- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధ్యాయులకు పరీ(శి)క్షా కాలం!
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు. పాఠ్యాంశాలు బోధించిన ఉపాధ్యాయులతో పాటు పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేషన్ విధుల్లో పాలు పంచుకొంటున్న ఉపాధ్యాయులకు కూడా! రెండు రాష్ట్రాల్లో కొన్ని లక్షల విద్యార్థులు ఈ పరీక్షల ద్వారా తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. అయితే ఈ పరీక్షల నిర్వహణ ప్రభుత్వాలకు సైతం కత్తి మీద సాము లాంటిదే. ఈ నేపథ్యంలో గత అనుభవాలను సమకాలీన విధానాలను, ప్రభుత్వ వైఖరిని, తప్పులు చూపించి ప్రభుత్వాన్ని దునుమాడాలని కాచుక్కూర్చున్న రాజకీయ పార్టీలను ఉపాధ్యాయులు నిశితంగా గమనించి ఎవరి ఎరకు చిక్కకుండా నిష్కర్షగా, చిక్కుల్లో పడకుండా నడుచుకోవాలి.
ఈ పరీక్షలను రాజకీయం చేసే కుట్రలో..
ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, పరీక్షలు నిర్వహించేది ఉపాధ్యాయులే. పరీక్షల నిర్వహణపై వారికి దిశానిర్దేశం చేస్తున్నది ప్రభుత్వ అధికారులు. ఇదే గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ప్రక్రియ. నిజానికి ఈ పరీక్షలకు జీవితమంటే ఏంటో తెలియని ఊహా ప్రపంచంలో ఉన్న పిల్లలు హాజరవుతున్నారు. ఈ లక్షలాది విద్యార్థుల్లో చాలా మందికి ఈ పరీక్షలు భవిష్యత్తుకు సంబంధించినవనే విషయం కూడా తెలియదు. అందుకే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పరంపరలో ఇన్విజిలేషన్ విధుల్లో నియుక్తులైన ఉపాధ్యాయులు మార్గదర్శకంగా, ఆదర్శవంతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలి. అది మన బాధ్యత కూడా. అయితే ఈ పరీక్షల సందర్భంగా గత కొన్నేళ్లుగా చెదురుముదురు ఘటనలు తప్పా ఎవరికీ ఆయాచిత లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
కొందరు ఎక్కడైతే ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవాలో వారు ఆ క్షేత్రాన్ని వదిలి భారీ స్థాయిలో జరిగే ఈ పరీక్షలను ఒక ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఏపీలో గత ఏడాది అలా జరిగినందునే ప్రభుత్వం తదుపరి పరీక్షల సందర్భంగా ఒత్తిడి తీవ్రతరం చేసింది. ఫలితాలు తారుమారయ్యాయి. ఎందరి జీవితాలో తలకిందులయ్యాయి. అనేక జిల్లాల్లో ఉత్తీర్ణత శాతం కనిష్ఠానికి పడిపోయింది. దరిమిలా ఇప్పుడు ఇన్విజిలేషన్ విధుల్లో నియమితులైన ఉపాధ్యాయులపై రెట్టింపు దృష్టి పెట్టింది. ఒత్తిడి పెంచింది. నిబంధనలు కట్టుదిట్టం చేసింది. అయితే కారణం ఏదైనా ఏ ప్రాంతంలోనైనా ఈ పరీక్షల నిర్వహణ సమయంలో అంతిమంగా ఉపాధ్యాయులనే బలిపశువులను చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇటీవల పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వెనుక కొందరు ఉపాధ్యాయులు స్వయంగా పాల్గొన్నట్టు రూఢీ అయింది. ఫలితంగా ఎంతో గౌరవంతో ఉన్న ఈ వృత్తి అందరికీ పూచిక పుల్లతో సమానమైంది. రోజురోజుకు ఈ లీకేజీ ఉపాధ్యాయుల జాబితా పెరుగుతుంది. ఉపాధ్యాయులని అరెస్ట్ చేయడం రిమాండ్‌లో ఉంచడం లాంటి ఆదేశాలు జారీ అయ్యాయి.
