మోడీ ముఖం కూడా చూడనన్న దీదీ.. అది దేశద్రోహమే అంటున్న అధికారి

by Shamantha N |
bengal cm comments on pm
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ సమీపిస్తున్న కొద్దీ అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతున్నది. ప్రధాని మోడీ ముఖం కూడా తాను చూడలేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనగా.. దీదీ భరతమాతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నదని ఆమె ఒకప్పటి ప్రధాన అనుచరుడు, ప్రస్తుతం ఆమె పోటీ చేస్తున్న నందిగ్రామ్ నుంచి బరిలో నిలిచిన బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు. ఈ వ్యాఖ్యలకు దీదీ కూడా కౌంటర్ ఇచ్చారు. సువేందును తాను నమ్మితే.. అతడు నమ్మకద్రోహం చేశాడని, ఆయన ఒక ద్రోహి అని మండిపడింది.

తొలిదశ పోలింగ్‌కు టైం దగ్గర పడుతున్న తరుణంలో ప్రచారం స్పీడ్ పెంచిన దీదీ. ఈస్ట్ మిడ్నాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దుర్యోదనుడని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దుశ్శాసనుడంటూ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వీడ్కోలు చెప్పాలని ప్రజలను కోరారు. నరేంద్ర మోడీ ముఖం చూడటం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. సువేందు అధికారి ఒక ద్రోహి (మీర్ జాఫర్) అని నిప్పులు చెరిగారు. బెంగాల్‌లో అల్లర్లు, లూటీలు, దోపిడీలు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మీర్ జాఫర్ తమకు అక్కర్లేదని స్పష్టం చేశారు.

మమతా వ్యాఖ్యలపై సువేందు కూడా అదే విధంగా స్పందించారు. ‘మీరంతా పీఎం మోడీ అందజేస్తున్న వ్యాక్సిన్‌ను వేసుకుంటున్నారు. ఆయన ప్రజలచేత ఎన్నికైన దేశ ప్రధాని. మోడీని విమర్శించడమంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటమే. భరతమాతకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే’ అంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed