ఈసీబీ హండ్రెడ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అవకాశం?

by Shiva |
ఈసీబీ హండ్రెడ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అవకాశం?
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) కొత్తగా ‘హండ్రెడ్’ అనే ఫార్మాట్ రూపొందించింది. గత ఏడాదే ఈ ఫార్మాట్‌లో ది హండ్రెడ్ లీగ్ ప్రారంభించాల్సి ఉన్నది. కానీ కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా వేశారు. కాగా, ఈ లీగ్‌లో భారత క్రీడాకారులు ఆడటం లేదు. టీమ్ ఇండియా ప్లేయర్లను ఇతర లీగ్స్‌లో ఆడించడానికి బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. అయితే టీమ్ ఇండియా క్రీడాకారులను తమ లీగ్‌లో ఆడించడానికి ఈసీబీ ఒక ప్రతిపాదను బీసీసీఐ ముందు ఉంచింది.

ది హండ్రెడ్ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా 25 శాతం వాటా ఇచ్చేందకు సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. టీమ్ ఇండియా ఆటగాళ్లను కనుక ఆడిస్తే.. ఆసియా బ్రాడ్‌కాస్ట్ ద్వారా లభించే ఆదాయంలో వాటా కూడా ఇస్తామని ప్రతిపాదించింది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టు సందర్భంగా ఈసీబీ, బీసీసీఐ అధికారులు దీనిపై చర్చించినట్లు తెలుస్తున్నది. కాగా, దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.

ఇప్పటికే టీమ్ ఇండియా క్రికెటర్లు విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా క్రికెట్ ఆడుతున్నారు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్ 14వ సీజన్ ఆడాల్సి ఉన్నది. ఆ తర్వాత వరల్ట్ టెస్ట్ చాంపియన్స్‌షిఫ్ ఫైనల్స్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలి. ఇంత బిజీ షెడ్యూల్‌లో టీమ్ ఇండియా క్రికెటర్లను అనుమతించే అవకాశం లేనట్లు తెలుస్తున్నది. అయితే ఈ ఏడాది ది హండ్రెడ్ ఫార్మాట్‌ను పరిశీలించిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story