అన్యాపదేశ కష్టాలు తెచ్చుకోకుండా..
అయితే ఇలాంటి ఘటనలు సమాజం దృష్టిలో మన ప్రతిష్టను దిగజార్చదా? తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎవరి బుట్టలోనో పడి పదిమందిలో పలచన కామా? అయితే ఈ లీకేజీలో ఒకరిద్దరు చేసే పొరపాట్లు ఇంచుమించు లక్షల ఉపాధ్యాయుల ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తుంది. అందుకే ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అవసరాలకు మించి ఏ వ్యక్తితోనూ దగ్గరగా వ్యవహరించొద్దు.ముఖ్యంగా మీడియా మిత్రులతో. అంతర్లీనంగా ఒకరికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంలో సామాజిక కోణం విస్మరించి పాత్రికేయులు చిలవలు పలవలుగా అల్లుతున్న కథలు మనకు హాని కలిగించే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి కావలసింది ఏంటి? పరీక్షలను శల్య పరీక్ష చేసి తాము సమర్ధవంతంగా నిర్వహించామనే ఖ్యాతిని మూటగట్టుకోవడం. మరో కోణంలో ప్రతిపక్ష పార్టీలు పరీక్షల నిర్వహణ అంశాన్ని వివాదాస్పదం చేసి తమను వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదనేది వారి లక్ష్యం. కనీసం పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తూర్పారబట్టే ప్రయత్నం మరి కొందరిది.
ఈ రెండు వర్గాలకు వారికి ఉత్తీర్ణతా శాతం తగ్గినా, పెరిగినా వచ్చే నష్టమేమీ లేదు. ప్రభుత్వం ఈ విమర్శల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఉపాధ్యాయులను, హాలులో ఉన్న ఇన్విజిలేటర్‌ను అన్ని విధాలా ఒత్తిడి చేస్తుంది. మరోవైపు ఇలాంటి లీక్‌ల వల్ల పరీక్ష రాసే విద్యార్థి మానసిక స్థితి సైతం దెబ్బతీస్తుంది. ఇది కార్పొరేట్ స్కూళ్లలో చదివిన వారికి పెద్దగా నష్టం కలిగించకపోవచ్చు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ నేపథ్యం గల పిల్లలకు ఈ వాతావరణం కీడు కలిగిస్తుంది. నిజానికి పరీక్షా కేంద్రం నుంచే ప్రశ్నపత్రాలు సెల్‌ఫోన్‌లో ఫోటోలుగా బహిర్గతం కావడాన్ని పోలీసులు గుర్తించారు. నిజానికి మనం నిజాయితీగా వ్యవహరిస్తే మనకు గౌరవం పెరగదా..? మన నిజాయితీని నిరూపించుకోవడానికి అవసరమైతే సెల్‌ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళండి. ఇన్విజిలేటర్‌ను చూసి డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ మెచ్చుకొనేంత హుందాతనం అవసరం. అలా అని పరీక్షలు రాసే విద్యార్థులలో భయోత్పాతం సృష్టించడమో, వారి ఏకాగ్రతను దెబ్బతీయడం కాదు. పరీక్షలు ఎప్పుడు జరిగినా, నిర్వహించేది మనమే. అలా అని చూసీచూడనట్లు ఉదాసీనంగా ఉండిపోవడం అంతకంటే కాదు. మనం ఒక స్కేల్‌లో కొలతలాగా ప్రమాణాలు పాటించడం అవసరం. అన్యాపదేశంగా ఉండి కష్టాలు కొని తెచ్చుకోకుండా ఉద్యోగ భద్రత, విద్యార్థుల జీవితాలు రెండు కళ్లుగా సున్నితమైన శైలితో వ్యవహరించాల్సి ఉంది.
- మోహన్ దాస్
రాష్ట్ర కౌన్సిలర్, ఏపీటీఎఫ్ 1938
94908 09909