థర్డ్ అంపైర్ అనిల్ చౌదురిపై జో రూట్ ఆగ్రహం

by Shiva |
Cricket
X

దిశ, స్పోర్ట్స్ : ఆన్ ఫీల్డ్ అంపైర్ల తప్పిదాల వల్ల ఆటగాళ్లకు అన్యాయం జరగకూడదని టెక్నాలజీ సహాయంతో థర్డ్ అంపైర్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. అయితే థర్డ్ అంపర్ కూడా తప్పులు చేస్తే ఎలా ఉంటుందో చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు అర్థం అయ్యింది. జాక్ లీచ్ వేసిన 75వ ఓవర్‌లో అజింక్య రహానే కొట్టిన బంతి లెగ్ సైడ్ పడి షార్ట్ లెగ్‌లో ఉన్న ఓలీ పోప్ చేతిలో పడింది. ఇంగ్లాండ్ జట్టు అవుట్ కోసం అప్పీల్ చేసిన ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో జో రూట్ రివ్యూ కోరాడు. రివ్యూ పరిశీలించిన థర్డ్ అంపైర్ అనిల్ చౌదురి పూర్తి ఫుటేజ్ పరిశీలించకుండానే నాటౌట్ ప్రకటించాడు. బంతి మొదట బ్యాట్‌కు తగలక పోయినా ప్యాడ్స్ తాకిన అనంతరం రహానే గ్లౌజులకు తాకినట్లు ఫుటేజీలో ఉన్నది.

కానీ థర్డ్ అంపైర్ పూర్తిగా పరిశీలించకుండా నాటౌట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ జట్టు రివ్యూ కోల్పోయింది. అంతే కాకుండా రహానేకు ఒక లైఫ్ లభించింది. దీనిపై ఇంగ్లాండ్ జట్టు రిఫరీకి ఫిర్యాదు చేసింది. రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఐసీసీ రాజ్యంగంలోని 3.6.8 ప్రకారం ఇంగ్లాండ్‌కు రివ్యూ తిరిగి ఇచ్చేశారు. అయితే రహానే అవుట్ కాకపోవడంపై జో రూట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత రహానే ఒకే పరుగు జోడించి అవుటయ్యాడు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా అతడు మరింత భారీ స్కోర్ సాధించి ఉంటే ఇంగ్లాండ్ భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చేది. అంపైర్ నిర్ణయంపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. అనిల్ చౌదరికి ఇది రెండో టెస్టు మాత్రమే. అయినా సరే ఎన్నో అంతర్జాతీయ వన్డే, టీ20లకు అంపైరింగ్ చేసిన అనుభవం ఉన్నది. కాగా, ఇది ఫుటేజీ టెక్నికల్ ఎర్రర్ అని.. అంపైర్‌కు పూర్తి ఫుటేజీ చూపించకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.

Advertisement

Next Story