కేసీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ

by Sridhar Babu |   ( Updated:2021-11-05 07:18:17.0  )
DK-aruna-1
X

దిశ, జోగులంబ గద్వాల: గత నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు వేల కోట్ల రూపాయలు కుమ్మరించి, అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేయాలని చూసిన తెరాస నేతలకు హుజురాబాద్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పి ఈటల రాజేందర్ కు అండగా నిలబడ్డారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ఓటర్లు, ప్రజలు ఇచ్చే తీర్పే అంతిమం అని హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరోసారి రుజువు చేసిందని, హుజూరాబాద్ గెలుపు కేసీఆర్ కు చెంప పెట్టులాంటిదని విమర్శించారు. ఇప్పటికైనా హుజురాబాద్ విజయంతో టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు.

ఒక్క హుజురాబాద్ ఎన్నికల్లో రూ. 100 కోట్ల విలువైన మద్యం అమ్మి ప్రజల డబ్బును దోచుకున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించకుండా చోద్యం చూస్తుందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ఖజానా ఖాళీ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంపై అప్పుల భారం మోపుతున్నారని విమర్శించారు. మరోసారి రాష్ట్ర రవాణా చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచి చార్జీల భారం పేదప్రజలపై బాదడానికి కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, జిల్లా ఇన్ చార్జ్ వెంకట్ రెడ్డి, జిల్లా సహా ఇన్ చార్జ్ వీరేంద్ర గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణారెడ్డి, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story