బిగ్ న్యూస్.. సీఎం అభ్యర్థిగా ఈటల..!

by Anukaran |   ( Updated:2021-11-05 02:32:04.0  )
బిగ్ న్యూస్.. సీఎం అభ్యర్థిగా ఈటల..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ బీజేపీలో పవర్‌ఫుల్ లీడర్‌గా మారారు. అధికార పార్టీ అధినేతనే ఢీకొట్టి విజయం సాధించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన సత్తా ఏంటో తేలిపోయింది. ఈ క్రమంలోనే బీజేపీకి ఆయన ట్రంప్ కార్డుగా మారిపోయారు. పార్టీలో మరో పవర్ సెంటర్‌గా అవతరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ఈటల నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ వాడుకోనున్నది. అనుకూల పరిస్థితుల్లో ఆయనను సీఎం అభ్యర్థిగా సైతం నిలపనున్నదని సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను, ఉద్యమకారులను, టీఆర్ఎస్‌లోని అసంతృప్తివాదులను ఏకం చేసే టాస్కును త్వరలోనే చేపట్టనున్నట్టు సమాచారం.

శనివారం ఈటల ఢిల్లీ పర్యటన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ తదితరులతో పాటు అవకాశాన్ని బట్టి ప్రధాని మోడీని కూడా కలవనున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేకుండాపోయిందని, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వాతావరణం లేదని, అధినేత ఏం చెప్పినా దానికి ‘జీ హుజూర్’ అనే వారికి మాత్రమే భరోసా ఉంటుందనే భావన ఆ పార్టీలోని చాలా మంది నేతల్లో నెలకొన్నది.

ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టేందుకు బీజేపీ ఒక కార్యాచరణను రూపొందించాలనుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల నాటికి సరికొత్త రాజకీయ వాతావరణాన్ని తీసుకొచ్చి అధికార పార్టీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీయే అనే భావనను ప్రజల్లో కల్గించాలన్నది దాని ఉద్దేశం. ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన తర్వాత అనేక అనూహ్య పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకోనున్నాయి. మొదటి నుంచీ పార్టీ వ్యక్తులుగా ఉన్న బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు ఢోకా లేకపోయినప్పటికీ ఈటలకు వారితో సమానమైన ప్రయారిటీ, బాధ్యతలు ఉండొచ్చని పార్టీ వర్గాల అంచనా.

Advertisement

Next Story

Most Viewed