- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడవిని సృష్టించిన పశువుల కాపరి
దిశ, ఫీచర్స్: భూమ్మీదకు టెనెట్స్‌లా వచ్చిన మనం హక్కుదారుల్లా ఫీలై, ప్రకృతికి అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నాం. నేలతల్లిని నాశనం చేస్తున్నాం. మన చర్యలతో కాలుష్యం పెరిగిపోగా అడవులు కనుమరుగయ్యాయి. వేలాది జీవజాతులు ఆవాసం కోల్పోయి, ఆహారం లేక అంతరించిపోయాయి. భూగర్భజలాలు ఇంకిపోయాయి. ఇంతలా విఘాతం కలిగిస్తున్నా, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టడానికి వెనకడుగు వేస్తాం. చెట్లను నరికేస్తూ.. మొక్కలను పెంచడానికి బద్దకిస్తాం. కానీ ఓ వ్యక్తి అడవిని సృష్టించి, అపారమైన వృక్షసంపదతో కొన్ని గ్రామాలకు కరువు రాకుండా చేశాడు. మొక్కలను నాటుతున్న ఆ వ్యక్తిని చూసి జనమంతా ఎగతాళి చేసినా, పిచ్చోడని భావించినా అవేమి పట్టించుకోకుండా, అకుంఠిత దీక్షతో తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగాడు. రెండు దశాబ్దాల అతడి కృషితో శిశిరంలా మారిన అడవంతా, పచ్చకోక కట్టుకున్నా వసంతంలా మారి ప్రస్తుతం వేలాది చెట్ల పచ్చని నవ్వులతో కళకళలాడుతున్నది. కరువుతో అల్లాడిపోయిన ఆ ప్రాంతం సాదిమాన్ వల్ల నేచురల్ టూరిజం స్పాట్‌గా మారింది. తోటి మానవులకే కాదు, జంతువులకు ఆవాసాన్ని, ప్రకృతికి జీవత్వాన్ని తీసుకొచ్చిన ఆ వ్యక్తే సాదిమాన్. ఇండోనేషియాకు చెందిన ఈ ఫారెస్ట్ మ్యాన్ జర్నీపై స్పెషల్ స్టోరీ.
1960లో ఇండోనేషియాలోని లావు పర్వత దక్షిణ వాలులోని అటవీ ప్రాంతంలో అగ్నికీలలు అడవంతా అంటుకున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని సెంట్రల్ జావా ప్రావిన్స్, వొనోగిరి రీజెన్సీలోని వందలాది హెక్టార్ల పైన్ అటవీ ప్రాంతమంతా మంటల్లో ఆహుతి అయ్యింది. ఆ తర్వాత మూడు వేలకు పైగా ప్రజలు నివసించే, ఆ ప్రాంతంలోని అనేక గ్రామాలు తీవ్రమైన కరువును ఎదుర్కొన్నాయి. గ్రామ ప్రజలతో పాటు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఏ విధమైన చర్యలు చేపట్టలేవు. కానీ సాదిమాన్ మాత్రమే అక్కడి పరిస్థితి మార్చడానికి ముందడుగు వేశాడు. వందల సంఖ్యలో మొక్కలు నాటుతూ, రెండు దశాబ్దాలుగా కృషి చేసి, పెద్ద అరణ్యాన్ని సృష్టించాడు. పశువుల కాపరిగా జీవనాన్ని సాగించే సాదిమాన్, వందలాది హెక్టార్లలో ఒక్కడే అడవిని సృష్టించాడంటే నమ్మశక్యం కాదు. కానీ ఇలానే ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో అనేకమంది అద్భుతాలు చేసి చూపించారు. సాదిమాన్ కూడా అందులో ఒకరు కాగా దశాబ్ద కాలంలోనే అతడు స్థానికంగా రియల్ హీరో అయ్యాడు.
రెండు దశాబ్దాల కాలంలో, సాదిమాన్ 11 వేలకు పైగా చెట్లను నాటాడు. వోనోగిరి రీజెన్సీలోని రైతులు ఒకప్పుడు కరువు కారణంగా ఏడాదికి ఒకే పంటకు పరిమితం కాగా, ఇప్పుడు రెండు నుంచి మూడు పంటలు వేస్తున్నారు. వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో అక్కడి రైతుల జీవితాలు మారిపోయాయి. ఇక సాదిమాన్ కృషికి గుర్తింపుగా ఆ అడవిని ‘హుటాన్ సాదిమాన్’ లేదా ‘సాదిమాన్ అడవి’ అని పిలుస్తుండగా, ఇండోనేషియాలో ప్రకృతి పర్యాటకానికి అత్యంత ప్రాచుర్యం పొందిన గమ్యస్థానాలలో ఒకటిగా మారింది. సాదిమాన్ చేసిన పని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవగా, అతడి ప్రేరణతో సామూహిక చెట్ల పెంపకాన్ని చేపట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కాంటో గ్రామానికి చెందిన యువతరం లేదా మిలీనియల్స్ ‘సింటాకాంటో’ లేదా ‘లవ్ కాంటో’ అనే కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేపట్టారు. 2015 నవంబర్‌లో ఇండోనేషియా నుంచి వందలాది మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు.
బిహార్‌లోని ఇమాలియా చాక్ గ్రామంలోని బంజర భూమిని 10 వేల చెట్ల పండ్ల తోటగా మార్చిన సత్యేంద్ర గౌతమ్ మంజి, పులుల కోసం రాజస్థాన్‌లోని రణ్‌థంబోర్ బంజరు భూమిని..అభయారణ్యంగా మార్చిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్, పరిరక్షణాధికారి ఆదిత్య సింగ్, రెండు కాళ్లు లేకపోయినా(డబుల్ ఆంప్యూటీ) 17 వేల చెట్లు నాటిన చైనాకు చెందిన పర్యావరణ ప్రేమికురాలు మా సాన్క్సియావో వంటి ఎంతోమంది ఆదర్శ వ్యక్తుల సరసన సాదిమాన్ తప్పక ఉంటాడు. ఆ పర్యావరణ యోధుల కథతో సమానంగా సాదిమాన్ కథ ఉంటుంది. అతడి జీవిత ప్రయాణంలో కిక్ ఆండీ హీరోస్ (2016) వంటి ప్రతిష్ఠాత్మక అవార్డుతో పాటు పర్యావరణాన్ని పరిరక్షణకు సాదిమాన్ చేసిన కృషికి గానూ ఇండోనేషియా ప్రభుత్వం నుంచి ‘కల్పతారు’ పురస్కారం అందుకున్నాడు. తాను ఆరోగ్యంగా ఉన్నంతవరకు మొక్కలను నాటడాన్ని కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు సాదిమాన్.