- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భగ్గుమంటోన్న భూగోళం.. మానవ తప్పిదాలే కారణం
న్యూయార్క్: భూగోళం వేడెక్కుతున్నది. మంచు ఫలకాలు కరుగుతున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందేళ్ల క్రితం దశాబ్దానికి ఓసారి వచ్చే కరువు కాటకాలు ప్రస్తుతం ప్రతి ఆరేడు ఏళ్లకోసారి వస్తున్నాయి. వీటన్నింటికీ కారణం ఒకటే.. అదే మానవ తప్పిదం. మనిషిలోని అత్యాశ ప్రకృతి విరుద్ధ పనులకు తెరలేపింది. మానవ చర్యలతో కర్బన ఉద్గారాలు తీవ్రంగా పెరుగుతున్నాయని, ఇది ఇలానే కొనసాగితే వచ్చే పదేళ్లలో భూతాపం మరింతగా పెరుగుతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్’(ఐపీసీసీ) అనే నివేదిక వెల్లడించింది. భారత్ సహా 195 దేశాల సభ్యులున్న ఈ ప్యానెల్ తన ఆరవ అసెస్‌మెంట్ రిపోర్టును సోమవారం విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రపంచం వేగంగా వేడెక్కుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇదే కొనసాగితే 2030 వరకు గ్లోబల్ హీట్ 1.5డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూతాపమే కాకుండా సముద్ర మట్టాలు సైతం వేగంగా పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 1901-1971లో సముద్ర మట్టాల పెరుగుదల సగటున ఏడాదికి 1.3 మిల్లీ మీటర్లుగా ఉండగా, 2006-2018 మధ్య ఇది ఏడాదికి 3.7 మిల్లీ మీటర్లకు పెరిగిందని తెలిపారు. ప్రపంచలోని ప్రతి రీజియన్ కూడా భూతాపానికి గురైందని పేర్కొన్నారు. గ్లోబల్ హీట్ 1.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే వేడి గాలులు పెరుగుతాయని, కోల్డ్ సీజన్ల కాలం తగ్గిపోతుందని తెలిపారు. ఒకవేళ గ్లోబల్ హీట్ 2డిగ్రీల సెల్సియస్‌కు పెరిగితే దీని తీవ్రత మరింత ఎక్కువవుతుందని, ఆరోగ్యం, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ‘వాతావరణ మార్పు ఇప్పటికే భూమిపై ప్రతి ప్రాంతాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తోంది. ఈ మార్పులతో మనం అదనపు వార్మింగ్‌ను అనుభవిస్తాము’ అని ఐపీసీసీ వర్కింగ్ గ్రూప్ కో చైర్మన్ పన్మావో జాయి వెల్లడించారు.
‘హిమాలయాల్లోని మంచు కరిగిపోవచ్చు’
గ్లోబల్ వార్మింగ్‌పై ఐపీసీసీ వెల్లడించిన నివేదికలో భారత్‌లోని హిమాలయ పర్వతాలు సైతం ప్రభావితమవుతాయని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. గ్లోబల్ హీట్‌తో హిమానీనదాలు, పర్వతాలపై ఉన్న మంచు పొరలు, మంచు ఫలకాలు కరిగిపోతాయని తెలిపారు. దీని ప్రభావం హిమాలయ పర్వతాలపైన పడుతుందని అంచనా వేశారు. పంచు ఫలకాలు కరిగిపోతే నీటి సైకిల్‌లో మార్పు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట వరదలు సంభవిస్తాయని, ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు నీటి కొరత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, కొండచరియలు విరిగిపడటం ఎక్కువవుతుందని తెలిపారు.
శిలాజ ఇంధనాలకు చావు మేళం వాయించండి: ఆంటోనియో గుటెరస్
కర్బన ఉద్గారాలతో భూవాతావరణం వేడెక్కుతున్నదన్న ఐపీసీసీ నివేదికపై ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ సోమవారం స్పందించారు. కర్బన ఉద్గారాలను విడుదలకు కారణమైన శిలాజ ఇంధనాలకు చావు మేళం వాయించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. శిలాజ ఇంధనాల అన్వేషణను, ఉత్పత్తిని వీలైనంత తొందరగా ఆపివేయాలని సూచించారు. పునరుత్పాదక శక్తిపై దృష్టి సారించాలని నిర్దేశించారు. ఎనర్జీ సెక్టార్‌ను తక్షణమే డీకార్బనైజ్ చేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.
పరిస్థితి ఇంకా మన చేతుల్లోనే..
గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకు పెరొగొచ్చని ఆందోళన చెందుతుందనప్పటికీ, పరిస్థితి ఇంకా మన చేతుల్లోనే ఉందని ఐరాస నివేదిక తెలిపింది. 2040నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాలను సున్నాకి తగ్గించినట్లయితే, గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితే చేసే అవకాశం మూడింట రెండొంతులు ఉంటుందని ఐపీసీసీ అసోసియేటెడ్ డైరెక్టర్ డాక్టర్ ఫెడ్రరిక్ ఒట్టో అంచనా వేశారు. ఉద్గారాలను తగ్గించిన వెంటనే వాయు నాణ్యత పెరుగుతుందని తెలిపారు. అయితే, ప్రపంచ ఉష్ణోగ్రతలు స్థిరంగా మారడానికి 20-30 ఏళ్లు పట్టొచ్చని అభిప్రాయపడ్డారు.