- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నేర్పిన క్రమశిక్షణ.. ఎక్కడో తెలుసా?
దిశ, కరీంనగర్: అక్కడికి చాలామంది వస్తుంటారు. కానీ, వచ్చిపోయేటప్పుడు చాలా భయపడుతుంటారు. ఎందుకంటే అక్కడున్న కోతుల హంగామా అంతా ఇంతా కాదు.. కానీ, అవి ఇప్పుడూ కరోనా కారణంగా పూర్తిగా మారిపోయాయి. క్రమశిక్షణతో మెలుగుతున్నాయి. చెప్పినట్టే నడుచుకుంటున్నాయి. గతంలో పోలీస్తే ప్రస్తుతం వాటి ప్రవర్తన ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నది. అదెక్కడో మీరే చూడండి.. ప్రత్యేక కథనంలో..
ఆ ఆలయానికి వెళ్లిన భక్తులు మర్కట పద్మవ్యూహాన్ని ఛేదించాలి. కోతుల బారి నుండి తమను తాము కాపాడుకోవడమే కాదు తమ చేతిలోని వస్తువులను కూడా భద్రతపర్చుకోవాల్సి ఉంటుంది. స్వామి దర్శనం అయిందన్న సంతోషం కన్నా ఆ కోతుల బారిన పడకుండా బయట పడ్డామన్న ఆనందం భక్తుల్లో ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు వాటిల్లో మార్పు వచ్చేసింది. లాక్‌డౌన్ వల్ల జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దీంతో ఆలయాలు కూడా భక్తులు లేక బోసిపోతున్నాయి. ప్రభుత్వం కూడా ఆలయాల్లో కేవలం సంప్రదాయం ప్రకారం పూజలు చేయాలని, భక్తులను అనుమతించవద్దని ఆదేశించింది. దీంతో ఆలయాలకు భక్తులు వెళ్లలేని పరిస్థితి తయారైంది. ఈ కారణంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉంటున్న వందలాది కోతులకు ఆహారం కరువైంది. కడుపునిండా ఆహారం దొరకక నీరసించిపోయాయి.
ఈ విషయాన్ని గమనించిన ఆలయ ఉద్యోగులు కృష్ణ, శ్రీనివాసాచారిలు అయ్యప్ప గురు స్వామి సత్యానందంకు తెలిపారు. ఆయనకు కరీంనగర్ టూ టౌన్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ చేదోడుగా నిలిచారు. వీరిద్దరూ ఆకలితో అల్లాడిపోతున్న కోతులకు ఆహారం అందించాలని భావించారు. మార్చి 20 నుండి ఆ కోతులకు ఆహారం అందిస్తున్నారు. రోజూ అరటిపళ్లు, చపాతీలు, కూరగాయలు తీసుకెళ్లి కోతులకు ఆహారంగా అందిస్తున్నారు. కరీంనగర్ నుండి ప్రత్యేకంగా తీసుకెళ్లి వాటికి అందజేస్తున్నారు. రెండుపూటలా సరిపడా ఆహారం తీసుకెళ్లి స్వయంగా ఆహారం అందించి, మరో పూటకు సరిపడా ఆహారాన్ని ఆలయ ఉద్యోగి కృష్ణకు అప్పగిస్తున్నారు.
అయితే నిన్న, మొన్నటి వరకు భక్తుల చేతుల్లోని కవర్లను, బ్యాగులను లాక్కొని ఆహారం కోసం హంగామా చేసే కోతులు కరోనాతో క్రమ శిక్షణను నేర్చుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా తిండి దొరకక నకనకలాడిన కోతులు ఇప్పుడు క్రమశిక్షణతో ఉంటూ వీరందించే ఆహారాన్ని మాత్రమే తీసుకుని తింటున్నాయి. ఇంతకుముందు అంజన్న ఆలయంలో కోతులు భక్తులను ముప్పు తిప్పలు పెట్టేవీ. కానీ, ఇప్పుడు అవి క్రమశిక్షణను పాటిస్తున్నాయి.
దాతల వితరణ..
మూగజీవాలకు తిండి దొరకడం లేదని తెలిసి వాటికి ఆహారం అందించాలనుకున్న కోట సత్యానందం నిర్ణయానికి అనుగుణంగా కరీంనగర్ కు చెందిన దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. అయితే వీరు కేవలం కోతులకే కాకుండా కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉంటున్న కుటుంబాలకు కూరగాయలు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి మూడు రోజులకోసారి కొండగట్టు ఆలయం వద్ద ఉంటున్న 20 కుటుంబాలకు సరిపడా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వలస కూలీలు, నిరుపేదలకు ఆహారాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నా మూగ జీవాలకు కూడా ఆహారం అందించాలని తామీ ప్రయత్నం చేస్తున్నామని సత్యానందం తెలిపారు. భక్తుల రాకపోకలు ఉంటే కోతులకు తిండి దొరికేది కానీ, లాక్‌డౌన్ వల్ల అలాంటి పరిస్థితి లేదని గుర్తించామన్నారు. అయితే దాతలు ముందుకు వస్తున్నారని.. ఇబ్బడిముబ్బడిగా ఆహారాన్ని వృథా చేయకుండా ఒక్కోరోజు ఒక్కొక్కరికి సమయం ఇస్తున్నామని వివరించారు.
దాతృత్వం ఆయన స్పెషాలిటీ..
జిల్లా పరిషత్‌లో సూపరింటెండెంట్‌గా పని చేసి రిటైర్మెంట్ అయిన సత్యానందం అనే వ్యక్తి నిత్యం సేవాకార్యక్రమాల్లో మునిగి తేలుతారు. దానం చేసేందుకు ఆయన అధిక ప్రాధాన్యతనిస్తారు. గత కొంత కాలంగా కరీంనగర్‌లోని ప్రభుత్వ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్‌లో అడ్మిట్ అయిన తల్లులకు రెండు పూటలా టిఫిన్ ఉచితంగా అందిస్తున్నారు. అయ్యప్ప దీక్షా సమయంలో కూడా మాల ధారణ చేసేవారికి భిక్ష ఏర్పాటు చేస్తారు. తాజాగా వేములవాడ సమీపంలోని నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద కోతులకు ఆహారం దొరకడం లేదని తెలుసుకుని అక్కడ ఉన్న వందలాది కోతులకు కూడా పండ్లు, కూరగాయలు అందిస్తున్నారు.
Tags: kondagattu, helping, monkeys, food, vegetables, fruits, lock down effect