నాకు సపోర్ట్ చేస్తే.. ఉద్యోగం నుంచి తొలగిస్తారా : ఈటల సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-10-02 03:21:45.0  )
నాకు సపోర్ట్ చేస్తే.. ఉద్యోగం నుంచి తొలగిస్తారా : ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వీణవంక : ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండలంలోని కోర్కళ్, నర్సింహులపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఐదు నెలలుగా టీఆర్ఎస్ నేతలు.. హుజురాబాద్ ప్రజలను గోస పుచ్చుకున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, నాయకులు ఊర్లకు ఊర్లే బార్లుగా మార్చి, దావతులకు అడ్డాలుగా మార్చారు. ఈటల రాజేందర్‌కి ఎవరు దగ్గర, ఎవరు సన్నిహితంగా ఉన్నారని ఆరా తీశారు.

నాకు అనుకూలంగా ఉన్న వారిని భయపెట్టి మరీ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు.. నాకు సపోర్టు చేస్తున్న వారిని భయపెడుతున్నారని అన్నారు. అలా ఇబ్బంది పెడితే భయపడి కాళ్ల మీద పడతారని వారు అనుకున్నారో ఏమో కానీ.. వారు అలా భయపడే వారు కాదని తెలిపారు.

అన్నీ మండలాలు ఒక ఎత్తు.. వీణవంక మండలం ఒక ఎత్తు. వీణవంక వారు మర్యాదకు లొంగుతారు తప్ప బెదిరిస్తే మాత్రం కర్రలు పట్టుకొని ఎదురు తిరిగే వాళ్ళు అంటూ కామెంట్స్ చేశారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాల భర్తలు ఈటల రాజేందర్ వెంబడి తిరిగితే మీ ఉద్యోగం తీసేస్తానని బెదిరిస్తున్నారని అన్నారు.

ఈటల రాజేందర్ రాజీనామా వల్లనే.. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని అన్నారు. కరీంనగర్ వచ్చి దళిత ప్రజలతో భోజనం చేసి, నా చివరి రక్తపు బొట్టు వరకు మీ కోసమే పని చేస్తా అని చెప్పారు. జై భీమ్, జై అంబేద్కర్ అన్నారు. ప్రజలే నా దేవుళ్లు అన్నాడు. ఇది నేను సాధించిన విజయం.. అంటూ ఈటల చెప్పుకొచ్చారు.

2023లో మీ పార్టీ తెలంగాణ గడ్డ మీద అడ్రస్ లేకుండా పోతుంది. ఈటల రాజేందర్ అనేవాడు కొట్లాడే బిడ్డ.. నీకు దమ్ము ధైర్యం ఉంటే డబ్బులు, అధికారులు, నాయకులను పక్కన పెట్టి కొట్లాడు.. మీరు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నేను గెలిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని సవాలు విసిరినా పత్తా లేరని ఆరోపించారు.

తెలంగాణ అంతా హుజురాబాద్ వైపు చూస్తోంది. హుజురాబాద్‌లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. అదే ధర్మ యుద్ధం. ఈ యుద్ధంలో ధర్మం గెలవాలంటే హుజురాబాద్‌లో ఈటల గెలవాలి అని తెలంగాణలో అందరూ అనుకుంటున్నారు. కేసీఆర్ గెలిస్తే ఆయన అహంకారం, డబ్బులు కేసీఆర్ నమ్ముకున్న పద్ధతి గెలుస్తుంది అని ముద్రపడినట్టే అవుతుందని అన్నారు. అందుకే టీఆర్ఎస్‌ను ఓడించాలని పేర్కొన్నారు. ఈ 18 సంవత్సరాలుగా ఏ ఒక్క సారి కూడా ఇంత గట్టిగా ఓటు వేయమని మిమ్మల్ని అడగలేదు. ఈ సారి అడుగుతున్నా.. ఆదమరచి ఉండకండి అప్రమత్తంగా ఉండండి. 30వ తేదీ నాడు మీకు ఎవరు పోలింగ్ చిట్టీ ఇచ్చినా, ఇవ్వకపోయినా పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story