మంత్రి ఈటల జోక్యంతో జూడాల ఆందోళన సుఖాంతం

by  |   ( Updated:2020-06-10 11:45:35.0  )
మంత్రి ఈటల జోక్యంతో జూడాల ఆందోళన సుఖాంతం
X

దిశ, న్యూస్‌బ్యూరో: విధి నిర్వహణలో ఉన్న వైద్యులపై పేషెంట్ల బంధువులు దాడి చేసిన ఘటనపై బుధవారం ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. జూనియర్ డాక్టర్లు ఆస్పత్రి ఎదురుగా ఉన్న రోడ్డుమీదకు వచ్చి ఆందోళన చేయడంతో వార్డుల్లోని రోగులకు వైద్య సేవలకు అంతరాయం కలిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మంత్రి ఈటల రాజేందర్ సచివాలయానికి రావాల్సిందిగా జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. అయితే వారు అందుకు సుముఖంగా లేనందున చర్చలకు హాజరుకాలేదు. సాయంత్రానికి మంత్రి స్వయంగా గాంధీ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఐదు డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. అందులో మూడింటిపై అక్కడికక్కడే నిర్ణయం జరగ్గా మిగిలిన రెండింటిపై మాత్రం సీఎంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జూనియర్ డాక్టర్లకు స్పష్టం చేశారు.

విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై దాడులు జరగకుండా ఇప్పటికే ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులను మరింత ఎక్కువ సంఖ్యలో నియమించాలని, ప్రతీ వార్డులోనూ వారిని నియమించాలని జూనియర్ డాక్టర్లు చేసిన డిమాండ్‌కు మంత్రి సానుకూలంగా స్పందించారు. కరోనా పాజిటివ్ పేషెంట్లంతా గాంధీ ఆసుపత్రికే వస్తుండడంతో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని, దీన్ని నివారించడానికి వేర్వేరు ఆసుపత్రులకు పేషెంట్లను తరలించాలని మంత్రికి సూచించారు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుందామని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్, ఐసీయూ టెక్నీషియన్, వార్డు బాయ్ తదితరులను రిక్రూట్ చేసుకోవాలని జూనియర్ డాక్టర్లు చేసిన డిమాండ్‌కు మంత్రి స్పందిస్తూ, ఇప్పటికే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ అయిందని, త్వరలోనే భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. తగినంత సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల సరఫరా జరగాలని, కరోనా పేషెంట్లకు చికిత్స అందించే వార్డుల్లో సిబ్బందికి వీటిని పంపిణీ చేయాలన్న డిమాండ్‌పై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు.

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అడ్వయిజరీ కమిటీలో జూనియర్ డాక్టర్లకు కూడా ప్రాతినిధ్యం ఉండాలన్న డిమాండ్‌పై ఎక్కువ సేపు చర్చ జరిగింది. జూనియర్ డాక్టర్లు, మంత్రి ఈటల రాజేందర్‌కు మధ్య మొత్తం మూడు గంటల పాటు చర్చ జరగ్గా ఎక్కువ సమయం దీనిపైనే ఫోకస్ అయింది. విధి నిర్వహణలో జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే వారికి ఈ కమిటీలో ప్రాతినిధ్యం ఉండడం అవసరమని, అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రికి వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందామని మంత్రి అర్థం చేయించారు. చివరకు ఈ చర్చలు ఫలప్రదం కావడంతో జూనియర్ డాక్టర్లు సంతృప్తి వ్యక్తం చేసి వెంటనే విధుల్లో చేరనున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed