మమతా బెనర్జీ ఆ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి: ఈసీ

by Shamantha N |
Mamata Banerjee
X

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ (ఈసీ) నుంచి నోటీసులు పర్వం కొనసాగుతున్నది. మతం ఆధారంగా ఓట్లను చీల్చుతున్నారన్న ఆరోపణలతో ఒకసారి.. నందిగ్రామ్ పోలింగ్ బూత్‌లో సృష్టించిన హంగామాపై ఇప్పటికే దీదీకి పలుమార్లు ఈసీ నోటీసులు అందజేసింది. తాజాగా.. కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీఎఫ్ బలగాలను ఉద్దేశిస్తూ.. ‘వాళ్లు మిమ్మల్ని (ప్రజలు) ఓటు వేయనీయకుంటే వారిని ఘెరావ్ చేయండి..’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

అయితే ఈసీ నోటీసులపై మమతా బెనర్జీ స్పందించారు. ఈసీ ఎన్ని నోటీసులిచ్చినా తాను మాత్రం లెక్కచేయబోనని తేల్చి చెప్పారు. కేంద్ర బలగాలు బీజేపీకి పని చేయడం ఆపినప్పుడే వారికి తాను జై కొడతానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని మోడీ బెంగాల్‌లో విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చ’ ఆన్లైన్ కార్యక్రమం నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి రాదా..? అని ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. నందిగ్రామ్ లో మమతపై దాడి ఘటనపై నమోదైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని పిల్ దాఖలు చేయగా.. సుప్రీం దానిని తిరస్కరిస్తూ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed