పాత బ‌స్టాండ్‌లో సిటీ బ‌స్సులు న‌డుపుతారా..?

by Sridhar Babu |
పాత బ‌స్టాండ్‌లో సిటీ బ‌స్సులు న‌డుపుతారా..?
X

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో ఏ నోటా విన్నా బ‌స్టాండ్ గురించే చ‌ర్చ.. పాత బ‌స్టాండ్‌లో సిటీ బ‌స్సులు న‌డుపుతారా.. లేదా అనే ప్రశ్న ప్రతీ ఒక్కరిలో ఆలోచ‌న‌కు గురి చేస్తుంది. ఖ‌మ్మం న‌గ‌రంలోని బైపాస్ రోడ్డులో కొత్తగా నిర్మించిన బ‌స్టాండ్ సంపూర్ణంగా పూర్తి కాక‌పోయినా ర‌వాణా శాఖ మంత్రి మాత్రం మార్చి 1వ తేదీ నుంచి బ‌స్సుల రాక‌పోక‌ల‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రజ‌లు మాత్రం ఎలా సాధ్యమ‌వుతుంద‌ని ఆలోచ‌న చేస్తున్నారు. మ‌రోప‌క్క పాత బస్టాండ్ నుంచి లోక‌ల్ బ‌స్సులు న‌డిపించాల‌ని అఖిల‌ప‌క్షం ద‌ఫాల వారిగా ఉద్యమాలు చేప‌డుతుంది. సీపీఎం, కాంగ్రెస్‌, న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ప్రజ‌ల అభిప్రాయాల‌ను ప్రజా బ్యాలెట్ ద్వారా సేక‌రించారు. పాత బ‌స్టాండ్‌లో గ్రామీణ బ‌స్సుల‌ను న‌డిపిస్తే ప్రజ‌ల‌కు సౌక‌ర్యంగా ఉంటుంద‌ని ప్రజా బ్యాలెట్‌తో తెలుస్తోంది. ఖ‌మ్మం న‌గ‌రంలో వారం రోజుల నుంచి అఖిల ప‌క్షం పెద్ద ఎత్తున అందోళ‌న చేస్తున్న అధికార పార్టీ నోరు మెద‌ప‌డం లేదు. ప్రజ‌లకు పాత బ‌స్టాండ్ పై ఉన్న అనుమానాలు దూరం చేసేందుకు ఆర్టీసీ అధికారి చేత పాత బ‌స్టాండ్ పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రక‌టించారు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళ‌న న‌డుస్తున్న ఆ శాఖ‌కు సంబందించిన మంత్రి ఖమ్మం నియోజ‌క‌వ‌ర్గం చెందిన ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్‌కుమార్ ఉండ‌డం గ‌మ‌నార్హం. క‌నీసం పాత బ‌స్టాండ్ వ‌స్తున్న ఆరోప‌ణ‌లపై నోరు మెద‌ప‌కుండా మౌనంగా ఎందుకు ఉన్నారో.. అనే ప్రశ్నల‌పై భిన్న కోణాల్లో చర్చ జ‌రుగుతోంది.

పాత బ‌స్టాండ్‌ను లోక‌ల్ బ‌స్టాండ్ ప్రక‌టిస్తేనే మేలు..

న‌గ‌రం న‌డిబొడ్డున పాత బ‌స్టాండ్‌ను లోక‌ల్ బ‌స్టాండ్‌గా ప‌రిగ‌ణించాల‌ని ప్రజ‌లు అభిప్రాయాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం న‌డుస్తున్న పాత బ‌స్టాండ్‌లో లోక‌ల్ బ‌స్సులు న‌డిపిస్తే ఎలాంటి న‌ష్టాలు, స‌మ‌స్యలు ఉంటాయి అనే ప్రక‌ట‌న చేయ‌కుండా అధికార పార్టీ నేత‌లు మౌనంగా ఉన్నారంటే పాత బ‌స్టాండ్‌ను షాపింగ్ మాల్ లీజుకు ఇచ్చార‌ని, అధికార పార్టీ చెందిన ఓ పెద్ద నేత ప్రభుత్వం ద్వారా కొన్నార‌ని ప్రజ‌ల్లో అనుమానాలు మెలుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో 1975 సంవ‌త్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయిన జ‌ల‌గం వెంగ‌ళ‌రావు హ‌యాంలో అప్పటి జ‌నాభాప్రతిపాదికంగా నాలుగు ఎక‌రాల స్థలంలో ప‌ది ప్లాట్‌ఫాంతో బ‌స్టాండ్ నిర్మాణం చేప‌ట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ప్రయాణికుల‌తో పాటు బ‌స్సుల సంఖ్య పెరిగిన‌ప్పటికీ బ‌స్టాండ్ విస్తీర్ణం మాత్రం పెర‌గ‌లేదు.

దీని ఫ‌లితంగానే బ‌స్టాండ్‌లోకి వ‌చ్చేపోయే బ‌స్సుల‌తో ఆ ప్రాంత‌మంత కిక్కిసిపోవ‌డ‌మేకాక, బ‌స్టాండ్ బ‌య‌ట వ‌ర‌కు బ‌స్సులు బారులు తీసేవి. దాని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం బైపాస్ రోడ్డులో ఉన్న 7.29 ఎన్ఎస్పీ స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో 32 ప్లాట్‌ఫాంతో నూత‌న బ‌స్టాండ్ నిర్మాణ ప‌నులు చేప‌ట్టారు. అయితే ర‌వాణా శాఖ మంత్రి మాత్రం అసెంబ్లీలో నూత‌న బ‌స్టాండ్‌ను హైటెక్ బ‌స్టాండ్‌గా.. పాత బ‌స్టాండ్‌ను లోక‌ల్ బ‌స్టాండ్‌గా కొన‌సాగిస్తామ‌ని ప్రక‌టించారు. అయితే ఇప్పుడు త‌న ప్రక‌టన గుర్తు లేదేమో.. పాత బ‌స్టాండ్ పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారి ద్వారా ప్రక‌టించారు. ఖ‌మ్మం చుట్టుపక్కల గ్రామాల‌కు చెందిన ప్రజ‌లు, రైతులు, విద్యార్థులు, వ్యాపార‌స్తులు కొత్త బ‌స్టాండ్ నుంచి రాక‌పోక‌లు కొన‌సాగించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. పాత బ‌స్టాండ్ చుట్టుప‌క్కల ప్రాంతాలు వ్యాపార‌ప‌రంగా ప్రజ‌ల‌కు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రజ‌లు త‌మ త‌మ అవ‌స‌రాల‌కు సంబంధించిన కొనుగోలు చేసుకుని పాత బ‌స్టాండ్ ఉండే బ‌స్సుల ద్వారా వారి వారి గ‌మ్య స్థానాల‌కు చేరుకుంటున్నారు. దానికి తోడు వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా ఖ‌మ్మం చేరుకున్న ప్రయాణికులు బ‌స్సులు కావాలంటే న‌డుచుకుంటా రాక‌పోక‌లు కొన‌సాగిస్తున్నారు. ఇప్పుడు పాత బ‌స్టాండ్‌ను బైపాస్ రోడ్డులో ఉన్న కొత్త బ‌స్టాండ్‌కు మారిస్తే ప్రయాణికులు ఆటోల ద్వారా రావాల్సిన ప‌రిస్థితి ఏర్పడుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన‌ ప్రయాణికుల‌కు ఆర్థిక భారం ప‌డ‌నుంది. దానికి తోడు పాత బ‌స్టాండ్ చుట్టుప‌క్కల ప్రాంతాల్లో ఉన్న వ్యాపార‌స్తుల‌కు మ‌రింత ఆర్థికంగా న‌ష్టపోయే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని విశ్లేష‌కులు, ప్రజ‌లు తెలుపుతున్నారు. అందుకే పాత బ‌స్టాండ్‌ను లోక‌ల్ బ‌స్టాండ్‌ను ప్రక‌టించాల‌ని పార్టీ జెండాల‌ను ప‌క్కన‌పెట్టి అఖిల ప‌క్షంగా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్నారు.

