కోటీశ్వరుల కొట్లాట

by Viswanth |   ( Updated:2022-03-17 10:26:20.0  )
కోటీశ్వరుల కొట్లాట
X

కోట్ల రూపాయలున్న సంపన్నులు మాత్రమే ఎన్నికలలో పోటీ చేసి గెలవగలుగుతున్నారు. నిజాయితీ కలిగిన సామాన్యులకు అలాంటి అవకాశాలు లేవు. లెక్కలలోకి రాని డబ్బును, అక్రమ ఆర్జనను ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. తాయిలాలతో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలలో 88 శాతం మంది కోటీశ్వరులే " అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గతేడాది జనవరి తొమ్మిదిన తన ఆవేదనను వెలిబుచ్చారు. నిన్నమొన్న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కోట్ల రూపాయలు కుమ్మరించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సైతం అదే స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే నోట్ల పంపిణీ మొదలైంది. గెలుపు కోసం ఎన్ని కోట్ల రూపాయలనైనా ఖర్చు చేయడానికైనా సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే గ్రామాలలో నోట్ల కట్టలు డంప్ అయ్యాయి. ఇది తెలంగాణ చరిత్రలోనే ఖరీదైన ఎన్నికగా మారనుంది. ఈ మధ్యన మనం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, తమిళనాడులోని ఆర్‌కే నగర్ ఎన్నికలలో నోట్లు ఏ స్థాయిలో పంపిణీ అయ్యాయో చూశాం. ఇప్పుడు హుజూరాబాద్‌లో అదే సీన్ రిపీట్ కాబోతున్నది. తాజాగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్ కోటీశ్వరుడే. 2018 అసెంబ్లీ ఎన్నికలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు పన్నెండు కోట్ల పై మాటే. ఇదంతా లెక్కలలో చూపించేదే. ఇక లెక్కలోకి రాని డబ్బు ఊహకు అందనంతగా ఉంటుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్‌రెడ్డి సైతం కోటీశ్వరుడే. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఇంకెంత కోటీశ్వరుడో అనేది చర్చనీయాంశంగా మారింది. కోటీశ్వరుల కొట్లాటలో నోట్ల కట్టలే నిర్ణయాత్మకం కానున్నాయి. అందినకాడికి పుచ్చుకోడానికి ఓటర్లూ ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు.

నిబంధనలు షరా మామూలే

ఎన్నికలలో అభ్యర్థులు గరిష్ఠంగా ఎంత ఖర్చు పెట్టాలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలనే రూపొందించింది. అవన్నీ కాగితాలకే పరిమితం. ఒక్కో అభ్యర్థి లెక్కలోకి రాని తీరులో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సాక్ష్యాలు, ఆధారాలు లేని ఈ వ్యవహారం బహిరంగ రహస్యం. నెలల తరబడి జరిగే ప్రచారంలో ఖర్చయ్యేది ఒక ఎత్తయితే పోలింగ్‌కు 24 గంటల ముందు నుంచి చీకటిలో చేతులు మారే నోట్ల పంపిణీ మరొక ఎత్తు. ఎంత మంది పరిశీలకులు ఉన్నా, నిఘా బృందాలు ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా నిరాటంకంగా జరిగిపోతూనే ఉంటుంది. ఎన్నికల సంఘం కూడా నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉంటున్నది. కళ్లుండీ చూడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నది. తెలంగాణ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికలలో 107 మంది అభ్యర్థులు (మొత్తం 119 స్థానాల్లోని 90% మంది) కోటీశ్వరులే. కాంగ్రెస్ (79 మంది), బీజేపీ (86 మంది) సైతం మినహాయింపేమీ కాదు. ధన ప్రవాహం కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. కొద్దో గొప్పో తేడాలు తప్ప అన్ని రాష్ట్రాలలోనూ ఇదే కనిపిస్తుంది. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లలోని ఆస్తులే ఇలా ఉంటే ఇక లెక్కలోకి రాని డబ్బు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యానికి మనం 'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే.. ' అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆచరణలో ఇది 'ధనస్వామ్యం'గా మారిపోయింది.

