- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రియల్’ టెన్షన్..!
నిన్న మొన్నటి దాకా రియల్ ఎస్టేట్ అంటూ బీరాలు పలికిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘ధరణి’లో నమోదు, ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మొన్నటి దాకా కరోనా వైరస్ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడిప్పుడే కాలం కలిసివస్తుందని అనుకుంటున్న సమయంలోనే ఎల్ఆర్ఎస్, ధరణి రూపంలో రెండు పిడుగులు నెత్తిన పడ్డాయి. ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో లక్ష మందికి పైగా ఈ దందాలో పెట్టబడులు పెట్టి, మధ్యవర్తిత్వం చేసి సమస్యలను ఎదుర్కొన్నట్లు అంచనా. వీరిలో కమీషన్ల మీదే ఆధారపడి బతుకుతోన్న వారు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. ఎటు చూసినా కోలాహలంగా కనిపించే వెంచర్లు, కార్యాలయాలన్నీ ఇప్పుడు బోసిపోయాయి. మొత్తంగా ‘రియల్’ రంగానికి ఇప్పుడు రంది పట్టకుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి’ రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర ప్రభావం చూపేటట్లు కనిపిస్తోంది. సాగు భూములకే పరిమితమైన పోర్టల్ ను వ్యవసాయేతర ఆస్తులకూ విస్తరించడంతో గందరగోళం నెలకొంది. అందులో ఇండ్ల వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. అందులోనూ అసెస్మెంట్లు చేసిన వాటికి మాత్రమే చోటు లభించింది. ఐతే ఓపెన్ ప్లాట్ల హక్కులపై పేచీ పెట్టారు. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తులుగా ఉన్న ప్లాట్లను నమోదు చేయడం లేదు. మరోవైపు ధరణిలో నమోదైన ఆస్తులను మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తామని, సౌకర్యాలు కల్పిస్తామంటూ సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు ప్రకటించారు. ఇప్పుడేమో వాటిని గాలికొదిలేశారు. ఇంకో వైపున అక్రమ లేఅవుట్లు, అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులను తీసుకునే ప్రక్రియ నడుస్తోంది. ఈ క్రమంలోనే లక్షలాదిగా దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎప్పటికి ప్రారంభమవుతాయో అర్థం కాక జనం తల్లడం మల్లడమవుతున్నారు. మరో 15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. అవన్నీ హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు కలిగిన ప్లాట్లు మాత్రమే. వాటి కంటే సింహభాగం అనధికార లేఅవుట్లే ఉన్నాయన్నది నిర్వివాదాంశం.
ఏం చేయాలో స్పష్టత కరవు..
ఆగస్టు నెల నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వీర్యమైంది. కొత్త మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాల ఆధారంగా అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను ఆకస్మాత్తుగా నిలిపివేస్తూ అప్పటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ చిరంజీవులు అన్ని సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు సర్క్యులర్లను పంపారు. ఆ తర్వాత రెండు రోజులకే ఎల్ఆర్ఎస్ స్కీంను ప్రకటించారు. అప్పటి దాకా యథేచ్ఛగా సాగించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు విలువ లేకుండా చేశారు. స్టాంపు డ్యూటీ చెల్లించి చేతులు మారిన ఆస్తులకు హక్కులపై సందేహాలను కలిగించారు. ఇప్పుడేమో ‘ధరణి’తో పేచీ పెట్టారు. ఏ రికార్డుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేపట్టాలో స్పష్టమైన ఆదేశాలేవీ తమకు ఇవ్వలేదని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. కనీసం హెచ్ఎండీఏ, డీటీసీపీల నుంచి అనుమతి పొందిన లేఅవుట్లలోని ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేయాలో చేయొద్దో తెలియక అయోమయానికి గురవుతున్నారని తెలిసింది. ధరణి వ్యవసాయ భూములకే పరిమితమైన సాఫ్ట్ వేర్ మాడ్యూల్ ను వ్యవసాయేతర ఆస్తులకూ ముడి పెట్టడంతో సందిగ్ధ వాతావరణం నెలకొంది. ఎప్పటికీ ఈ అంశంలో స్పష్టత లభిస్తుందో కూడా తెలియడం లేదంటున్నారు.
ఎల్ఆర్ఎస్ కు నెలలే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకానికి అనూహ్య స్పందన లభించింది. 24,14,337 దరఖాస్తులను క్రమబద్ధీకరించాలంటూ ₹1000 వంతున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించి వాటికి ఎంత ఫీజు చెల్లించాలో నోటీసులు జారీ చేయడం, వాటిని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నోటీసులు జారీ చేయడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. మరో మూడు రోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆఖరి మూడు రోజుల్లోనూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అప్పటి వరకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. దీంతో రియల్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
వరుస పిడుగులు..
లాక్ డౌన్, కరోనాకు ముందు హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి ఊర్లో రియల్ ఎస్టేట్ దందా అసాధారణ స్థాయిలో కనిపించింది. ఇప్పుడేమో ఆ వెంచర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అగ్రిమెంటుకు పెట్టిన పెట్టుబడుల కోసం చాలా మంది తిరుగుతున్నారు. ఎవరి నుంచైతే కొనుగోలు చేశారో వారిని వాపసు ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. ఇప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేంత డబ్బులు చేతికందే అవకాశం లేకపోవడం, మరొకరి చేతి కొనిపించేంత స్థాయి కనుచూపు మేరలో లేవు. దాంతో అప్పులకు వడ్డీలు కట్టడం కంటే అగ్రిమెంటు సొమ్మును తిరిగి తీసుకోవడమే ఉత్తమమన్న అభిప్రాయంలో ఉన్నారు. ప్రతి ఊరిలోనూ రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటూ చర్చించుకుంటున్నారు. వ్యాపారుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది.