భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన ఒడిషా కుర్రాడు

by Shyam |   ( Updated:2021-08-20 02:32:39.0  )
భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన ఒడిషా కుర్రాడు
X

దిశ, ఫీచర్స్ : సాధించే సత్తా ఉంటే సమరం ఓ సయ్యాట.. గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట అన్నాడో సినీ కవి. అది నిజమని నిరూపిస్తున్నాడు ఒడిషా క్రికెటర్ అభిషేక్ శుక్లా. దివ్యత్వమున్నా ఏనాడు వెనకడుగు వేయలేదు. తన లోపాన్ని చూసి ఏనాడూ కుంగిపోలేదు. విధిని ఎదురించి క్రికెట్‌పై పట్టు సాధించి, సెప్టెంబర్‌లో జరగబోయే భారత్ -బంగ్లాదేశ్ సిరీస్ కోసం భారత వికలాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు.

అభిషేక్ గ్రౌండ్‌లో దిగేవరకు ఒక లెక్క.. దిగిన తర్వాత మరో లెక్క. గంటకు 115 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే అభి, బ్యాటింగ్‌లోనూ తనదైన ఆటతీరుతో మెప్పించగలడు. అభి లెఫ్ట్ హ్యాండ్ మోచేయి వరకే ఉంటుంది. పుట్టుకతోనే దివ్యత్యమున్న పట్టుదలతో అన్ని పనుల్లోనూ తనదైన నేర్పరితనం ప్రదర్శిస్తాడు. గ్రౌండ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన చేసే ఈ 23 ఏళ్ల కుర్రాడు జీవితంలోనూ ఆల్‌రౌండరే. బాల్యం నుంచే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న అతడు అందులో మెలకువలు నేర్చుకుంటూ ఎదిగాడు 15ఏళ్ల వయసులో ‘బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (BDCI)- ఒడిషా’ యూనిట్ దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుంచి అతను అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ టోర్నమెంట్‌లలో పాల్గొంటూ అద్భుతమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌‌‌లోని మూడు ఫార్మాట్లకు ఎంపిక కాగా ఆగస్టు 4 -8 వరకు హైదరాబాద్‌లో జరిగిన బీడీసీఐ శిబిరంలో కూడా పార్టిసిపేట్ చేశాడు.

సుందర్ గఢ్ జిల్లాలోని రాజ్‌గంగ్‌పూర్ గోశాలపాడులో చిన్న ఇంట్లో అభిషేక్ నివాసిస్తున్నాడు. క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే తండ్రి శివ్ జీతంపైనే కుటుంబం ఆధారపడింది. అతడి సోదరుడు, సోదరి ఇద్దరూ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇక అభిషేక్‌తో పాటు తన పక్క జిల్లాలోని బెల్పహార్‌కు చెందిన డిసేబుల్డ్ ఆల్ రౌండర్ జగ్జిత్ మొహంతిని కూడా భారత జట్టుకు ఎంపికయ్యాడు. కుడి చేతి వైకల్యమున్నా జగ్జిత్ ఎడమ చేతి బ్యాట్స్‌మన్, లెగ్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు.

‘క్రికెట్ నా ప్రాణం. భారత జట్టుకు ఎంపికకావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఎంపిక అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికి, సుదీర్ఘమైన క్రీడా జీవితంలో జట్టులో నా స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశాన్ని సంపాదించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటాను. నా తండ్రి శివ్ శుక్లా కుటుంబానికి ఏకైక పోషకుడు, ఆర్థిక కష్టాల్లో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉద్యోగం పొందాలని కోరుకుంటున్నాను’
-అభిషేక్

Advertisement

Next Story

Most Viewed