పేరుకే ఎన్నికల సంఘం

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి చాలా కష్టపడుతున్నట్లు ఎన్నికల సంఘం చెప్పుకుంటూ ఉంటుంది. అభ్యర్థులు చేసే ఖర్చును లెక్కించడానికి ఆడిటర్లను పెడుతుంది. ఎన్నికల వ్యయ పరిశీలకులను పెడుతుంది. నోట్ల పంపిణీని అరికట్టడానికి నిఘా బృందాలను నియమించినట్లు చెబుతుంది. ఇవన్నీ నిష్ఫలమేనని ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చూసినా అర్థమవుతుంది. "ముప్పై ఏళ్ల కిందట నేను ముప్పై వేల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి గెలిచా.. ఇప్పుడు ముప్పై కోట్లు ఖర్చు పెట్టాను" అని చాలా మంది నేతలు ఆధారాలకు దొరకకుండా మాట్లాడుతుంటారు. మహారాష్ట్ర ఎన్నికలలో గెలవడానికి ఎంత ఖర్చు పెట్టిందీ ఒక సందర్భంలో గోపీనాధ్ ముండే బహిరంగంగా వ్యాఖ్యానించి లీగల్ చిక్కులలో పడ్డారు. ఎన్నికల సంఘం నోటీసులు, ఆదాయపు పన్ను శాఖ సమన్ల లాంటివన్నీ ఎదుర్కొని చివరకు బైటపడ్డారు. ఏ ఎంపీని, ఎమ్మెల్యేను కదిలించినా ఇవే చెప్తారు. ఖర్చుపైన సీలింగ్ లాంటివన్నీ తూతూ మంత్రమే. ఎన్నికలు ఎప్పుడు జరిగినా లక్షలు, కోట్ల రూపాయలలో నోట్ల కట్టలు కార్లలో బైటపడుతూ ఉంటాయి. ఆ డబ్బు ఎవరిదో జగమెరిగిందే. ఎప్పటికీ వారి పేర్లు మాత్రం బైటకు రావు. వాటిని తరలించేవారిపైన కేసులూ ఉండవు. చేరాల్సినవారికి చేరుతూనే ఉంటాయి. ఇప్పుడు హుజూరాబాద్‌లో జరగబోతున్నదీ అదే. ఇక్కడ గెలుపు ఇద్దరు వ్యక్తులు, రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం కావడంతో నోట్ల కట్టలు ఏ స్థాయిలో చేతులు మారుతాయో ఊహకు అందనిదేమీ కాదు. ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఇంకా స్పష్టం కాలేదుగానీ.. ఇప్పటికే నోట్ల పంపిణీ మొదలైంది. 'మాకు మద్దతు పలకండి... మీకేమున్నా మేం చూసుకుంటాం.. టోకెన్‌గా ఇది పెట్టుకోండి ' అంటూ పచ్చనోట్ల పందేరం మొదలైంది. ఇప్పడే ఏముంది? ఇకపైన మీటింగులు, బహిరంగ సభలు, వాటితోపాటు మందు బాటిళ్లు, బిర్యానీ పొట్లాలు, గిఫ్టులు, నజారానాలు చాలా ఉన్నాయి.

కోట్ల ఖర్చు... లెక్కలలో లక్షలు

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అభ్యర్థులు మాత్రం లక్షలలోనే లెక్కలు చూపుతుంటారు. ఈ నేతలకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఎవ్వరికీ పట్టదు. ఓటు కోసం ఎందుకు పంచిపెడుతున్నారనేదాని గురించీ ఎవరూ ఆలోచించరు. నోటు ఇస్తేనే ఓటు వేస్తాం అనే మైండ్ సెట్ ఓటర్లలో కామన్ అయిపోయింది. నోటు ఇవ్వకపోతే ఓటు వేయం అనేది ఒక సంప్రదాయంగా మారిపోయింది. నోటు ఇవ్వలేదని రోడ్డెక్కి ధర్నా చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఓటు కోసం నోటు ఇవ్వడం, తీసుకోవడం ఒక షరతులాగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో వెంకయ్యనాయుడులాంటివారు ఆవేదన వ్యక్తం చేయడంలో ఆశ్చర్యమూ లేదు. కడియం శ్రీహరిలాంటి వారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ని కలిసి ఎన్నికల నియమావళిలో మార్పులు రావాలంటూ మొరపెట్టుకోవడంలోనూ కొత్తదనమూ లేదు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిందంటూ మేధావులు గగ్గోలు పెట్టడం మినహా చేయగలిగిందేమీ లేదు. చట్టంలో మార్పులు రావాలంటే వాటిని చేయాల్సిందిగా ఇప్పుడు నోటు ఇచ్చి ఓటు కొనుక్కుని చట్టసభల్లో కూర్చున్న ఈ కోటీశ్వరులే. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలేగానీ, నిన్న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికేగానీ, ఇకపైన జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికేగానీ, ప్రతీ ఎన్నికకీ నోట్ల పంపిణీ పెరుగుతుందనడంలో ఆశ్చర్యమేమీ లేదు. నోటు ఇచ్చేవారికీ, తీసుకునేవారికీ నీతి, నిజాయితీ, చితశుద్ధి, బుద్ధి లేనంతకాలం దీన్ని 'ప్రజాస్వామ్యం' అని గొప్పగా చెప్పుకుందాం. 'ధనస్వామ్యం'గా మారిందనే ఆవేదన పడుతూనే ఉందాం.

ఎన్. విశ్వనాథ్

Advertisement

Next Story

Most Viewed