2-4.

-ఆర్‌.దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

[email protected],

9949099802

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed