అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి.. తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాలు.. ఏంటో తెలుసా..?

by Sumithra |
అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి.. తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాలు.. ఏంటో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్ : దేవి నవరాత్రులు రానే వచ్చేశాయి. దసరా నవరాత్రులు మొదలయ్యాయంటే చాలు అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి మొదలవుతుంది. ఆలయాల్లో మాత్రమే కాదు కొంత మంది అమ్మవారిని మండపాలలో ప్రతిష్టించి నవరాత్రులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. మరికొంత మంది తమ ఇంటిలో అమ్మవారిని ప్రతిష్టించుకుంటారు. అంతే కాదు ఈ తొమ్మిది రోజులలో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారిని అలంకరించి ఆ దేవతకు ఎంతో ప్రీతికరమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. మరికొంత మంది అమ్మవారి మాలధారణ చేసి తొమ్మిది రోజుల పాటు ఉపవాసం కూడా చేస్తారు. అలా చేస్తే భక్తులను అమ్మవారు కాపాడుతుందని, శత్రు పీడ నుంచి రక్షణ కల్పించి, భక్తులు కోరిన కోరికలు తీరుస్తుందని వారి నమ్మకం.

అమ్మను అలంకరించే విధానం..

ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. అయితే ఏ రోజు ఏ రూపంలో అలంకరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


1. శ్రీ బాలాత్రిపుర సుందరి

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవిని మొట్టమొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్ని బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. ఈ అమ్మవారిని దర్శిస్తే మానసిక బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ దేవి అభయ హస్త ముద్రతో భక్తులను కరుణిస్తుంది.


2. శ్రీ గాయత్రి దేవి

నవరాత్రుల్లో అమ్మవారు రెండవ రోజు శ్రీ గాయత్రీ మాత అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తుంది. గాయత్రీ మాత సంధ్యావందనం అధి దేవత. గాయత్రీ మాత మంత్రం జపించినా, విన్నా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాగే ప్రతి రోజూ త్రి సంధ్యా సమయాల్లో వేయి సార్లు గాయత్రి మంత్రాన్ని చదివితే వాక్సుద్ది కలుగుతుందని విశ్వసిస్తారు.


3. శ్రీ మహాలక్ష్మి

నవరాత్రుల్లో మూడో రోజు మంగళ ప్రదాయినీ శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తుంది. ఈ రూపంలో వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, రెండు చేతులలో కమలాలని పట్టుకుని దర్శనిమిస్తుంది.


4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి

ఇక నాలుగో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది. అన్నపూర్ణ అంటే నిత్యాన్నదానేశ్వరి. సమస్త జీవకోటిని ఈ అమ్మవారు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది.


5. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

దేవీనవరాత్రుల్లో అమ్మవారు ఐదవరోజు శ్రీ లలితా దేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది. కామేశ్వర రూపంలో త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. లలితా దేవి శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఈ అమ్మవారు ఒక చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూల బాణాలతో దర్శనం ఇస్తుంది.


6. శ్రీ మహా సరస్వతీ దేవి

ఇక నవరాత్రుల్లో ఆరవ రోజున అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే అనే రాక్షసులను వధించింది.


7. శ్రీ దుర్గా దేవి

ఏడవ రోజు అమ్మవారు శ్రీ దుర్గామాత అలంకరణలో దర్శనం ఇస్తుంది. ఈ రూపంలో అమ్మవారు దుర్గతులను నాశనం చేస్తుందని ప్రతీతి. ఈ రూపంలో అమ్మవారు రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది.


8. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి

నవరాత్రుల్లో ఎనిమిదవ రోజున అమ్మవారు మహిషాసుర మర్ధినీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. దేవతలందరూ తమ తమ శక్తులను దారపోయడంతో మహిశాసురున్ని వధించడానికి ఈ రూపం దాల్చిందని పురాణాలు చెబుతున్నాయి.


9. శ్రీ రాజరాజేశ్వరి దేవి

నవరాత్రుల్లో చివరి రోజైన తొమ్మిదవ రోజు శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారు ప్రతినిత్యం విజయాలను పొందుతుంది కాబట్టి ‘విజయ' అని కూడా పిలుస్తారు.

Advertisement

Next Story

Most Viewed