తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా

by Anukaran |   ( Updated:2021-06-17 08:23:16.0  )
తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 3 ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. జూన్, జులై నెలల్లో నిర్వహించాల్సిన ఎంసెట్, పీఈ సెట్, పీజీ ఈసెట్ పరీక్షలకు రీషెడ్యూల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కరోనా వ్యాధి ప్రభావం కారణంగా ఆగస్ట్ నెలలో ఈ 3 పరీక్షలను నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నారు. ఎంసెట్ దరఖాస్తుగా గడువును ఈ నెల 24 వరకు పొడగించారు.

ఆగస్ట్ 5 నుంచి 9 వరకు ఎంసెట్..

జులై 5 నుంచి 9 వరకు నిర్వహించాల్సిన ఎంసెట్ పరీక్షను ఆగస్ట్ 5 నుంచి 9 వరకు నిర్వహించేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎంసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు మరో సారి పొడగిస్తూ ఎంసెట్ కన్వినర్ గోవర్దన్ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఎంసెట్‌ కోసం 2,25,125 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో ఇంజనీరింగ్ విభాగానికి 1,49,606 మంది, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ విభాగం కోసం 75,519 మంది దరఖాస్తు చేసుకున్నారు.

పీఈ సెట్, పీజీ ఈసెట్ పరీక్షలు వాయిదా..

ఈ నెల 19 నుంచి 22 వరకు నిర్వహించాల్సిన పీజీ ఈసెట్ పరీక్షలను వాయిదా వేశారు. ఇప్పటికే 25 వేల మంది విద్యార్థులకు వరకు దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షను ఆగస్ట్ మూడవ వారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి ఏర్పాట్లను చేపట్టింది. ఇందుకు అనుగుణంగా దరఖాస్తు గడువును జూన్ 19 వరకు పొడగించారు. పీఈ సీసెట్ పరీక్షలను కూడా ఆగస్ట్ నెలలో నిర్వహించేందుకు ఆలోచనలు చేస్తున్నారు. దరఖాస్తు గడువును జూన్ 30 వరకు పొడగించారు.

ఈ నెలాఖరులో డిగ్రీ ప్రవేశాలు..

ఇంటర్ పరీక్షలను రద్ధు చేసి విద్యార్థులందరిని ప్రమోట్ చేయడంతో డిగ్రీ ప్రవేశాలను చేపట్టనున్నారు. ఈ నెలాఖరులో దోస్త్ వెబ్‌సైట్ ద్వారా డిగ్రీ ప్రవేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు మెమోలు అందించనున్నారు. ఈ ఏడాది డిగ్రీ, పీజీ పరీక్షలకు కామన్ పాలసీని అమల చేసేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed