ఆదర్శంగా ధారావి!

by  |
ఆదర్శంగా ధారావి!
X

ముంబైలో ధారావి మురికివాడ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఇది ముందంజలో ఉంటుంది. ధారావి వెళ్లి చూస్తే జనసాంద్రత అనే పదానికి ప్రత్యక్ష నిర్వచనంగా కనిపిస్తుంది. చేతులు బార్లాచాపి రోడ్డు మీద నిలుచుంటే, ఆ చేతులు కనీసం నలుగురికి తగులుతాయి. అసలే కొవిడ్ 19 కారణంగా మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం ఉండాలనే నిబంధన ధారావిలో పాటించడం చాలా కష్టమైన పనే. అలాంటి ప్రాంతంలో కరోనా వైరస్ ఒక్కరికి వచ్చినా అల్లకల్లోలమే అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే కరోనా ఆ ప్రాంతానికి చేరింది. కానీ అల్లకల్లోలం జరగలేదు. నిరంతరం శ్రమించి పనిచేసిన అధికారులు, వైద్యసిబ్బంది, సమగ్రమైన ప్రభుత్వ ప్రణాళిక కారణంగా ఒక్కొక్క కేసు తగ్గుతూ వచ్చి, ఇప్పుడు ఆదర్శంగా నిలిచింది.

దేశంలో లాక్‌డౌన్ విధించిన వారం రోజులకు ధారావిలో మొదటి కేసు నమోదైంది. ఏప్రిల్ రెండో వారానికి కొవిడ్ 19 హాట్‌స్పాట్‌గా మారింది. గ్రేటర్ ముంబై కార్పోరేషన్ దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంది. వైరస్ ప్రబలుతోందని అనుమానం రాగానే ధారావికి రాకపోకలు నిషేధించారు. అక్కడి పబ్లిక్ టాయ్‌లెట్లను క్రిమిసంహారక మందుతో శుభ్రం చేయించారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేయడంతో పాటు వారికి ఆహారం అందించారు. ప్రైవేటు ప్రాక్టిషనర్లను రంగంలోకి దించారు. చిన్న లక్షణం కనిపించినా చిరాకు పడకుండా టెస్టు చేశారు. ట్రీట్‌మెంట్ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రైవేటు ఆసుపత్రులను కూడా కొవిడ్ పరీక్షా కేంద్రాలుగా మార్చారు. హాస్టళ్లు, లాడ్జిలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు.

ఫీవర్ క్యాంపులు పెట్టి, డాక్టర్ల బృందాలు ప్రతిరోజు ధారావి వాసుల శరీర ఉష్ణోగ్రతలు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేశారు. దాదాపుగా 3,60,000ల మందికి ఈ పరీక్షలను నిర్వహించినట్లు సమాచారం. ప్రతి ఒక్కరికీ టెస్టు చేసి, ఏ చిన్న లక్షణం కనిపించినా క్వారంటైన్‌కు తరలించారు. వారు చేసిన టెస్టులకు లెక్కేలేదు. అయితే వలస కార్మికుల కోసం రైళ్లు ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 1.5 లక్షల మంది ధారావి ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో అధికారుల మీద కొద్దిగా ఇబ్బంది తగ్గింది. ఇక పరీక్షలు, క్వారంటైన్ పనులు మరింత వేగవంతం చేసి ఇప్పుడిప్పుడే ధారావిని కొవిడ్ రహిత ప్రాంతంగా మార్చి ఆదర్శంగా నిలిచారు.


Next Story

Most Viewed