కొత్త పార్టీపై ఈటల క్లారిటీ

by Anukaran |   ( Updated:2021-05-12 07:08:20.0  )
Eatala Rajendar
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘‘ప్రజల మేలును కోరి.. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని.. ఒకవేళ అధికారంలో ఉన్న ప్రతిపక్షాల సహకారంతో ఒక ప్రజాస్వామిక వాతావరణంలో పీపుల్స్​ ఓరియెంటేడ్​పాలిటిక్స్​.. ప్రజల అవసరాలు తీర్చే పార్టీ ఉండాలని కోరుకుంటున్న. రాజకీయాల్లో తప్పకుండా మార్పులు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా సమాజం స్టాటిక్‌గా ఉండదు. సమాజం మార్పు కోరుతూనే ఉంటోంది. ప్రజల అవసరాలకనుగుణంగా సందర్భాలు వచ్చినప్పుడు ఆపినా ఆగవు.. సమయం వచ్చినప్పుడు తన్నుకుని బయటకు వస్తాయి.” అని మాజీ మంత్రి ఈటల రాజేందర్​ కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చారు. తన సారధ్యంలో రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు తథ్యమనే సంకేతాలిచ్చారు. ఇటీవల ఓ యూట్యూబ్​చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త పార్టీపై స్పష్టత ఇచ్చినట్లైంది.

అందుకేనా భేటీలు!

రాష్ట్రంలోని పలు పార్టీల నేతలతో ఈటల భేటీ వేగవంతమయ్యాయి. ఇప్పటికే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్‌రెడ్డి, రాములునాయక్‌తో పాటు కొంతమంది నేతలు ఈటలతో చర్చించారు. తాజాగా మంగళవారం సీఎల్పీ నేత భట్టిని కలిశారు. బుధవారం ఉదయం సీనియర్​ నేత, టీఆర్ఎస్​ వ్యతిరేక నేతగా మారిన డి.శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. అక్కడే ఎంపీ అరవింద్‌తో కూడా చర్చించారు. ప్రస్తుతం కొత్త పార్టీ ఊహాగానాల నేపథ్యంలో ఈటల వరుస భేటీలు కూడా ఆసక్తికరంగా మారాయి.

ఏదైనా సాధ్యమే..

ప్రస్తుత ప్రభుత్వం, పార్టీలపై ఈటల రాజేందర్​చెప్పకనే చెప్పుకొచ్చారు. పేదలకు చేసేదేమీ లేదన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారంటూ మనోగతాన్ని వెల్లడించారు. అంతేకాకుండా జాతీయ పార్టీలు కూడా ప్రజలకు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయని, దేశంలో ఎలాంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పరితపించిన దేశ ప్రజలకు సెంట్రలైజ్​ పాలిటిక్స్​ మంచివి కాదని, ప్రజలకు అవసరమైన ప్రాంతీయ పార్టీల అవసరం ఉందంటూ ఈటల అభిప్రాయపడ్డారు.

“సామాన్యుడి సాహసం చాలా గొప్పది. ఈటల రాజేందర్ ఉత్త మనిషి కాదు. ఈటల రాజేందర్‌కు ఏదైనా సాధ్యమే. 20 ఏండ్ల నుంచి ప్రజల్లో ఉన్నాం. వరుస పెట్టి గెలుస్తున్నాం. జిల్లా పార్టీ పదవి, ఫ్లోర్​లీడర్, పార్టీ బాధ్యతలన్నీ నెరివేర్చినప్పుడు పార్టీని నడపడం సాధ్యమే. రాష్ట్రంలో అనేకమంది టీఆర్ఎస్​ బాధితులున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చాలా మంది ఉన్నారు. నాకైతే ఎవరితోనూ శత్రుత్వం లేదు. భేషజాలు లేవు. నాకు ఫోన్​చేయని నేత, ప్రజాప్రతినిధి లేడు. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, స్వామిగౌడ్, జితేందర్‌రెడ్డి వంటి నేతలంతా కాల్​చేశారు. ఈటల రాజేందర్​అంటే ఇప్పుడు ఒంటరిగా లేడు. తెలంగాణ గడ్డపై పుట్టి ఇతర దేశాల్లో బతుకుతున్నవారు, కార్మికులుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ఎవరైనా ప్రజాస్వామిక వాతావరణం లేదని అనుకునే ప్రతి ఒక్కరూ నాకు అండగా ఉంటున్నారని ఈటల వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాస్వామికంగా ఉండే పాలన రావాలంటూ చెప్పుకొచ్చిన విధానం చూస్తే కొత్త పార్టీపై స్పష్టత ఇచ్చినట్లే. ముందుగా తన దృష్టి అంతా హుజూరాబాద్​ మీద ఉందని, తెలంగాణ ఉద్యమాన్ని కాపాడింది ఆ ప్రాంతమేనని, ప్రజాస్వామికంగా ఉండాలంటే.. ప్రజలు మెచ్చే పాలన రావాలంటే ఇప్పుడున్న పరిస్థితి మారాలి. ఆ మార్పు ఏ రూపంలోనైనా వస్తుంది. ఆ మార్పు కోసం నేను కూడా ప్రయత్నం చేస్తానంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్‌కు గునపంలా తగులుతున్నాయి.

డబ్బుకు పాతరేస్తారు

మరోవైపు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్​విధానాలను ఈటల ఈ సందర్భంగా బయటపెట్టారు. హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో చెప్పలేమని, కొవిడ్​తర్వాత ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని, ఇంత గంభీరమైన వాతావరణంలో రాజీనామా సరికాదని అనుకుంటా అని వెల్లడించారు. ఇప్పుడు రాష్ట్రంలో చాలా భయానక వాతావరణం నెలకొందని, కరోనాతో చాలా మంది చనిపోతున్నారు. అందుకే రాజకీయాల్లో మార్పులకు ఇంకా సమయం పడుతోందని, హుజూరాబాద్​ ప్రాంతంలో జెండా ఎత్తినోడు.. జెండా కాపాడినోడు ఈటల రాజేందర్ అని, నా ప్రాంతంలోని ప్రతి ఇల్లు నన్ను కొల్పోయినట్టే భావిస్తోందంటూ చెప్పుకొచ్చారు.

“డబ్బులకు, అహంకారానికి పాతరేస్తారు. హుజూరాబాద్​ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌కు, ప్రభుత్వానికి కాదు. తెలంగాణ ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానికి నిదర్శనం. అది ఉద్యమాల గడ్డ. ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటారు. నా ఎజెండా ఆర్ఎస్ఎస్​ నుంచి మొదలుకుని ఆర్ఎస్‌యూ వరకు అందరినీ కలుపుకుంటా.” అంటూ కొత్త పార్టీ అంశంలో మరోసారి సంకేతాలిచ్చారు.
రాష్ట్రంలో ఈటల రాజేందర్ వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. కరోనా సంక్షోభం ముగిసిపోయిన తర్వాత రాజీనామా చేస్తానని, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుంటానని, తాను భయపడే బిడ్డను కాదని, భయపడే వాడినైతే అక్కడే అడ్జస్ట్ అయ్యే వాడినని, పదవి కంటే ఆత్మగౌరవమే ఉన్నతమైనదంటూ ఈటల ప్రతిసారి చెబుతూనే ఉన్నారు.

వ్యతిరేక వర్గమంతా ఒకే తాటిపైకి

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈటలను అవమానకరంగా బయటకు పంపేశారంటూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలన్నీ ఇప్పుడు ఏకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్‌ను గద్దె నుంచి దింపే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈటల రాజేందర్ పిల్లర్‌గాలా కనిపిస్తున్నప్పటికీ.. తెర వెనుక కోదండరామ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, డీఎస్‌తో పాటు పలువురు సీనియర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీకు టీఆర్ఎస్‌ను ఢీకొట్టే పరిస్థితి లేదంటూ రాజకీయవర్గాలకు ఓ అంచనా ఉంది. దీనికి కారణం అటు కాంగ్రెస్‌లో కొంత మంది, ఇటు బీజేపీలో మరికొంత మంది టీఆర్ఎస్‌తో సన్నిహితంగా ఉండి.. సొంత పార్టీని ఎదగకుండా చేయడానికి వారు వ్యూహాలు పన్నుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి సమయంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో కేసీఆర్ వారికి చాన్స్ ఇచ్చారని, ఈటల రాజేందర్‌ పిల్లర్‌గా ప్రగతిభవన్‌ను ఢీకొట్టే వర్గం తయారవుతుందంటున్నారు. కొండా, రేవంత్, డీఎస్, బీజేపీలోని పలువురు నేతలతో ఈటల కూడా వీరితో జమకూడే అవకాశం కలిగింది. ఉద్యమకారులకు అన్యాయం, ఆత్మగౌరవ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story