ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద వైద్యులు.. సిబ్బందికి మాస్క్, ఫేస్ షీల్డ్

by Shyam |
ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద వైద్యులు.. సిబ్బందికి మాస్క్, ఫేస్ షీల్డ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు, అనివార్య కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలకు నిర్వహించే ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వైద్య సిబ్బంది ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులకు ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై శనివారం ఆయన కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులు, డైరెక్టర్, హెల్త్, ఎన్నికల సాధారణ పరిశీలకులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా, మున్సిపాలిటీల వారీగా ప్రతీ వార్డుకు ఒక మెడికల్ ఆఫీసర్, తగు సిబ్బందిని నియమించాలని, అలాగే ఏఎన్ఎం, ఆశ వర్కర్, హెల్త్ వర్కర్లను నియమించి కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రతీ పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బందికి మాస్క్‌తో పాటు, ఫేస్ షీల్డ్, శానిటైజర్, చేతి గ్లౌసులు అందించాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్, ఫర్నీచర్‌ను ముందురోజే శానిటైజ్ చేసేలా చూడాలన్నారు. పోలింగ్ స్టేషన్ బయట కూడా శానిటైజర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలి..

పోలింగ్‌కు సరిపడా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవాలని, అలాగే బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ల పంపిణీని పూర్తి చేయాలని ఎస్ఈసీ పార్థసారథి అధికారులకు సూచించారు. ఎన్నికలు సజావుగా పూర్తి చేసేలా పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసులకు ఆయన సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను నియమించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ర్యాలీలు, మీటింగులపై ఆంక్షలు

పోలింగ్ నేపథ్యంలో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎలాంటి ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, రోడ్ షోలకు అనుమతివ్వకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా సిబ్బందిని తరలించేందుకు వాహనాలను సమకూర్చాలని, అలాగే తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బందిని గుర్తించి ఈనెల 28లోపు వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 5 టేబుళ్లకు మించి వేయరాదని సూచించారు.

ఈ సమావేశంలో డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ, అదనపు డీజీపీ జితేందర్, వరగంల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ పరిశీలకులు డాక్టర్ క్రిస్టినా చోంగ్తు, అహ్మద్ నదీం, నకిరేకల్ మున్సిపాలిటీ పరిశీలకురాలు వాకాటి కరుణ, జడ్చర్ల, కొత్తూరు పరిశీలకుడు శ్రీధర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, ఓఎస్డీ జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed