నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..

by Y.Nagarani |
నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకూ.. శాస్త్రోక్తంగా ఈ అంకురార్పణ చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా భూదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పుట్టమన్నులో వేద పండితులు నవధాన్యాలను నాటనున్నారు. వాటికి మొలకలు వచ్చేంత వరకూ నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కావడంతో అంకురార్పణం అని పిలుస్తారు. చంద్రుని కాంతిలో విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నది నమ్మకం.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూర్తయ్యాక.. రంగనాయకులవారి మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికినట్లు లెక్క. రేపు (అక్టోబర్ 4) సీఎం చంద్రబాబు స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్తాలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్యలో ధ్వజారోహణ ఘట్టం నిర్వహించి.. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్వామివారిని పెద్ద శేషవాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగిస్తారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల గిరులన్నీ విద్యుద్దీపకాంతులతో ధగధగ మెరిసిపోతున్నాయి. శ్రీవారి దర్శనానికి, బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. దసరా సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. రోజుకు సుమారు లక్ష మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేసింది. కాగా.. నేటి నుంచి వీఐపీ సిఫార్సు దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. నేరుగా వచ్చిన వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలను ఇవ్వనుంది. సర్వదర్శనాలకు వచ్చే భక్తులకు ఒక్కరోజులోనే స్వామివారి దర్శనం కల్పించేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈఓ శ్యామలారావు వెల్లడించారు.

Next Story

Most Viewed