- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో ముసలం.. ఆయనకు చెక్ పెడుతున్న మహిళా నేత
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ముధోల్ బీజేపీలో ముసలం రాజుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవికి, ఇటీవల పార్టీలో చేరిన పారిశ్రామిక వేత్త భోంస్లే మోహన్ రావు పటేల్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఒకే వేదికపైకి రావటం లేదు. పటేల్ రాకను మొదటి నుంచి వ్యతిరేకించిన రమాదేవి.. తాజాగా ఇద్దరు కలిసి పార్టీ కోసం పని చేసే పరిస్థితి లేదు. రమాదేవి వ్యతిరేకులను పటేల్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయగా.. తమ సామాజికవర్గం బలంగా ఉన్న పల్లెలకే పరిమితమవుతున్నారు. ఇక పటేల్‌కు పార్టీలో పట్టు, పదవి, ప్రాతినిధ్యం లేకుండా రమాదేవి చెక్ పెడుతోంది. దీంతో ముధోల్ బీజేపీ రాజకీయం ఆసక్తికరంగా మారగా.. క్యాడర్‌లో మాత్రం గందరగోళం, అయోమయం నెలకొంది..!
ముధోల్ నియోజకవర్గ బీజేపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవికి, ఇటీవల పార్టీలో చేరిన పారిశ్రామిక వేత్త భోంస్లే మోహన్ రావు పటేల్ మధ్య గ్రూపు రాజకీయం తారా స్థాయికి చేరింది. దీంతో ముధోల్ నియోజక వర్గంలో బీజేపీ రెండు వర్గాలుగా విడిపోగా.. క్యాడర్లో తీవ్ర గందరగోళం, అయోమయం నెలకొంది. ఇప్పటి వరకు టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల్లో ఉన్న మోహన్ పటేల్ ఇటీవల బీజేపీలో చేరారు. ఆయన చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు.. ఆయన చేరిక సమయంలో ఢిల్లీకి వెళ్లలేదు. ఆయన రాకను వ్యతిరేకించిన ఆమె.. ఆయనతో కలిసి పని చేయటానికి సుముఖంగా లేరు. దీంతో ఆయనను పట్టించుకోకుండా.. తన వర్గంతో ముందుకెళ్తున్నారు.
రమాదేవి వ్యతిరేక వర్గీయులకు దగ్గరయ్యేందుకు పటేల్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భైంసా మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా చీలిపోగా.. రమాదేవి వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు పటేల్ గ్రూపులో చేరిపోయారు. బీజేపీకి సంబంధించిన కార్యక్రమాలు దారాబ్జి ఫ్యాక్టరీలో చేసుకుంటున్నారు. ఇక నియోజకవర్గంలో కూడా తన వర్గంతో కలిసి పర్యటిస్తున్నారు. తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పల్లెలకే పరిమితం అవుతున్నారు.
ఇక రమాదేవి వర్గీయులను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా వారిని కలుస్తున్నా.. వారంతా మళ్లీ ఆమె వెంటనే నడుస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఇటీవల నిర్మల్‌లో అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయనను ఇంచార్జీగా బాధ్యత ఇవ్వాలని కోరగా.. ఇందుకు రమాదేవి అడ్డు పడ్డారు. దీంతో జన సమీకరణ చేసేందుకు పరిమితమయ్యారు. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత, పదవి, పట్టు లభించకుండా రమాదేవి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారనే చర్చ ఉంది. తన ఆస్తులు, భూములను రక్షించుకునేందుకే ఆయన పార్టీలో చేరారని ఆమె వర్గం పేర్కొంటోంది. ఆయన భూవ్యవహారాలపై అధిష్టానానికి నివేదిక ఇచ్చేందుకు ఆధారాలు సేకరించే పనిలో ఆమె నిమగ్నమైనట్లు చర్చ సాగుతోంది.
మరోవైపు రమాదేవికి క్షేత్ర స్థాయిలో కొంత వ్యతిరేక పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఇటీవల భైంసా అల్లర్ల బాధిత కుటుంబాలను ఎంపీ సోయం బాపురావు పరామర్శించేందుకు వచ్చారు. ఆయనతో పాటు భట్టిగల్లీకి రమాదేవి వెళ్లగా.. ఆమె వ్యతిరేక వర్గీయులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేయటంతో.. మధ్యలోనే కారు ఎక్కి వెళ్లిపోయారు. దీని వెనుక పటేల్ హస్తం ఉందని.. వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని ఆమె వర్గం ఆరోపిస్తోంది. ఆమె భైంసాలోని పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు చేస్తుండగా.. వ్యతిరేక వర్గీయులు రావటం లేదు.
నియోజక వర్గంలోని సమస్యలపై పోరాటం చేయటంలో వైఫల్యం చెందారని.. గత మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాకుండా కొన్ని వార్డుల్లోనే అభ్యర్థులను పెట్టి ఎంఐఎం మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు పరోక్షంగా సహకరించారని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోవటంతో.. కార్యకర్తలు ఎటు పోవాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. పార్టీ పెద్దల వద్ద పట్టు ఉన్న రమాదేవికి క్షేత్రస్థాయిలో మాత్రం వ్యతిరేకత పెరుగుతోందని.. ఇందుకు పటేల్ వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీలో చర్చ మొదలైంది. ఈ వర్గ పోరులో పైచేయి ఎవరిదో వేచిచూడాలి.