- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్..టూరిజం కుదేలు..
దిశ, మేడ్చల్: కరోనా వైరస్ (కోవిడ్-19) కట్టడికి ఏప్రిల్ 14 వరకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల రోజుకు రూ.కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా పర్యాటక రంగం, హోటల్స్, క్యాబ్స్‌పై ఈ నష్టం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పర్యాటక ప్రదేశాలు పూర్తిగా బంద్ కాగా, క్యాబ్స్, హోటల్స్ మూతపడ్డాయి. దీంతో ఆయా పరిశ్రమపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రతి నెలా రూ.6 కోట్ల ఆదాయం..
ఎయిర్‌వేస్, డొమెస్టిక్ ఫ్లైట్లు సైతం బంద్ చేయడంతో ఫారిన్ టూరిస్ట్‌లు ఎవరూ ఇప్పుడు రావడం లేదు. సాధారణంగా రాష్ట్రంలో నెలకు 15వేల మంది వరకు టూరిస్ట్‌లు వస్తుంటారు. వీరంతా రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. కానీ, ప్రస్తుతం టూరిజం ప్లేసెస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. దీంతో పర్యాటక రంగం దాని అనుబంధ రంగాలకు తీవ్ర నష్టం ఏర్పడుతోంది. రాష్ట్రంలో ప్రతి నెలా పర్యాటక శాఖ, దాని అనుబంధ రంగాల నుంచి 6 కోట్ల ఆదాయం వస్తుంది. కాని ఈ నెల రెండు కోట్లు కూడా దాటలేదు. రాష్ట్రంలో సుమారు 20వేల మంది టూరిజం డిపార్ట్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం టూరిస్ట్ గైడ్స్, ఏజెంట్లు తదితర సిబ్బందికి పనిలేకపోవడంతో ఖాళీగా ఉన్నారు. తమకు పనిచేస్తేనే పూటగడుస్తుందనీ, అలాంటిది 10 రోజులుగా ఉత్తగనే ఉన్నామని వారు వాపోతున్నారు. ఏప్రిల్ 14 వరకు ఇదే పరిస్థితి ఉండనుందనీ, ఇప్పుడు ఏంచేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హోటళ్లపైనా కరోనా ప్రభావం..
టూరిస్ట్‌లు తగ్గడంతో ఆ భారం హోటళ్లపైనా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4లక్షల మంది హోటళ్లపై ఆధారపడి ఉన్నారు. ఇందులో 2లక్షల మంది దాకా ప్రస్తుతం పనిలేక ఖాళీగా ఉంటున్నారు. రాష్ట్రంలోని హోటల్స్‌లో రోజు వారీ ఆదాయం 100 శాతం తగ్గిపోయిందని హోటల్స్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. ప్రధాన పట్టణాల్లో పెద్దపెద్ద హోటల్స్‌లో ఉన్న లాడ్జీల్లో బుకింగ్స్ పూర్తిగా పడిపోయాయనీ, ఇప్పటికే బుక్ చేసుకున్న వాటినీ క్యాన్సిల్ చేసుకుంటున్నారని తెలిపారు. దీంతో కనీసం ఖర్చులకు కూడా వెళ్లడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఆఖరులో లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉందనీ, ఆదాయమే లేకుంటే రెన్యువల్ ఎలా చేసుకోగలమనీ, అందుకు డబ్బులు ఎలా కట్టాలని వాపోతున్నారు.
హోటల్ స్థాయిని బట్టి ఏడాదికి 10వేల నుంచి 2లక్షల వరకు చెల్లించాల్సి ఉందంటున్నారు. కట్టకుంటే మొదటి నెల రూ.25వేలు, రెండో నెల రూ.50వేల వరకు పెనాల్టీ విధించనున్నట్లు చెబుతున్నారు. దీన్ని మూడు నెలల వరకు వాయిదా వేస్తే బాగుంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని కూడా కొన్ని రోజులపాటు వేయొద్దని కోరుతున్నారు.
క్యాబ్స్ కుదేలు..
కోవిడ్ 19 ఎఫెక్ట్‌తో క్యాబ్స్ పరిశ్రమా కుదేలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల మంది పనిలేకుండా ఖాళీగా ఉంటున్నారు. హైదరాబాద్ నగరంలో 80 వేల క్యాబ్స్ ఉన్నాయి. ప్రస్తుతం పూర్తిగా తగ్గించారు. దీంతో ఫైనాన్స్ కట్టలేక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేకుండా డ్రైవర్లు ఇబ్బందులు పడుతుంటే మరో వైపు క్యాబ్ సంస్థలు మాత్రం రోజువారీ లీజ్ డబ్బులు రూ.1175 కట్టాలని ఆదేశిస్తున్నాయి. డబ్బులు కట్టలేనివారి బండ్లను ఇప్పటికే సీజ్ చేశాయి. మొత్తానికి మొత్తం క్యాబ్స్ బంద్ అయితే తామెక్కడి నుంచి తెచ్చి డబ్బులు కడతామని డ్రైవర్లు వాపోతున్నారు. 3 నెలల వరకు లీజ్ డబ్బులు అడగకుండా మినహాయింపును ఇవ్వాలని కోరుతున్నారు. ఈ 3 నెలలపాటు క్యాబ్ సంస్థలు కమీషన్ తీసుకోకుండా బిజినెస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కిస్తీలూ 3 నెలలు వాయిదా వేయాలని కోరుతున్నారు.
Tags : corona virus (covid-19), effect, tourism places, hotels, collapsed