షహీన్‌బాగ్ కాదు.. ఢిల్లీ పోలీసులది తప్పు : ‘సుప్రీం’ మధ్యవర్తి

by Shamantha N |
షహీన్‌బాగ్ కాదు.. ఢిల్లీ పోలీసులది తప్పు : ‘సుప్రీం’ మధ్యవర్తి
X

దిశ, వెబ్‌డెస్క్ : షహీన్‌బాగ్ ఆందోళనల వల్ల.. ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని, ప్రదర్శనా స్థలాన్ని మార్చుకొని మరోచోట నిరసనలు చేసుకోవాలని ఆదేశించాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు విచారిస్తూ.. నిరసన పౌరుల ప్రాథమిక హక్కు కానీ.. ఇతరుల స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగానే షహీన్‌బాగ్ ఆందోళనకారులతో చర్చించి పౌరుల సమస్య పరిష్కారించేందుకు సుప్రీంకోర్టు మొత్తం ముగ్గురు మధ్యవర్తులను నియమించింది. ఇందులో సాధన రామచంద్రన్, సంజయ్ హెగ్దేలతోపాటు మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వజాహత్ హబీబుల్లా ఉన్నారు. నిరసనకారులతో నేరుగా మాట్లాడి హబీబుల్లా రూపొందించిన అఫిడవిట్ కీలక అంశాలను ఎత్తిచూపింది. ట్రాఫిక్ సమస్యకు ‘షహీన్‌బాగ్’ కారణం కాదనీ, అక్కరలేకున్నా ఇతర రోడ్లను బ్లాక్ చేసిన ఢిల్లీ పోలీసులదీ తప్పిదమని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ట్రాఫిక్ సమస్యకు షహీన్‌బాగ్ ఆందోళనలు కాదు.. ఢిల్లీ పోలీసులది బాధ్యత అని తెలిపారు. నోయిడా, ఢిల్లీలను కలిపే ఒక రోడ్‌ను దిగ్బంధిస్తూ డిసెంబర్ నుంచి షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, షహీన్‌బాగ్ ఆందోళన ప్రాంతంతో సంబంధంలేని ఇతర రోడ్లనూ పోలీసులు బారికేడ్లతో మూసేశారని హబీబుల్లా అఫిడవిట్‌ వివరించింది. ఢిల్లీ పోలీసులు సక్రమ విధులు నిర్వహించకుండా.. ట్రాఫిక్ సమస్యకు షహీన్‌బాగ్‌ను కారణంగా చూపుతున్నారని ఆరోపించింది. జీడీ బిర్లా, జామియా మిలియా ఇస్లామియా, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, మహారాణి బాగ్, సుఖ్‌దేవ్ విహార్ రోడ్లనూ అనవసరంగా పోలీసులు బ్లాక్ చేశారని తెలిపింది. ఒకవేళ ఈ రోడ్లనూ ఓపెన్ చేస్తే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడదని హబీబుల్లా అభిప్రాయపడ్డారు.

షహీన్‌బాగ్‌లో నిరసనలు శాంతియుతంగా చేపడుతున్నారని హబీబుల్లా వివరించారు. తమను దేశద్రోహులని, పాకిస్థానీయులని, ఉగ్రవాదులని కొందరు ఆరోపించడం బాధించిందని షహీన్‌బాగ్ ఆందోళనకారులు తనతో పంచుకున్నట్టు తెలిపారు.

Read also..

అఖండ జ్యోతికి ఘన స్వాగతం

Advertisement

Next Story

Most Viewed