- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందుంది కొత్త ‘పంచాయితీ’
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామాల్లో ‘ధరణి’ ఘర్షణలు ముదురనున్నాయి. ఇప్పటివరకూ నమోదైన వివరాలన్నీ ఇక పంచాయతీ నోటీసు బోర్డుకెక్కనున్నాయి. ఎన్యుమరేటర్లు, పంచాయతీ సిబ్బంది నమోదు చేసిన ఆస్తుల నమోదును పంచాయతీల పరిధిలో బహిర్గతం చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 29న ధరణి ప్రారంభం చేయనుండగా..వ్యవసాయ భూములకే పరిమితం చేస్తారని స్పష్టంగా చెబుతున్నారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం, గ్రామాల్లో సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ఉండవు. వ్యవసాయేతర ఆస్తులపై చాలా ప్రాసెస్ ఉంటుందని, వాటిని గ్రామస్థాయిలో నోటీసు బోర్డులపై ప్రదర్శించిన తర్వాత, అభిప్రాయాలు స్వీకరించి సవరణలు చేసిన అనంతరమే ధరణి పోర్టల్‌లో కనిపించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఆస్తుల నమోదు ప్రక్రియ అటు అధికారులకు భయం కలిగిస్తోంది. ప్రస్తుతం హడావిడిగా గ్రామాల్లో నమోదు చేసినా నోటీసు బోర్డులపై ప్రదర్శించిన తర్వాత ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయనే ఆందోళన మొదలైంది.
‘ధరణి’ ఘర్షణలు..
గ్రామాల్లో ఇప్పటికే ధరణి ఘర్షణలు జరుగుతున్నాయి. నివాస స్థలాల అంశాల్లో, ఆస్తుల నమోదు ప్రక్రియలోనే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని గొడవలకు దిగారు. నమోదుకు వచ్చిన వారిపై తిరగబడ్డారు. అటు పంచాయతీల్లో కూడా సిబ్బందిని ఇష్టానుసారంగా నమోదు ప్రక్రియకు వినియోగించుకున్నారు. అక్షరజ్ఞానం లేని వారికి కూడా నమోదు పనులు అప్పగించారు. కొత్తగా ఎన్యుమరేటర్లతో చేయించారు. దీంతో కనీస సమాచారం తెలియకుండానే ఆస్తుల నమోదు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 93.1 శాతం వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ముగిసింది. ఈ పండుగ సీజన్‌లో సొంతూళ్లకు వచ్చిన వారి నుంచి వివరాలు తీసుకుని 100 శాతం పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ భావిస్తోంది. కానీ, ఇంకో రెండు, మూడు శాతం కంటే ఎక్కువ కాదని తెలుస్తోంది.
కాగా, వ్యవసాయేతర ఆస్తుల నమోదు మొత్తం పంచాయతీ నోటీసుబోర్డులకెక్కనుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఆదేశాలు జారీ కాలేదు. అయితే, నోటీసు బోర్డుల్లో ప్రదర్శనకు వివరాలు ఉంచితే గొడవలు జరుగుతాయనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఇంటి పేర్ల నుంచి మొదలుకుని వారసుల నమోదు, స్థలాల లెక్కలు, హద్దు పంచాయతీలన్నీ తలకెక్కనున్నాయి. ఈ వ్యవహారం మొత్తం పంచాయతీ కార్యదర్శికే వర్తిస్తుందని ఆందోళన చెందుతున్నారు. బోర్డుల్లో ప్రదర్శించడం ద్వారా తప్పులను సవరించే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చెప్పుతున్నారు. సవరణల కార్యక్రమం మంచిదే అయినప్పటికీ..ఇప్పటి వరకు జరిగిన తప్పులపై అటు అధికారులపై, ఇటు సరిహద్దుల్లో యజమానులపై కచ్చితంగా గొడవలు జరుగుతాయని భయపడుతున్నారు.
సెలువులకు సెక్రెటరీలు..
ఇప్పటి వరకు ఉన్న వివరాలతో నమోదు చేసినా..అవన్నీ త్వరలో బహిర్గతం చేస్తే కచ్చితంగా తమపై దాడులు జరుగుతాయంటున్నారు పంచాయతీ కార్యదర్శులు. ఇప్పటికే చాలా చోట్ల సెక్రెటరీలపై గ్రామాల్లో పీకలదాకా కోపంతోనే ఉన్నారు. దీనికి ఆజ్యం పోసే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వర్గాలు, పార్టీలు, సంఘాలు అంటూ అంతా కలిసి పంచాయతీ కార్యదర్శులపైనే ప్రతాపం చూపిస్తున్నారు. ఆస్తుల నమోదులో వెల్లడయ్యే తప్పులను మరింతగా కార్యదర్శులపైనే రుద్దుతారని, దీనికి ఆజ్యం పోసేవారు ఉండటంతో దాడులు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది సెలవుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆస్తుల నమోదు ప్రక్రియకు ముందు సెలవులు రద్దు చేశారు. ఇప్పుడు సెలవులు ఇవ్వాలని, లేకుంటే ఉద్యోగాలను వదులుకునే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల కొలువు ముళ్ల కిరీటంగా భావించి ఇప్పటికే 3 వేలకుపైగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
29న పోర్టల్ ప్రారంభం..
ఈ నెల 29న వ్యవసాయ భూములతోనే ధరణి పోర్టల్ ప్రారంభించనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో ఇంకా చాలా సమస్యలు ఉండటం, వాటిని పంచాయతీల్లో బహిర్గతం చేసిన తర్వాతనే రికార్డుల్లోకి ఎక్కిస్తామని చెప్పుతుండటంతో ఎల్లుండి ప్రారంభమయ్యే ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలు కనిపించే అవకాశాలు లేవు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 29 నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా జాయింట్ రిజిస్ట్రేషన్లు, తహసీల్దార్లకు సహకరించడం తదితర అంశాలపై రిజిస్ట్రేషన్ శాఖలో కూడా విస్తృతంగా చర్చిస్తున్నారు. మూడు రోజుల కిందట సీఎస్ సోమేష్ కుమార్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయానికి వెళ్లి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజుల నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది దీనిపైనే కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తుల అంశంలో చాలా సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు అంటున్నారు.