ప్రజా బ్యాలెట్ కు భారీ స్పందన…

పాత బస్టాండ్ ను లోకల్ బస్టాండ్‌గా కొనసాగించాలనే డిమాండ్ కు మద్దతుగా 99 శాతం ప్రజలు మద్దతు ప‌లికారు. సీపీఎం, కాంగ్రెస్‌, న్యూడెమోక్రసీ వివిధ పార్టీల ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఇటీవ‌ల వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు ప్రజ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించారు. ఈ ప్రజా బ్యాలెట్‌లో 2,773 ఓట్లు పోల్ కాగా అందులో పాత బ‌స్టాండ్‌ను లోక‌ల్ బ‌స్టాండ్‌గా కొన‌సాగించాల‌ని 2726 మంది ఓట‌ర్లు మ‌ద్దతు ప‌లికారు. 46 మంది ప్రజా బ్యాలెట్‌ను వ్యతిరేకించారు. అఖిల‌ప‌క్షం చెందిన నాయ‌కులు పాత బ‌స్టాండ్‌ను లోక‌ల్ బ‌స్టాండ్‌గా ప్రక‌టించే వ‌ర‌కు ఉద్యమాల‌ను ఉధృతం చేస్తామ‌ని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న పాత బ‌స్టాండ్‌ను లోక‌ల్ బ‌స్టాండ్‌గా కొన‌సాగిస్తున్నారో అదే విధంగా ఏర్పాట్లు చేయాల‌ని అఖిల‌ప‌క్షం డిమాండ్ చేస్తుంది. అఖిల‌ప‌క్షం ఆధ్వర్యంలో శ‌నివారం పాత బ‌స్టాండ్ వ‌ద్ద పెద్ద ఎత్తున్న ఆందోళ‌న చేయాల‌ని పిలువునిచ్చింది.

నూత‌న బ‌స్టాండ్‌లో కార్యకలాపాలు తాత్కాలిక వాయిదా?

ఖ‌మ్మం న‌గ‌రంలోని బైపాస్ రోడ్డులో నూత‌నంగా నిర్మాణం చేప‌ట్టిన బ‌స్టాండ్‌లో మార్చి 1న కార్యక‌లాపాలు కొన‌సాగించాల‌ని ర‌వాణా శాఖ మంత్రి అధికారుల‌కు సూచించారు. దీంతో ఆర్టీసీ అధికారులు కార్యక‌లాపాలు నిర్వహించేందుకు అన్నీ సిద్దం చేసుకున్న అనుకున్న స‌మ‌యంలో కొత్త బ‌స్టాండ్ నిర్మాణం పూర్తి స్ధాయిలో పూర్తి కాలేదు. ప్లాట్‌ఫాంలు లోప‌ల ప్లోరింగ్ పూర్తయ్యాయి. పెయింటింగ్ లాంటి ప‌నులు, బ‌స్టాండ్‌లో బాత్రూంలు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లు అనుకున్న స‌మ‌యంలో నిర్మాణం చేప‌ట్టలేదు. మంత్రి అదేశాల‌ను ఎలా పాటించాలో ఆర్ధం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఆర్టీసీ ఆధికారులు మాత్రం మార్చి 1 న సాధ్యం కాద‌ని తెలుపుతున్నారు. ఇంక వారం రోజులు ప‌ట్టవ‌చ్చని అధికారులు తెలుపుతున్నారు. మంత్రి అనుకున్న తేదీ వ‌ర‌కు కార్యక‌లాపాలు కొన‌సాగిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed