ఆ తహసీల్దార్‌ ఆఫీసులో పొంచి ఉన్న ప్రమాదం

by Shyam |
ఆ తహసీల్దార్‌ ఆఫీసులో పొంచి ఉన్న ప్రమాదం
X

దిశ, తుంగతుర్తి: చూడడానికి లోపల అందంగా ఉన్న కార్యాలయం…! కార్యాలయం లోపలికి అడుగుపెట్టే వారంతా అబ్బో..! అని ముక్కు మీద వేసుకునే విధముగా ఆశ్చర్యపోతారు. కానీ, ఆ అనుభూతి పొందేవారంతా ఒక్కసారి తల పైకి ఎత్తి చూస్తే కలిగిన ఆశ్చర్యం అంతా కరిగి పోవాల్సిందే. ఇంతకీ ఈ సీన్ అంతా ఎక్కడో కాదండీ…! స్లాబు శిథిలావస్థకు చేరి పై పెచ్చులు లేచి.. ఎప్పుడు ఎవరి మీద పడతాయో తెలియని పరిస్థితి సాక్షాత్తు నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. విచిత్రం ఏమిటంటే..? స్లాబు పెచ్చులు ఊడిపోయే స్థలం కింద తహసీల్దార్ తన కుర్చీలో కూర్చొని విధులు నిర్వహిస్తుండడం గమనార్హం.

అంతేకాకుండా వివిధ సందర్భాలలో కార్యాలయానికి వచ్చే ఉన్నతాధికారులు తహసీల్దార్ కుర్చీలోనే కూర్చోవడం కూడా గమనార్హం. ముఖ్యంగా గతంలోనే ఈ కార్యాలయం దాదాపు శిథిలావస్థలోకి చేరుకుంది. వర్షం వస్తే స్లాబ్ అంతా కురవడంతో పాటు అప్పుడప్పుడు కార్యాలయంలోని పలురకాల ఫైళ్లు తడిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా కార్యాలయం లోపల, బయటి భాగంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు కొన్ని మరమ్మతులు జరిగాయి.

అయితే కాలానుగుణంగా పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయి. అంతేకాకుండా సాక్షాత్తు తహసీల్దార్ కూర్చుండే గదిలోనే స్లాబు శిథిలావస్థకు చేరి పై పెచ్చులు లేచి తలపై పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ దుస్థితి అధికారుల కళ్ళకు కనిపించడం లేదా..? లేక చూసి పట్టించుకోవడం లేదా..? అనేది వారికే తెలియాలి. జరగరాని సంఘటనలు జరిగిపోయాక నెత్తి, నోరు బాదుకోవడం తప్పా ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed